51
1 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఇదిగో వినండి, బబులోనుమీదికి,
దానిలో ఉంటూ నన్ను ఎదిరించినవాళ్ళ మీదికి
నేను వినాశకారి ఆత్మను రేపుతాను.
2 విదేశీయులను బబులోనుకు పంపిస్తాను.
వాళ్ళు ఆ దేశాన్ని తూర్పారబట్టి ఖాళీ చేస్తారు.
ఆ విపత్తు కాలంలో వాళ్ళు అన్ని వైపులనుంచి
దానిమీదికి వస్తారు.
3 విలుకాడు విల్లు వంచకుండా,
కవచం వేసుకొనేవాడు వేసుకోకుండా హతం కావాలి.
వాళ్ళు యువకులను హతం చేయకుండా
విడిచిపెట్టకూడదు.
బబులోను సైన్యమంతటినీ పూర్తిగా నాశనం చేయాలి.
4 కల్దీయ దేశంలో వాళ్ళు హతమై కూలుతారు,
దాని వీధులలో చావు దెబ్బలు తింటారు.
5 ఎందుకని? ఇస్రాయేల్‌ప్రజనూ యూదాప్రజనూ
వారి దేవుడూ సేనలప్రభువూ అయిన
యెహోవా విసర్జించలేదు.
ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుని దృష్టికి వారి దేశం
అపరాధంతో నిండి ఉన్నా, ఆయన వారిని
విసర్జించలేదు.
6 “బబులోనునుంచి పారిపోండి!
మీ ప్రాణాలు దక్కించుకోండి!
దాని దోషాల కారణంగా నాశనం కాకండి!
ఇది యెహోవా ప్రతీకారం చేసే సమయం.
అది చేసిన దానికి ఆయన ప్రతిఫలమిస్తాడు.
7 బబులోను యెహోవా చేతిలో బంగారు
పాత్రలాంటిది. అది లోకమంతా మత్తిల్లేలా చేసింది.
దాని ద్రాక్ష మద్యం జనాలు త్రాగాయి,
గనుక జనాలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాయి.
8 బబులోను హఠాత్తుగా కూలి చితికిపోతుంది.
దానికోసం రోదనం చేయండి!
దాని బాధకు మందు తీసుకురండి!
ఒకవేళ బబులోను నయం అవుతుందేమో.”
9 మనం బబులోనును నయం చేయాలని
ప్రయత్నించాం గాని, అది నయం కాలేదు.
దాని శిక్ష ఆకాశం వరకు ఉంటుంది,
మేఘాల వరకు ఎక్కుతుంది,
గనుక బబులోనును వదలిపెట్టి ఒక్కొక్కరం
మన మన సొంత దేశాలకు వెళ్దాం పదండి.
10 యెహోవా మన న్యాయాన్ని వెల్లడి చేశాడు.
మన దేవుడు యెహోవా చేసినది సీయోనులో
చెప్పుదాం రండి.
11 బాణాలకు పదును పెట్టండి!
డాళ్ళను చేతపట్టుకోండి!
బబులోనును నాశనం చేయడమే యెహోవా ఉద్దేశం
గనుక ఆయన మాదీయ రాజులను ప్రేరేపించాడు.
యెహోవా ప్రతీకారం చేస్తున్నాడు,
తన ఆలయం విషయం ప్రతిక్రియ జరిగిస్తున్నాడు.
12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎత్తండి!
కాపలావాళ్ళను నియమించి, కాపలా గట్టిగా చూడండి!
మాటులను సిద్ధం చేయండి!
బబులోను నగరవాసులను గురించి తాను ఆలోచన చేసి
చెప్పినదానిని యెహోవా నెరవేరుస్తూ ఉన్నాడు.
13 నీవు సమృద్ధి అయిన నీళ్ళమీద కూర్చుని ఉన్నావు.
నీ ఆస్తిపాస్తులు విస్తారంగా ఉన్నాయి.
అయితే నీ అంతం వచ్చింది.
నీవు దోపిడీ సొమ్ము అయ్యే సమయం వచ్చింది.
14 మిడతలలాగా మనుషులతో నిన్ను నింపుతాననీ,
వాళ్ళు నీ మీద విజయధ్వనులు చేస్తారనీ
సేనలప్రభువు యెహోవా తనమీదనే
ఒట్టుపెట్టి చెపుతున్నాడు.
15  ఆయన తన బలంచేత భూమిని సృజించాడు,
తన జ్ఞానాన్ని అనుసరించి ప్రపంచాన్ని స్థాపించాడు,
తన తెలివి ద్వారా ఆకాశాన్ని పరచాడు.
16 ఆయన తన కంఠం వినిపిస్తే ఆకాశంలో
నీళ్ళ ఘోష వినబడుతుంది.
భూమి కొనలలోనుంచి మబ్బులు ఎక్కేలా చేస్తాడు,
వానతోపాటు మెరుపులు పుట్టిస్తాడు.
తన ఖజానాలలోనుంచి గాలిని రప్పిస్తాడు.
17 జ్ఞానం విషయంలో ప్రతి మనిషి తెలివితక్కువవాడు.
పోతపోసే ప్రతివాడూ తను చేసిన విగ్రహాల మూలంగా
సిగ్గుపాలవుతాడు.
ఆ విగ్రహాలు మోసకరమైనవి. వాటిలో ప్రాణం లేదు.
18 అవి నిష్‌ప్రయోజనమైనవి, తిరస్కారానికి తగినవి.
అవి తీర్పుకు గురి అయ్యే సమయంలో
నిర్మూలం అవుతాయి.
19 యాకోబుకు చెందినవాడు వాటిలాంటివాడు కాడు.
ఆయనే సమస్తాన్నీ కలగజేశాడు.
తన సొత్తుగా ఉన్న ఇస్రాయేల్ వంశాన్ని కూడా
కలగజేశాడు. ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
20 “నీవు నాకు గదలాంటి వాడివి.
యుద్ధాయుధం వంటి వాడివి.
నీతో నేను జనాలను చితకగొట్టివేస్తాను.
నీతో రాజ్యాలను నాశనం చేస్తాను.
21 నీతో గుర్రాన్ని, రౌతును చితకగొట్టివేస్తాను.
నీతో రథాన్ని, సారథిని చితకగొట్టివేస్తాను.
22 నీతో పురుషుణ్ణి స్త్రీని చితకగొట్టివేస్తాను.
నీతో యువకుణ్ణి, యువతిని చితకగొట్టివేస్తాను.
23 నీతో కాపరిని, మందను చితకగొట్టివేస్తాను.
నీతో రైతును, ఎద్దులను చితకగొట్టివేస్తాను.
నీతో పరిపాలకులను, అధిపతులను చితకగొట్టివేస్తాను.
24 బబులోను వాళ్ళు, కల్దీయ దేశవాసులు
సీయోనులో జరిగించిన కీడంతటి కారణంగా
నేను వాళ్ళందరికీ మీ కండ్ల ముందే ప్రతీకారం చేస్తాను.
ఇది యెహోవా వాక్కు.
25 నీవు నాశనం చేసే పర్వతం లాగా ఉన్నావు.
నీవు లోకమంతటినీ నాశనం చేస్తున్నావు.
నేను నీకు విరోధిని. ఇది యెహోవా వాక్కు.
నేను నీమీదికి నా చెయ్యి చాపుతాను,
నిటారుగా ఉన్న స్థలాలపైనుంచి నిన్ను దొర్లిస్తాను.
కాలిపోయిన పర్వతంగా నిన్ను చేస్తాను.
26 మూలకు గానీ పునాదికి గానీ నీలోనుంచి
మనుషులు ఏ రాయి తీసుకోరు.
నీవు ఎప్పటికీ పాడై ఉంటావు. ఇది యెహోవా వాక్కు.
27  “దేశంలో జెండా ఎత్తండి! జనాల మధ్య బూర ఊదండి!
దానిమీద యుద్ధం చేయడానికి జనాలను ప్రత్యేకించండి!
దానిమీదికి అరారాతు, మిన్నీ, అష్కనజు
అనే రాజ్యాలను పిలవనంపించండి!
దానిమీదికి వచ్చే జనాలకు అధిపతిని నియమించండి!
మిడతల గుంపులాగా గుర్రాలను రప్పించండి!
28 దాని మీదికి రావడానికి మాదీయ రాజులనూ,
అధిపతులనూ, నాయకులనూ, వాళ్ళ పరిపాలన
క్రింద ఉన్న అన్ని దేశాలనూ ప్రత్యేకించండి!
29 బబులోను దేశాన్ని పాడు చేయడం,
అక్కడ ఎవరూ ఉండకుండా చేయడం దానిని గురించిన
యెహోవా ఆలోచన.
ఆ ఆలోచన నిలిచే ఉంది గనుక ఆ దేశం
వణకుతూ అల్లాడిపోతూ ఉంది.
30 బబులోను యుద్ధవీరులు యుద్ధం చేయడం
మానుకొన్నారు. వాళ్ళ కోటలలో ఉండిపోయారు.
వాళ్ళ బలం నీరసించిపోయింది.
వాళ్ళు స్త్రీలలాగా అయ్యారు.
వాళ్ళ ఇండ్లు మంటల్లో ఉన్నాయి.
బబులోను తలుపుల అడ్డకడ్డీలు విరిగిపోయాయి.
31 అతడి నగరం పూర్తిగా శత్రువుల వశం అయిందని
బబులోను రాజుకు తెలియజేయడానికి బంట్రౌతు
వెంట ఇంకో బంట్రౌతు,
వార్తావహుడి వెంట ఇంకో వార్తావహుడు
పరుగెత్తుతూ ఉన్నారు.
32 నదిని దాటే స్థలాలను శత్రువులు పట్టుకొన్నారనీ,
జమ్ముగడ్డికి నిప్పు అంటించారనీ,
సైనికులు హడలి పోతున్నారనీ కూడా తెలియజేస్తున్నారు.
33 ఇస్రాయేల్ దేవుడూ, సేనలప్రభువూ అయిన
యెహోవా చెప్పేది ఏమిటంటే,
బబులోను నగరం కళ్ళంలాగా ఉంటుంది.
దానిని నూర్చడానికి సమయం వస్తుంది.
ఇంకా కొంత కాలానికే దానికి కోతకాలం వస్తుంది.
34 “సీయోను నివాసులు ఇలా చెపుతున్నారు:
‘బబులోను రాజు నెబుకద్‌నెజరు మమ్మల్ని
దిగమ్రింగివేశాడు, ఓడగొట్టాడు, ఖాళీ పాత్రలాగా
మమ్మల్ని చేశాడు.
బ్రహ్మాండమైన పాములాగా వాడు మమ్మల్ని
మ్రింగివేశాడు.
మా మంచి పదార్థాలతో తన పొట్ట నింపుకొన్నాడు,
మమ్మల్ని పడగొట్టాడు.
35 మాకు చేసిన దౌర్జన్యం బబులోనుమీదికి
వస్తుంది గాక!
మా ఉసురు కల్దీయ దేశస్థులకు తగులుతుంది గాక!’
అని జెరుసలంవారు చెపుతున్నారు.
36 అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే,
నేను మీ పక్షంగా వాదిస్తాను.
మీ కోసం ప్రతీకారం చేస్తాను.
దాని నది ఇంకిపోయేలా చేస్తాను,
దాని ఊటలు ఎండిపోయేలా చేస్తాను.
37 బబులోను పాడుదిబ్బ అవుతుంది.
అది నక్కలకు ఉనికిపట్టుగా ఉంటుంది.
అది అసహ్యకారణంగా హేళనకారణంగా అవుతుంది.
దానిలో కాపురం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు.
38 దాని ప్రజలు ఏకంగా సింహాలలాగా గర్జిస్తున్నారు,
సింహం పిల్లలలాగా గుర్రుమంటున్నారు.
39 వాళ్ళకు ఉద్రేకం ఉండగానే నేను వాళ్ళకు
విందు చేయిస్తాను, వాళ్ళను బాగా మత్తిల్లేట్టు చేస్తాను.
వాళ్ళు సంబరపడి, దీర్ఘ నిద్రపోయి మరెన్నడూ
మేల్కోకుండా ఉండాలని నా ఉద్దేశం.
ఇది యెహోవా వాక్కు.
40 మనుషులు గొర్రెలను, మేకపోతులను,
పొట్టేళ్ళను వధకు తెచ్చినట్టు నేను వాళ్ళను
క్రిందికి తెస్తాను.
41 “షేషక్ దాని శత్రువుల వశం అవుతుంది.
లోకమంతటా ప్రసిద్ధికెక్కిన నగరం పట్టబడుతుంది.
జనాలలో బబులోను అసహ్యకారణంగా అవుతుంది.
42 ప్రవాహం బబులోనుమీదికి వస్తుంది.
దాని అనేక అలలు దానిని కప్పుతాయి.
43 దానికి చెందిన ఊళ్ళు పాడైపోతాయి.
ఆ ప్రాంతం ఎండిపోయిన ఎడారి అవుతుంది.
అక్కడ ఎవరూ కాపురం చేయరు.
దానిగుండా ఎవరూ ప్రయాణం చేయరు.
44 నేను బబులోనులో ఉన్న బేల్‌దేవుణ్ణి దండిస్తాను.
వాడు దిగమ్రింగినదానిని వాడి నోటినుంచి కక్కిస్తాను.
అప్పటినుంచి జనాలు వాడి దగ్గరికి గుంపులుగా రారు.
బబులోను ప్రాకారం కూలిపోతుంది.
45 “నా ప్రజలారా! దానిలోనుంచి బయటికి రండి!
అందరూ ప్రాణం దక్కించుకోండి!
యెహోవా తీవ్రకోపంనుంచి తప్పించుకోండి!
46 దేశంలో వదంతులు వినబడుతూ ఉంటే
మనసులో కలవరపడకండి, భయపడకండి.
ఒక సంవత్సరం ఒక వదంతి, ఇంకో సంవత్సరం
వేరే వదంతి వినబడుతాయి.
దేశంలో దౌర్జన్యం జరుగుతుంది.
పరిపాలకుడితో ఇంకో పరిపాలకుడు పోరాడుతాడు.
47 అయితే రాబోయే రోజుల్లో నేను బబులోను
విగ్రహాల విషయం చూస్తాను.
బబులోను దేశమంతా అవమానానికి గురి అవుతుంది.
దానిలో హతమైన వాళ్ళు దానిమధ్య పడి ఉంటారు.
48  ఉత్తర దిక్కునుంచి వినాశకారులు
దానిమీదికి వస్తారు.
అప్పుడు బబులోను గతిని చూచి ఆకాశం, భూమి,
వాటిలో ఉన్నదంతా ఆనంద ధ్వనులు చేస్తాయి.
ఇది యెహోవా వాక్కు.
49 “బబులోను కారణంగా భూమి అంతట్లో
హతమైనవాళ్ళు కూలారు.
అలాగే ఇస్రాయేల్‌ప్రజలలో హతమైనవారి కారణంగా
బబులోను కూలుతుంది.
50 ఖడ్గాన్ని తప్పించుకొన్న వారలారా!
అక్కడ నిలబడకుండా వెళ్ళిపోండి!
దూరదేశంలో యెహోవాను జ్ఞప్తికి తెచ్చుకోండి,
జెరుసలంను తలచుకోండి.”
51 మేము దూషణకు గురి అయ్యాం గనుక
సిగ్గుపడుతున్నాం.
విదేశీయులు యెహోవా ఆలయంలో ఉన్న
పవిత్ర స్థలాలలో చొరబడ్డారు.
52 “అయితే రాబోయే రోజుల్లో బబులోను
విగ్రహాల విషయం నేను చూస్తాను.
దాని దేశమంతటా గాయాలు పడి మూలుగుతూ
ఉండేవాళ్ళు ఉంటారు. ఇది యెహోవా వాక్కు.
53 బబులోను ఆకాశానికి ఎక్కినా,
ఎత్తుగా ఉన్న దాని బలమైన కోటను దుర్గమంగా చేసినా
దానిమీదికి నేను వినాశకారులను పంపిస్తాను.
ఇది యెహోవా వాక్కు.
54 “బబులోనులోనుంచి రోదనధ్వని వినబడుతూ ఉంది!
కల్దీయ దేశంనుంచి గొప్ప నాశనం జరుగుతూ ఉన్న
చప్పుడు వినిపిస్తూ ఉంది!
55 యెహోవా బబులోనును పాడు చేస్తున్నాడు,
దాని మహా ఘోషను అణచివేస్తున్నాడు.
వాళ్ళ అలలు విస్తార జలాలలాగా ఘోషిస్తూ ఉన్నాయి.
వాళ్ళు చేసే చప్పుడు వినబడుతూ ఉంది.
56 వినాశకారి బబులోను మీదికి వస్తున్నాడు.
దాని యుద్ధవీరులను పట్టుకొంటాడు.
వాళ్ళ విండ్లను ముక్కలు చేస్తాడు.
యెహోవా ప్రతీకారం చేసే దేవుడు.
ఆయన ఖచ్చితంగా ప్రతిఫలమిస్తాడు.
57 బబులోను నాయకులనూ, జ్ఞానులనూ,
అధికారులనూ, పరిపాలకులనూ, యుద్ధవీరులనూ
త్రాగి మత్తిల్లజేస్తాడు.
వాళ్ళు దీర్ఘ నిద్రపోయి మరెన్నడూ మేల్కోకుండా
ఉండాలని నా ఉద్దేశం. ఇది రాజు వాక్కు.
ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
58 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
చాలా వెడల్పుగా ఉన్న బబులోను ప్రాకారాలు
నేలమట్టం అవుతాయి.
దాని ఎత్తయిన ద్వారం తలుపులు కాలిపోతాయి.
ప్రజల ప్రయాస వ్యర్థం. వాళ్ళు కష్టపడి అలసిపోయినది
మంటల పాలయ్యేందుకే.”
59  యూదారాజు సిద్కియా పరిపాలించిన నాలుగో సంవత్సరంలో అతడు బబులోనుకు వెళ్ళినప్పుడు అతడితో కూడా శెరాయా అనే అధిపతి వెళ్ళాడు. శెరాయా నేరీయా కొడుకు, మహసేయా మనుమడు. ఆ సంవత్సరంలో యిర్మీయాప్రవక్త శెరాయాకు ఈ సందేశం ఆజ్ఞాపూర్వకంగా ఇచ్చాడు. 60 యిర్మీయా బబులోను మీదికి రాబోయే విపత్తులన్నిటి విషయం చుట్టిన కాగితంలో వ్రాశాడు. బబులోను గురించి ఈ మాటలన్నీ వ్రాశాడు. 61 అప్పుడు యిర్మీయా శెరాయాతో ఇలా చెప్పాడు: “నీవు బబులోనుకు చేరినప్పుడు ఈ మాటలన్నీ చదివి వినిపించు. 62 ఆ తరువాత ఈ విధంగా చెప్పు: ‘యెహోవా! ఈ స్థలంలో మనుషులు గానీ పశువులు గానీ ఉండకుండా దీనిని నాశనం చేస్తానని, అది ఎప్పటికీ పాడుగా ఉంటుందని నీవు మాట ఇచ్చావు.’ 63 ఈ చుట్టిన పత్రం చదవడం నీవు ముగించాక దానికి రాయి కట్టి యూఫ్రటీసు మధ్యలోకి దానిని విసిరివేయి. 64 వెంటనే ఇలా చెప్పు: ‘యెహోవా బబులోను మీదికి రప్పించబోయే విపత్తు కారణంగా ఇలాగే అది ఇంకెన్నడూ పైకి రాకుండా మునిగిపోతుంది. దాని జనం త్వరగా గతిస్తుంది.’”
ఇంతవరకు యిర్మీయా వాక్కులు సమాప్తం.