2
1 ✽ప్రభువు సీయోను కుమారి✽ని మేఘంలాగాకోపం✽తో కప్పాడు.
ఆయన ఇస్రాయేల్‌ప్రజల వైభవాన్ని
ఆకాశంనుంచి భూమిమీదికి పడవేశాడు.
తాను కోపగించే రోజున తనకు పాదపీఠం✽గా
ఉన్న స్థలాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
2 ఏమీ జాలి✽ చూపకుండా ప్రభువు యాకోబుప్రజల
నివాస స్థలాలన్నిటినీ నాశనం చేశాడు.
తన కోపాగ్ని కుమ్మరించి యూదా కుమారి
కోటలను పడగొట్టివేశాడు.
వాటిని నేల మట్టం చేశాడు.
అధికారులనూ రాజ్యాన్నీ పాడు చేశాడు.
3 తీవ్ర కోపంతో ఆయన ఇస్రాయేల్
కొమ్ము✽లన్నింటినీ నాశనం చేశాడు.
శత్రువులు దగ్గర అవుతూ ఉంటే తన
కుడి చెయ్యి వెనక్కు తీశాడు.
మండుతున్న మంటలాగా ఆయన యాకోబు
దేశంలో తన చుట్టూరా ఉన్నదంతా కాల్చివేశాడు.
4 శత్రువులాగా ఆయన తన విల్లు✽ వంచాడు,
పగవాడిలాగా దానిమీద కుడిచెయ్యి పెట్టాడు.
మన కంటికి అందమైనవాళ్ళందరినీ చంపాడు.
సీయోను కుమారి నివాసం మీద మంటల్లాగా
తన కోపాగ్నిని కుమ్మరించాడు.
5 ✽ప్రభువు శత్రువులాగా ప్రవర్తించాడు.
ఇస్రాయేల్‌ను దిగమింగివేశాడు.
దాని నగరులన్నిటినీ నాశనం చేశాడు,
దాని కోటలను పాడు చేశాడు.
ఆయన మూలంగా యూదా కుమారి మధ్య
మూలుగులూ రోదన ధ్వనులూ
ఎక్కువయ్యాయి.
6 తోటలో ఉన్న పొదరిల్లులాగా
తన నివాసాన్ని నాశనం చేశాడు.
తన సమాజ కేంద్రాన్ని✽ పాడు చేశాడు.
యెహోవా సీయోను ప్రజను
వాళ్ళ నియామకమైన పండుగలనూ
విశ్రాంతిదినాలనూ మరచిపోయేలా చేశాడు.
కోపోద్రేకం కలిగి రాజునూ యాజినీ త్రోసిపుచ్చాడు.
7 ✝ప్రభువు తన బలిపీఠాన్ని తృణీకరించాడు.
తన పవిత్ర స్థానాన్ని అసహ్యించుకొన్నాడు.
దాని భవనాల గోడలను శత్రువుల
చేతికి ఇచ్చాడు.
నియామకమైన పండుగ రోజున కేకలు
వినబడ్డట్టే శత్రువులు యెహోవా ఆలయంలో
కేకలు పెట్టారు.
8 ✝సీయోను కుమారి ప్రాకారాలను ధ్వంసం
చేయడానికి యెహోవా
నిశ్చయించుకొన్నాడు.
ఆయన కొలనూలు సాగదీశాడు.
ఆయన చెయ్యి నాశనం చేస్తూ ఉంటే
దాన్ని వెనక్కు తీసుకోలేదు.
ప్రహరీ, ప్రాకారం కూలగొట్టించాడు.
అవి శిథిలమవుతూ ఉన్నాయి.
9 ✝నగర ద్వారాలు భూమిలోకి దిగబడ్డాయి.
దాని అడ్డగడియలను విరిచి ముక్కలు చేశాడు.
దాని రాజూ అధికారులూ ఇతర
జనాలలోకి వెళ్ళారు.
ఇప్పుడు ఉపదేశం లేదు.
దాని ప్రవక్తలకు యెహోవానుంచి
దర్శనం రావడం లేదు.
10 ✽సీయోను కుమారి పెద్దలు మౌనం వహించి
నేలమీద కూర్చుని ఉన్నారు,
తలలమీద దుమ్ము పోసుకున్నారు.
గోనెపట్ట కట్టుకొన్నారు.
జెరుసలం కన్యలు నేలవైపుకు తలలు
వంచుకొన్నారు.
11 ✽ ఏడ్చి ఏడ్చి నా కండ్లు నీరసించిపోతున్నాయి.
నా అంతరంగంలో అల్లకల్లోలంగా ఉంది.
నా ప్రజ నాశనమయ్యారు, గనుక నా గుండె
నేలమీద పడినట్టు ఉంది.
చిన్నపిల్లలూ చంటి బిడ్డలూ నగర
వీధులలో మూర్ఛపోతున్నారు.
12 ✝చావుదెబ్బ పొందిన మనిషిలాగా
నగర వీధులలో సొమ్మసిల్లుతూ,
తల్లుల రొమ్మున ప్రాణం విడుస్తూ
“అన్నం, ద్రాక్షరసం ఎక్కడా?”
అని అడుగుతూ ఉన్నారు.
13 ✝జెరుసలం కుమారీ! నేను నిన్ను
ఎలా హెచ్చరించాలి?
కన్యకుమారి సీయోనూ! నిన్ను ఓదార్చడానికి
నిన్ను దేనితో సాటి చేయాలి? దేనితో పోల్చాలి?
నీ నష్టం సముద్రమంత గొప్పది.
నిన్ను ఎవరు నయం చేయగలరు?
14 ✽ నీ ప్రవక్తలు చూచిన దర్శనాలు
వ్యర్థమైనవి, అవివేకమైనవి.
నీ ప్రజలను బందీలుగా పోకుండా తప్పించేలా
వాళ్ళు నీ అపరాధాన్ని వెల్లడి చేయలేదు.
వాళ్ళు పలికిన సోదెలు వ్యర్థమైనవి,
తప్పుమార్గం పట్టించేవి.
15 ఈ దారిన ప్రయాణం చేసేవాళ్ళంతా
నిన్ను చూచి చప్పట్లు కొడతారు.
జెరుసలం కుమారిని చూచి గేలి చేస్తూ✽,
తలలూపుతూ, “అందం✽లో లోపం లేని నగరం
ప్రజలు అన్నది ఇదేనా?
లోకమంతటికీ సంతోషం చేకూర్చే
నగరం ఇదేనా?” అంటారు.
16 ✝నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు
బాగా తెరుస్తారు,
దూషిస్తూ, పండ్లు కొరుకుతూ ఇలా అంటున్నారు:
“దానిని దిగమింగేశాం.
ఈ రోజుకోసమే గదా మనం ఎదురు చూచినది.
అది వచ్చింది. మనం చూశాం.”
17 తాను సంకల్పించినది యెహోవా చేశాడు.
పూర్వకాలంలో తాను నిర్ణయించినది నెరవేర్చాడు✽.
జాలి✽ చూపకుండా నిన్ను పడవేశాడు.
నీమీద నీ పగవాళ్ళ కొమ్ము✽ హెచ్చించి,
వాళ్ళు సంతోషించేలా చేశాడు.
18 ✽ నీ ప్రజలు హృదయంలో
యెహోవాకు విన్నవించుకొంటున్నారు.
“సీయోనుకుమారి ప్రాకారమా!
నీమీద రాత్రింబగళ్ళు కన్నీరు మున్నీరుగా ఉండాలి.
విరామం ఉండకూడదు. నీ కంటికి
విశ్రాంతి రాకూడదు.
19 ✽లేచి, రాత్రి మొదటి జామున మొర పెట్టు.
నీళ్ళలాగా నీ హృదయంలోది ప్రభువు
ఎదుట కుమ్మరించు.
నీ పిల్లల ప్రాణంకోసం ఆయనవైపు నీ చేతులు ఎత్తు.
ప్రతి వీధిలో వారు ఆకలితో మూర్ఛపోతున్నారు.
20 ఇదిగో, యెహోవా, చూడు!
నీవు ఇంకెవరిపట్ల ఇలా వ్యవహరించావు?
తాము కని పెంచిన చంటిబిడ్డలను స్త్రీలు తినాలా✽?
ప్రభు పవిత్ర స్థానంలో యాజీ ప్రవక్తా
హతం కావాలా?
21 ✝యువకుడూ వృద్ధుడూ వీధి దుమ్ములో పడి ఉన్నారు.
నా కన్యలూ యువకులూ కత్తిపాలై కూలారు.
నీవు కోపగించిన రోజున వారిని హతమార్చావు.
జాలి చూపకుండా వారిని వధించావు.
22 నియామకమైన పండుగ రోజుకు పిలిచినట్టే
అన్ని వైపులనుంచి నామీదికి రావాలని
భయంకరమైనవాటిని పిలిచావు.
యెహోవా కోప✽గించిన రోజున ఎవరూ
తప్పించుకోలేదు, ఎవరూ మిగలలేదు.
నేను పెంచిన నా చంటిపిల్లలను శత్రువులు
నిర్మూలం చేశారు.”