4
1 బంగారం✽ ఎంత కాంతిహీనమైంది!మేలిమి బంగారానికి ఎంత మార్పు కలిగింది!
దేవునికి అర్పించిన రత్నాలు ప్రతి వీధి మొగను
పారవేయడం జరిగింది.
2 సీయోను ప్రియ ప్రజలు ఒకప్పుడు
మేలిమి బంగారంతో పోల్చతగ్గవారై ఉన్నా,
ఇప్పుడు కుమ్మరివాడు చేసిన మట్టి
కుండలతో సమానమని ఎంచబడుతున్నారు.
3 ✽నక్కలు సహా చన్నిచ్చి తమ పిల్లలకు పాలిస్తాయి.
అయితే నా ప్రజ ఎడారిలో ఉన్న
నిప్పుకోడి✽లాగా క్రూర ప్రజగా తయారైంది.
4 ✽దాహంచేత చంటిపిల్ల నాలుక అంగిటికి
అంటుకొని ఉంది.
పసిపిల్లలు అన్నమడుగుతారు గాని
వారికి ఎవరూ పెట్టరు.
5 ✽మునుపు రుచిగల భోజనం చేసినవారు
దిక్కు లేక వీధులలో తిరుగుతున్నారు.
ఊదా రంగు గల వస్త్రాలు ధరించి పోషణ
పొందినవారు చెత్త కుప్పలమీద పడి ఉన్నారు.
6 ✽మనుషులెవరూ చెయ్యి వేయకుండానే
క్షణంలోనే సొదొమ పట్టణం నాశనం అయింది.
నా ప్రజల అపరాధం సొదొమవాళ్ళ పాపంకంటే
ఘోరంగా ఉంది.
7 ✽మునుపు నా ప్రజల నాయకులు
హిమంకంటే ప్రకాశమానంగా ఉన్నారు,
పాలంటే తెల్లగా ఉన్నారు.
వారి శరీరాలు కెంపుకంటే ఎర్రనివి.
వారి దేహ కాంతి నీలమణి కాంతిలాంటిది.
8 ✽ఇప్పుడు వారి ముఖాలు బొగ్గుకంటే
నల్లగా ఉన్నాయి.
వీధులలో వారిని ఎవరూ గుర్తుపట్టలేరు.
వారి చర్మం వాళ్ళ ఎముకలకు అంటుకొని ఉంది.
అది కట్టెలాగా ఎండిపోయింది.
9 కరవుకు గురి అయి, పొలం పంట లేక
నీరసించిపోయి బాధతో చనిపోయినవాళ్ళ
కంటే కత్తిపాలైనవాళ్ళ స్థితి మేలు.
10 ✽ జాలిగల స్త్రీలు తమ కన్న పిల్లలనే
తమ సొంత చేతులతో వండుకొన్నారు.
నా ప్రజలమీదికి వచ్చిన నాశన కాలంలో
వారి పిల్లలనే వారు పీక్కు తిన్నారు.
11 ✽యెహోవా తన ఆగ్రహాన్ని ఎంత మాత్రం
అణచుకోకుండా తన తీవ్ర కోపాన్ని
కుమ్మరించాడు.
సీయోనులో ఆయన మంట రాజబెట్టాడు.
అది దాని పునాదులను కాల్చివేసింది.
12 ✽ విరోధులూ శత్రువులూ జెరుసలం ద్వారాల
లోపల అడుగు పెట్టగలరని
భూరాజులు నమ్మలేదు.
లోకంలో ఎవరూ నమ్మలేదు.
13 ✽ అయినా దాని ప్రవక్తల పాపాల కారణంగా,
దాని యాజుల అపరాధాల కారణంగా
అలా జరిగింది.
దానిలో వాళ్ళు నిర్దోషుల రక్తాన్ని ఒలికించారు.
14 ✝తరువాత వాళ్ళే రక్తంచేత అశుద్ధులై
గుడ్డివాళ్ళలాగా వీధులలో తిరుగులాడారు.
వాళ్ళ బట్టలను కూడా ముట్టడానికి
ఎవరూ తెగించలేదు.
15 ✽“పోండి! మీరు అశుద్ధంగా ఉన్నారు.
పోండి, పోండి! మమ్మల్ని తాకవద్దు”
అని ప్రజలు వాళ్ళతో అన్నారు.
వాళ్ళు పారిపోయి వేరు స్థలాలలో
తిరుగులాడుతూ ఉన్నప్పుడు ఇతర ప్రజలు
“ఇకనుంచి వాళ్ళు ఇక్కడ
కాపురముండకూడదు” అన్నారు.
16 ✝యెహోవా తానే వాళ్ళను చెదరగొట్టాడు.
ఆయన వాళ్ళను సహనంతో
చూడడం మానుకొన్నాడు.
ప్రజలు యాజులను గౌరవించలేదు.
పెద్దలను దయ చూడలేదు.
17 ✝అంతలో సహాయంకోసం వ్యర్థంగా చూస్తూ,
మా కండ్లు మందగించాయి.
మమ్మల్ని రక్షించలేని జనంకోసం
మా కావలి గోపురాలలో నుంచి
చూస్తూ ఉన్నాం.
18 విరోధులు మా అడుగు జాడలను వేటాడారు.
మా వీధులలో మేము నడవలేకపోయాం.
మాకు అంతం దగ్గరపడింది.
మా రోజులు తీరిపోయాయి.
అంతం రానే వచ్చింది.
19 మమ్మల్ని తరిమేవాళ్ళు గాలిలో ఎగిరే
గరుడపక్షులకంటే వేగంగా వచ్చారు.
వాళ్ళు మమ్మల్ని కొండలమీద తరిమారు,
ఎడారిలో మాకోసం పొంచి ఉన్నారు.
20 ✽యెహోవాచేత అభిషేకం పొందినవాడు
వాళ్ళ గుంటలలో చిక్కుపడ్డాడు.
అతడు మాకు ముక్కుపుటాల ఊపిరిలాంటివాడు.
అతని నీడక్రింద ఇతర జనాల మధ్య
బ్రతుకుతామని మేమనుకొన్నాం.
21 ✽ఊజు✽ దేశంలో నివాసముంటున్న
ఏదోం కుమారీ! సంతోషించండి!
సంబరపడండి! అయితే ఈ గిన్నెలోది
మీరు కూడా త్రాగవలసివస్తుంది.
మీరు త్రాగి మత్తిల్లి మిమ్మల్ని దిగంబరం
చేసుకొంటారు.
22 సీయోనుకుమారీ! నీ శిక్ష తీరిపోతుంది✽.
నీవు బందీగా ఉన్న కాలాన్ని
యెహోవా పొడిగించడు.
ఎదోంకుమారీ! నీ అపరాధాలకు
ఆయన నిన్ను దండిస్తాడు,
నీ పాపాలను వెల్లడి చేస్తాడు.