5
1 యెహోవా! మాకు జరిగినది జ్ఞాపకం ఉంచుకో.
మావైపు చూచి మా అవమానాన్ని గమనించు.
2 మా వారసత్వం విదేశీయుల వశం అయింది. మా ఇండ్లు పరాయివాళ్ళ స్వాధీనం అయ్యాయి.
3 మేము అనాథలమయ్యాం, తండ్రిలేని వాళ్ళమయ్యాం.
మా తల్లులు వితంతువులయ్యారు.
4 త్రాగేనీళ్ళు మేము కొనుక్కోవాలి.
వెల ఇచ్చి కట్టెలు తెచ్చుకోవాలి.
5 మమ్మల్ని తరిమేవాళ్ళు మా మెడలమీదికి
ఎక్కుతున్నారు.
మేము అలసిపోయాం,
విశ్రాంతి అంటూ మాకు లేదు.
6 పొట్టకూటికి ఈజిప్ట్, అష్షూరు దేశాల వాళ్ళకు
లొంగిపోయాం.
7 మా పూర్వీకులు అపరాధం చేసి గతించిపోయారు.
వారి శిక్షను మేమూ అనుభవిస్తూ ఉన్నాం.
8 దాసులు మాకు పరిపాలకులయ్యారు.
వాళ్ళ వశంలోనుంచి మమ్మల్ని విడిపించడానికి
ఎవరూ లేరు.
9 ఎడారిలో ఉన్న ఖడ్గం కారణంగా
ప్రాణాలకు కూడా తెగించి ఆహారాన్ని
తెచ్చుకొంటున్నాం.
10 కరవువల్ల తగిలిన జ్వరంచేత మా చర్మం
పొయ్యిలాగా వేడెక్కి మాడిపోయింది.
11 సీయోనులో శత్రువులు
స్త్రీలను చెరిపారు.
యూదా పట్టణాలలో కన్యలను చెరపట్టారు.
12 అధికారుల చేతులకు త్రాడు కట్టి
వారిని వ్రేలాడవేశారు.
వాళ్ళు పెద్దలను ఏ మాత్రం గౌరవించలేదు.
13 యువకులు తిరగళ్ళు విసిరారు.
పిల్లవాళ్ళు కట్టెల మోపు మోయలేక తొట్రుపడ్డారు.
14 పెద్దలు నగర ద్వారం దగ్గర సమకూడడం లేదు.
యువకుల సంగీతం వినబడడం లేదు.
15 సంతోషం మా హృదయంలో లేకుండా పోయింది.
మా నాట్యం దుఃఖంగా మారిపోయింది.
16 మా తలమీదనుంచి కిరీటం పడిపోయింది.
మేము అపరాధాలు చేశాం.
అయ్యో, మాకు బాధ!
17 దీనివల్ల మా ధైర్యం చెడిపోయింది.
సీయోను పర్వతం పాడైపోయింది.
18 దానిమీద నక్కలు తిరుగుతూ ఉన్నాయి.
ఇదంతా చూచి మా కండ్లు మసకబారిపొయ్యాయి.
19 యెహోవా! నీవు శాశ్వతంగా పరిపాలన చేస్తావు.
నీ సింహాసనం తరతరాలకు ఉంటుంది.
20 నీవు మమ్మల్ని ఎందుకు ఎప్పటికీ
మరచిపోతున్నావు?
ఇంత కాలం మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావు?
21  యెహోవా! మమ్మల్ని నీదగ్గరికి తిరిగి వచ్చేలా చెయ్యి.
అప్పుడు తిరిగి వస్తాం.
22 నీవు మమ్మల్ని పూర్తిగా విసర్జించకపోతే,
అపరిమితంగా మా మీద కోపగిస్తూ ఉండకపోతే,
మునుపు ఉన్న క్షేమస్థితిని మాకు
మళ్ళీ కలిగించు.