3
1 ✽యెహోవా కోప దండానికి గురి అయిబాధలు అనుభవించిన మనిషిని నేను.
2 ✝ఆయన నన్ను పారదోలాడు,
చీకటిలోకి నడిపించాడు గాని
వెలుగులోకి కాదు.
3 ✝రోజంతా సారి సారికి ఆయన నామీద
చేయి ఎత్తుతూ ఉన్నాడు.
4 ✝నా చర్మం, నా శరీరం నీరసించిపోయేలా చేశాడు,
నా ఎముకలను విరగగొట్టాడు.
5 ✽ఆయన నన్ను ముట్టడించాడు,
నన్ను శ్రమ కష్టాల మధ్య ఉంచాడు.
6 ✝చాలాకాలం క్రిందట చనిపోయినవాళ్ళలాగా
నన్ను చీకటి గల స్థలాలలో ఉండేలా చేశాడు.
7 ✝నేను తప్పించుకోకూడదని
నా చుట్టు గోడ కట్టాడు,
బరువైన సంకెళ్ళతో నన్ను బంధించాడు.
8 ✽నేను మొరపెట్టినా సహాయంకోసం కేకలు వేసినా
నా ప్రార్థనను పెడచెవిని పెట్టాడు.
9 ✽ నా త్రోవలో అడ్డంగా చెక్కుడు రాళ్ళు ఉంచాడు.
నా మార్గాలను వంకర చేశాడు.
10 ✽ ఆయన నా పట్ల పొంచివున్న ఎలుగుబంటిలాగా,
దాగి చూచే సింహంలాగా ప్రవర్తించాడు.
11 దారినుంచి లాగివేసి నన్ను చీల్చివేశాడు.
నాకు దిక్కులేకుండా చేశాడు.
12 ✝తన విల్లు ఎక్కుపెట్టి నన్ను బాణానికి గురిగా చేశాడు.
13 తన అంబులపొదిలో ఉన్న బాణాలు
నా గుండెలో గుచ్చుకుపోయేలా చేశాడు.
14 ✝నా ప్రజలందరికీ నేను నవ్వుల పాలయ్యాను.
రోజంతా వాళ్ళు నన్ను గురించి హేళన పాటలు పాడారు.
15 ✽ఆయన నాకు చేదు పదార్థం తినిపించాడు.
నన్ను విషపు ద్రావకం వశం చేశాడు.
16 ✽గులకరాళ్ళతో నా నోటి పళ్ళను ముక్కలు చేశాడు.
బుగ్గిలో నన్ను త్రొక్కాడు.
17 ✝నాకు మనశ్శాంతి లేకుండా చేశాడు.
క్షేమమంటే ఏమిటో మరచిపోయాను.
18 ✽ “నాకు బలం ఉడిగింది,
యెహోవామీద నాకు ఆశాభావం
లేకుండా పోయింది” అంటున్నాను.
19 ✽నాకు కలిగిన బాధనూ హింసనూ
ఆ విషాన్నీ ఆ చేదునూ తలచుకో✽!
20 అవి నా జ్ఞాపకంలో ఎప్పుడూ ఉన్నాయి.
నా అంతరంగం అణగారిపోయింది.
21 అయితే ఒక సంగతి జ్ఞప్తికి తెచ్చుకొని
నేను ఆశాభావంతో ఎదురు చూస్తాను–
22 ✽యెహోవా దయామయుడు,
ఆయన కరుణాక్రియలకు అంతం అంటూ లేదు,
గనుకనే మనం నాశనం కాలేదు.
23 ప్రతి ఉదయమూ ఆయన కొత్తగా
కరుణ చూపుతూ ఉంటాడు.
యెహోవా! నీ విశ్వసనీయత గొప్పది.
24 ✽ “యెహోవాయే నాకు వంతు.
ఆయనకోసమే నేను నమ్మకంతో
ఎదురు చూస్తాను” అంటున్నాను.
25 ✽ ఆయనమీద ఆశాభావం ఉంచినవారికి
యెహోవా మేలు చేస్తాడు.
ఆయనను వెదికే వారిమీద దయ చూపుతాడు.
26 ✝యెహోవా ఇచ్చే రక్షణకోసం మౌనంగా
నమ్మకంతో ఎదురు చూడడం మంచిది.
27 ✽ఒక వ్యక్తి యువదశలో కాడి మోయడం మంచిది.
28 ✽ అతడిమీద దానిని మోపింది యెహోవా
గనుక అతడు మౌనం వహించి
ఒంటరిగా కూర్చుని ఉండాలి.
29 ఆశాభావానికి ఇంకా అవకాశం
ఉంటుందేమో అని అతడు నేల✽ను
ముఖం మోపాలి.
30 ✽తనను కొట్టడానికి చూచేవాడివైపు
తన చెంపను త్రిప్పాలి.
అతడు నిందపాలు కావాలి.
31 ✽ ప్రభువు ఎల్లప్పుడూ మనుషులను
విడిచిపెట్టి ఉండడు.
32 ఆయన వారికి బాధ కలిగించినా జాలిపడుతాడు.
ఆయన అనుగ్రహం గొప్పది.
33 ✽ మనుషులకు బాధ గానీ దుఃఖం గానీ
కలిగించడం ఆయనకు ఇష్టం లేదు.
34 ✽దేశంలో ఖైదీలందరినీ కాళ్ళక్రింద త్రొక్కడం,
35 సర్వాతీతుని ఎదుట మనిషినుంచి
న్యాయం తొలగించడం,
36 మనిషి హక్కును తారుమారు చేయడం
జరిగితే ప్రభువు చూడడా?
37 ✽ప్రభువు సెలవు లేనిది ఎవరు
మాట ఇచ్చి నెరవేర్చగలడు?
38 సర్వాతీతుని నోటి మాటవల్లే గదా,
విపత్తు గానీ క్షేమం గానీ కలుగుతుంది.
39 సజీవులలో ఎవరికైనా తమ అపరాధాలకు
శిక్ష వస్తే ఎందుకు మూలగడం?
40 ✽మన జీవిత విధానాలను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవావైపు
మళ్ళీ తిరుగుదాం.
41 ✽పరలోకంలో ఉన్న దేవునివైపు
మన చేతులతోపాటు మన హృదయాన్ని
ఎత్తుకొందాం.
42 “మేము అక్రమ కార్యాలు చేశాం,
తిరుగుబాటు చేశాం.
నీవు మమ్మల్ని క్షమించలేదు.
43 ✽నీవు కోపగించి మమ్మల్ని పారదోలావు.
కరుణ లేకుండా మమ్మల్ని హతం చేశావు.
44 ఏ ప్రార్థనా నీదగ్గరికి చేరకుండా
మేఘంతో నిన్ను కప్పుకొన్నావు.
45 జనాలమధ్య మమ్మల్ని మడ్డిలాగా, చెత్తలాగా చేశావు.
46 మా శత్రువులంతా మమ్మల్ని చూచి
దూషిస్తూ ఉన్నారు.
47 మేము భయానికీ గుంటకూ నాశనానికీ
పాడు స్థితికీ గురి అయ్యాం.”
48 ✽నా జనులు నాశనం కావడం కారణంగా
నా కన్నీరు మున్నీరుగా ఉంది.
49 యెహోవా పరలోకంనుంచి చూచి గమనించేవరకూ
50 నా కన్నీరు కారడం మానదు.
51 నా నగరంలో ఉన్న స్త్రీలందరినీ చూస్తూ ఉంటే
నాకు మనోవేదన కలుగుతుంది.
52 ✽నిష్కారణంగా నాకు శత్రువులైనవాళ్ళు
నన్ను పక్షిలాగా వేటాడారు.
53 నన్ను గోతిలో ఉంచి నా ప్రాణం
తీయడానికి చూశారు.
నామీదికి రాళ్ళు రువ్వారు.
54 నీళ్ళు నామీదికి ముంచుకు వచ్చాయి,
“నాశనమయ్యాను” అనుకొన్నాను.
55 యెహోవా, లోతైన గోతిలోనుంచి నేను
నీ పేర ప్రార్థన చేశాను.
56 “సహాయంకోసం నా ప్రార్థనలు పెడచెవిని పెట్టకు”
అన్న నా మొర నీవు ఆలకించావు.
57 నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు
నాదగ్గరికి వచ్చావు. “భయపడకు” అన్నావు.
58 ప్రభూ! ఆ వివాదంలో నీవు నా పక్షం వహించావు.
నా ప్రాణాన్ని విమోచించావు.
59 యెహోవా, నాపట్ల జరిగిన అన్యాయం
నీవు చూశావు.
నాకు న్యాయం తీర్చు.
60 నామీద పగతీర్చుకోవాలని
వాళ్ళు చేసిన దురాలోచనలన్నీ నీకు తెలుసు.
61 యెహోవా, వాళ్ళ దూషణ నీవు విన్నావు.
నామీద వాళ్ళు చేసిన దురాలోచనలన్నీ
నీకు తెలుసు.
62 నామీదికి లేచినవాళ్ళ మాటలూ రోజంతా
వాళ్ళు పన్నిన కుట్రలూ నీకు తెలుసు.
63 వాళ్ళను చూడు! వాళ్ళు కూర్చుని ఉన్నా,
నిలబడి ఉన్నా నన్ను గురించి హేళన
పాటలు పాడుతారు.
64 ✽యెహోవా! వాళ్ళ చేతులు చేసిన పనుల
ప్రకారం వాళ్ళకు ప్రతీకారం చెయ్యి.
65 ✝వాళ్ళ హృదయాన్ని బండబారిపోయేలా చెయ్యి.
వాళ్ళను నీ శాపానికి గురి చెయ్యి.
66 ✽నీవు కోపంగా వాళ్ళను తరిమి,
యెహోవా ఆకాశాలక్రింద లేకుండా
వాళ్ళను నాశనం చెయ్యి.