విలాపవాక్యాలు
1
1 ✽పూర్వం ఈ నగరం ప్రజలతో నిండి ఉంది.ఇప్పుడది ఏకాంతంగా ఉంది.
ఒకప్పుడు అది ఇతర జనాలలో గొప్పది.
ఇప్పుడు అది విధవరాలిలాంటిది అయింది.
మునుపు అది దేశాలలో రాకుమారి✽లాంటిది.
ఇప్పుడు బానిసలాగా అయింది.
2 రాత్రి వేళ అది వెక్కివెక్కి ఏడుస్తూ ఉంది.
దాని చెంపలమీద కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి.
దాని ప్రేమికులందరిలో దానిని ఓదార్చడానికి
ఎవరూ లేరు.
దాని మిత్రులందరూ✽ దానిని మోసం చేశారు.
వాళ్ళు దానికి విరోధులయ్యారు.
3 యూదాప్రజ బాధపాలై కష్టమైన సేవ చేసి
దేశభ్రష్టులై✽ బందీలుగా వెళ్ళారు.
ఆ జనం ఇతర జనాలలో నివాసం చేస్తూ ఉంది.
దానికి విశ్రాంతి లేదు✽. అది ఇబ్బందులలో
ఉండగానే తరిమినవాళ్ళు దానిని చుట్టుముట్టారు.
4 సీయోను త్రోవలలో దుఃఖమే ఉంది.
నియామకమైన పండుగలకు✽ ఎవరూ రావడం లేదు.
దాని ద్వారాలన్నీ పాడుగా ఉన్నాయి.
దాని యాజులు మూలుగుతూ ఉన్నారు.
దాని కన్యలు శోకిస్తూ✽ ఉన్నారు.
అది మనోవేదన పాలైంది.
5 దాని విరోధులు దానిమీద అధికారులయ్యారు.
దాని శత్రువులు క్షేమం అనుభవిస్తున్నారు.
దాని అనేక అక్రమ కార్యాల✽ కారణంగా
దానిని యెహోవా బాధకు గురి చేశాడు.
విరోధులు దాని పిల్లలను బందీలుగా
తీసుకుపోయారు.
6 సీయోను కుమారి✽ నుంచి
దాని వైభవమంతా పోయింది.
దాని నాయకులు మేత దొరకని లేళ్ళలాంటి
వాళ్ళయ్యారు.
వాళ్ళు నీరసించి, తరిమేవాళ్ళ ఎదుటనుంచి
పారిపోయారు.
7 బాధ, హింస అనుభవిస్తూ ఉన్న ఈ రోజుల్లో
జెరుసలం పూర్వకాలంలో ఉన్న విలువైన
వస్తువులన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంది.
దాని జనం శత్రువుల చేతిలో పడ్డప్పుడు
సహాయం చేసేవారెవరూ✽ లేకపోయారు.
శత్రువులు దాని నాశనాన్ని చూచి నవ్వారు✽.
8 ✽జెరుసలం ఘోరంగా అపరాధం చేసి అశుద్ధం
అయిపోయింది.
దాని నగ్నతను చూచి, మునుపు దానిని
గౌరవించినవాళ్ళు ఇప్పుడు నీచంగా
ఎంచుతూ ఉన్నారు.
అది మూలుగుతూ వెనక్కు తిరుగుతున్నది.
9 దాని అశుద్ధత దాని చెంగులకు అంటుకొని ఉంది.
అది దాని భవిష్యత్తు✽ విషయం తలచుకోలేదు.
దాని పతనం వింత గొలిపేది.
దానిని ఎవరూ ఆదరించలేదు.
“యెహోవా! శత్రువులు గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.
నా బాధను చూడు✽!”
10 దాని విలువైన వస్తువులన్నీ✽ శత్రువుల
చేతిలో చిక్కాయి.
నీ సమాజంలో చేరకూడదని నీవు ఇతర జనాలను
గురించి ఆదేశించావు గాని,
ఆ జనాలే దాని పవిత్ర స్థానంలో అడుగు
పెట్టడం అది చూచింది.
11 ఆహారాన్ని వెదకుతూ✽ దాని ప్రజలంతా
మూలుగుతూ ఉన్నారు.
ప్రాణ సంరక్షణకు తమ విలువైన
వస్తువులను ఆహారంకోసం ఇచ్చారు.
“యెహోవా! ఇదిగో, నేను హీనదశలో ఉన్నాను.
నన్ను చూడు!”
12 ✽“ఈ త్రోవలో ప్రయాణం చేసేవారలారా!
ఇది చూచి మీకు ఏమీ విచారం లేదా?
కలయ చూడండి! నాకు కలిగిన బాధలాంటి
బాధ ఇంకెవరికైనా ఉందా?
యెహోవా తీవ్రంగా కోపగించిన రోజున
ఈ బాధ నాకు కలిగించాడు.
13 పైనుంచి ఆయన నా ఎముకలలోకి
నిప్పు✽ను పంపించాడు.
అవి దాని వశం అయ్యాయి.
నా పాదాలకు వల✽ పరచాడు.
నన్ను వెనక్కు త్రిప్పాడు.
నన్ను పాడు చేశాడు.
ప్రతి రోజూ నేను నీరసించిపోతూ ఉన్నాను.
14 ఆయన నా అపరాధాలను కాడి✽లాగా నాకు కట్టాడు.
అవి నేతపనిలాంటిది.
అవి నా మెడమీదికి వచ్చాయి.
ప్రభువు నా బలం పోయేలా చేశాడు.
నేను ఎదిరించలేనివాళ్ళ వశం నన్ను చేశాడు.
15 నాలో ఉన్న బలాఢ్యులందరినీ ప్రభువు
తృణీకరించాడు.
నా యువకులను చితగగొట్టాలని
సభ కూర్చాడు.
యూదా కన్యకుమారి✽ని ద్రాక్షగానుగ✽ తొట్టిలో
వేసి యెహోవా త్రొక్కాడు.
16 ✽ అందుచేత నేను ఏడుస్తూ ఉన్నాను.
నా కన్నీరు మున్నీరై కారుతూ ఉంది.
నా ప్రాణానికి సేద తీర్చడానికీ నన్ను
ఓదార్చడానికీ నా దగ్గరగా ఎవరూ లేరు.
శత్రువులు గెలిచారు, గనుక నా పిల్లలు దిక్కులేని
స్థితిలో ఉన్నారు.”
17 సీయోను చేతులు చాపుతూ ఉంది గాని,
ఓదార్చడానికి ఎవరూ లేరు.
యెహోవా యాకోబుప్రజకు చుట్టూరా
ఉన్నవాళ్ళు విరోధులుగా ఉండాలని
నిర్ణయించాడు✽.
వాళ్ళ మధ్య జెరుసలం అశుద్ధం అయింది.
18 “యెహోవా న్యాయవంతుడు✽.
ఆయన ఆజ్ఞకు నేను తిరుగుబాటు✽ చేశాను.
సమస్త జనాల్లారా! వినండి! నా బాధను చూడండి!
నా కన్యలూ యువకులూ దేశభ్రష్టులై
బందీలుగా వెళ్ళారు.
19 ✽నేను నా ప్రేమికులను పిలిపించుకొన్నాను,
గానీ వాళ్ళు నన్ను మోసం చేశారు.
నా యాజులూ పెద్దలూ ప్రాణ సంరక్షణకోసం
ఆహారాన్ని వెదకుతూ నగరంలోనే
నాశనమయ్యారు.
20 ✝యెహోవా! నావైపు చూడు!
నాకు బాధగా ఉంది,
అంతరంగంలో అల్లకల్లోలంగా ఉంది.
నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను,
గనుకనే నా హృదయం తారుమారుగా ఉంది,
బయట ఖడ్గం నా పిల్లలను
హతం చేస్తూ ఉంది.
ఇండ్లలోకి కూడా మృత్యువు చొచ్చింది.
21 నేను మూలుగుతూ ఉంటే ప్రజలు విన్నారు గాని,
నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు.
నీవు నామీదికి రప్పించిన విపత్తు విషయం
విని నా శత్రువులందరూ సంతోషిస్తూ✽ ఉన్నారు.
వాళ్ళు నాలాగే అయ్యేలా నీవు చాటించిన
రోజును✽ రప్పించాలని నా ఆశ.
22 ✝వాళ్ళ దుర్మార్గమంతా నీ ఎదుటికి
వస్తుంది గాక!
నా అపరాధాలన్నిటినీ చూచి
నీవు నాకు చేసినట్టే
వాళ్ళకు చెయ్యి!
నా మూలుగులు అనేకం,
నా మనసు క్రుంగి ఉంది.”