52
1 ✽సిద్కియా రాజయినప్పుడు అతడి వయసు ఇరవై ఒకటి. అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు హమూటల్. ఆమె లిబ్నా పురవాసి, యిర్మీయా కూతురు. 2 యెహోయాకీంలాగే అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించాడు. 3 జెరుసలంలో, యూదాలో జరిగినది యెహోవా కోపం కారణంగా జరిగింది. చివరికి ఆయన తన సన్నిధానంలో ఉండకుండా వాళ్ళను వెళ్ళగొట్టాడు. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు. 4 అందుచేత బబులోను రాజు నెబుకద్‌నెజరు తన సైన్యమంతటితో కూడా జెరుసలం మీదికి దండెత్తి వచ్చాడు. అది సిద్కియా పరిపాలించిన తొమ్మిదో సంవత్సరం పదో నెల పదో రోజున జరిగింది. వాళ్ళు జెరుసలం బయట మకాం చేశారు, దాని చుట్టూరా ముట్టడి దిబ్బలు కట్టారు. 5 ఆ విధంగా సిద్కియా పరిపాలించిన పదకొండో సంవత్సరం వరకు నగరాన్ని ముట్టడిస్తూ ఉన్నారు.6 నగరంలో కరవు చాలా తీవ్రం అయింది. దేశప్రజలకు తినడానికి ఏమీ మిగలలేదు. ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజువరకు అలా సాగింది. 7 ఆ రోజున నగర ప్రాకారం చీలిపోయింది. యూదా సైనికులంతా పారిపోయారు. కల్దీయవాళ్ళు నగరం చుట్టూరా ఉన్నా, వాళ్ళు రాత్రిపూట రాజు తోట దగ్గర ఉన్న రెండు గోడల మధ్య ఉన్న ద్వారంగుండా నగరంలోనుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళు అరబా లోయ వైపు వెళ్ళారు. 8 గాని, కల్దీయ సైన్యం సిద్కియారాజును తరిమి, యెరికో మైదానంలో అతడి దరిదాపులకు చేరింది. సిద్కియా దగ్గరనుంచి అతడి సైన్యమంతా చెల్లాచెదురైపోయింది. 9 కల్దీయవాళ్ళు అతణ్ణి పట్టుకొన్నారు, హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఉన్న బబులోను రాజు అతడికి శిక్ష విధించాడు. 10 అతడు సిద్కియా కొడుకులను అతడి కళ్ళముందే హతం చేయించాడు. రిబ్లాలో అతడు యూదా అధికారులందరినీ కూడా హతం చేయించాడు. 11 అప్పుడు అతడు సిద్కియా కండ్లను ఊడబెరికించాడు, అతణ్ణి కంచు సంకెళ్ళతో కట్టించి, బబులోనుకు తీసుకుపోయాడు, సిద్కియా చనిపోయేంతవరకు అతణ్ణి ఖైదులో ఉంచాడు.
12 బబులోను రాజు నెబుకద్‌నెజరు పరిపాలించిన పందొమ్మిదో సంవత్సరం అయిదో నెల పదో రోజున బబులోను రాజుకు సమీప సేవకుడూ, కావలివాళ్ళకు అధిపతీ అయిన నెబుజరదాను జెరుసలంకు వచ్చాడు. 13 అతడు యెహోవా ఆలయాన్ని, రాజు నగరును, జెరుసలంలో ఉన్న పెద్ద ఇండ్లన్నిటినీ తగలబెట్టించాడు. 14 కావలి వారి అధిపతితో కూడా ఉన్న కల్దీయ సైన్యమంతా జెరుసలం చుట్టూరా ఉన్న ప్రాకారాలన్నిటినీ పడగొట్టింది. 15 అప్పుడు కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను ప్రజలలో కొంతమంది నిరుపేదలనూ, ముందు బబులోను రాజు పక్షంలో చేరినవారినీ దేశంనుంచి తీసుకుపోయాడు. 16 అయితే ద్రాక్షతోటలలో పని చేయడానికీ వ్యవసాయం చేయడానికీ నెబుజరదాను కొంతమంది నిరుపేదలను ఉండనిచ్చాడు. 17 యెహోవా ఆలయానికి చెందిన కంచు స్తంభాలను, పీటలను, కంచు సరస్సును కల్దీయవాళ్ళు ముక్కలు చేసి, ఆ కంచు అంతటినీ బబులోనుకు తీసుకువెళ్ళారు. 18 యాజులు వినియోగించే బిందెలనూ, కుండలనూ, కత్తెరలనూ, గిన్నెలనూ, గరిటెలనూ, కంచు పాత్రలన్నిటినీ కూడా వాళ్ళు తీసుకువెళ్ళారు. 19 బంగారంతో గానీ వెండితో గానీ చేసిన పళ్ళేలనూ, ధూపార్తులనూ, గిన్నెలనూ, పాత్రలనూ, దీపస్తంభాలనూ, గరిటెలనూ, పానార్పణ పాత్రలనూ కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను తీసుకుపోయాడు.
20 సొలొమోనురాజు యెహోవా ఆలయంకోసం చేయించిన రెండు స్తంభాలు, కంచు సరస్సు, దాని క్రింద ఉన్న పన్నెండు ఎడ్లు, దాని పీటలు కంచువి. ఆ కంచు తూకం వేయడానికి అసాధ్యం. 21 ఒక్కొక్క స్తంభం ఎత్తు పద్ధెనిమిది మూరలు, చుట్టుకొలత పన్నెండు మూరలు. కంచు మందం బెత్తెడు. స్తంభాలు ఖాళీగా ఉండేవి. 22 ఒక స్తంభంపైన కంచు పీట ఉంది. దాని ఎత్తు అయిదు మూరలు. పీటకు చుట్టు కంచుతో చేసిన దానిమ్మ పండ్లు, అల్లిక పని ఉన్నాయి. రెండో స్తంభం అలాంటిదే. దానికి కూడా కంచు దానిమ్మపండ్లు ఉన్నాయి. 23 ప్రక్కల ఉన్న దానిమ్మపండ్లు తొంభై ఆరు. అల్లిక మధ్య ఉన్న దానిమ్మపండ్లు వంద.
24 కావలివాళ్ళ అధిపతి వీళ్ళను కూడా తీసుకుపోయాడు – ప్రముఖ యాజి శెరాయానూ, రెండో యాజి జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ. 25 నగరంలో దొరికిన సైనికుల అధిపతి ఒక్కణ్ణి, రాజ ఆలోచన సభవాళ్ళు ఏడుగురిని, దేశ సైన్యానికి ఉన్న అధిపతియొక్క లేఖకుణ్ణి, దేశప్రజలో అరవై మందిని కూడా అతడు నగరం నుంచి తీసుకువెళ్ళాడు. 26 వీళ్ళందరినీ కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకువెళ్ళాడు. 27 హమాతు దేశంలో ఉన్న రిబ్లాలోనే బబులోను రాజు వాళ్ళను కొట్టించి హతం చేయించాడు. యూదావాళ్ళు దేశభ్రష్టులై బందీలుగా వెళ్ళిపోయారు.
28 ✽నెబుకద్‌నెజరు బందీలుగా తీసుకువెళ్ళినవారి సంఖ్య ఇది: అతడు పరిపాలించిన ఏడో సంవత్సరంలో మూడు వేల ఇరవైమూడు మంది యూదులు; 29 నెబుకద్‌నెజరు పద్ధెనిమిదో సంవత్సరంలో జెరుసలంనుంచి ఎనిమిది వందల ముప్ఫయి రెండు మంది; 30 అతడు పరిపాలించిన ఇరవైమూడో సంవత్సరంలో కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను ఏడు వందల నలబై అయిదు మంది యూదులను బందీలుగా తీసుకు పోయాడు. వారి సంఖ్య మొత్తం నాలుగు వేల ఆరు వందలు.
31 ✽యూదా రాజు యెహోయాకీం బందీగా వెళ్ళిన ముప్ఫయి ఏడో సంవత్సరంలో బబులోనుకు ఎవీల్ మెరోదక్ రాజయ్యాడు. అతడి మొదటి సంవత్సరంలోనే పన్నెండో నెల ఇరవై అయిదో రోజున అతడు యూదా రాజు యెహోయాకీం తల పైకెత్తాడు. అతణ్ణి ఖైదునుంచి విడుదల చేశాడన్నమాట. 32 అతడితో దయగా మాట్లాడి, బబులోనులో తన దగ్గర ఉన్న ఇతర రాజులందరికంటే గౌరవనీయమైన స్థానం అతడికి ఇచ్చాడు. 33 యెహోయాకీం ఖైదు బట్టలను తీసివేసి వేరే బట్టలను తొడుగుకొన్నాడు. అతడు బ్రతికినన్నాళ్ళు ప్రతి రోజూ ఎవీల్‌మెరోదక్‌రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు. 34 అతడు చనిపోయే వరకు, బ్రతికినన్నాళ్ళు ప్రతిరోజూ అతడికి బబులోను రాజు బత్తెం ఇప్పిస్తూ వచ్చాడు.