50
1 ✽ఇది బబులోను, కల్దీయదేశం విషయం యెహోవా యిర్మీయాప్రవక్తద్వారా పలికిన వాక్కు:2 “ఈ సంగతి జనాలలో చాటించి✽ తెలియజేయండి;
జెండా ఎత్తి ప్రకటించండి; ఏమీ దాచకుండా
ఇలా చెప్పండి:
బబులోనును పట్టడం జరుగుతుంది,
బేల్‌దేవుడు సిగ్గుపాలు కావడం,
మరో దాక్‌దేవుడు చితికిపోవడం జరుగుతుంది.
బబులోను దేవతా రూపాలు అవమానం పాలవుతాయి,
దాని విగ్రహాలు చితికిపోతాయి.
3 ఉత్తర దిక్కు✽నుంచి ఒక జనం దానిమీదికి వస్తుంది,
దాని దేశాన్ని పాడు చేస్తుంది.
అప్పుడు దానిలో ఎవరూ కాపురం ఉండరు.
మనుషులు, పశువులు పారిపోవడం జరుగుతుంది.
4 ✝“యెహోవా చెప్పేదేమిటంటే, ఆ కాలంలో,
ఆ రోజుల్లో ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ సమకూడి ఏడుస్తూ,
వారి దేవుడు యెహోవాను వెదకుతూ వస్తూ ఉంటారు.
5 ‘సీయోనుకు వెళ్ళే మార్గమేది?’
అని అడుగుతూ సీయోనువైపు ముఖాలు త్రిప్పుతారు.
వారు యెహోవాతో శాశ్వతమైన ఒడంబడిక✽ చేసి
‘ఆయనకు కట్టుబడి ఉందాం, రండి’ అంటారు.
అది ఎప్పటికీ మరవబడదు.
6 ✽ “నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు.
వారి కాపరులు వారిని తప్పుత్రోవ పట్టించారు,
పర్వతాల మీద వారిని పక్కకు తిప్పారు.
నా ప్రజలు పర్వతాలమీద, కొండలమీద తిరుగులాడుతూ
తమ విశ్రాంతి స్థలం మరచిపోయారు.
7 ✽చూచినవాళ్ళంతా వారిని దిగమ్రింగివేశారు.
అయితే వారి విరోధులు ఇలా చెప్పుకొన్నారు:
‘అందులో మనం అపరాధులం కాము.
ఎందుకంటే వాళ్ళు తమ న్యాయనివాసంగా ఉన్న
యెహోవాకు, తమ పూర్వీకులకు ఆశాభావమైన
యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’
8 ✝“బబులోనునుంచి పారిపోండి!
కల్దీయవాళ్ళ దేశాన్ని విడిచి వెళ్ళండి!
మందకు ముందుగా నడిచే మేకపోతులలాగా ఉండండి.
9 ఇదిగో, నేను ఉత్తర దేశంలో మహా జనాల సమూహాన్ని
పురికొలిపి, దానిని బబులోను మీదికి రప్పిస్తున్నాను.
వాళ్ళు బబులోను ఎదుట సైన్య వ్యూహం ఏర్పరుస్తారు.
ఉత్తర దిక్కున వాళ్ళు దానిని పట్టుకొంటారు.
నేర్పరి అయిన యుద్ధవీరుడి బాణాలలాగా
వాళ్ళ బాణాలు నిష్‌ప్రయోజనంగా తిరిగి రావు.
10 కల్దీయ దేశం దోపిడీసొమ్ము అవుతుంది.
దానిని దోచుకొన్న వాళ్ళు తృప్తిపడతారు.
ఇది యెహోవా వాక్కు.
11 ✽“నా సొత్తును దోచుకొనే వారలారా!
మీరు సంతోషిస్తూ, ఆనందిస్తూ, నూరుస్తున్న పెయ్యలాగా
గంతులు వేస్తూ, బలిసిన గుర్రాలలాగా
సకిలింపు చేస్తూ ఉన్నారే.
12 గనుక మీ తల్లి చాలా అవమానం పాలవుతుంది.
మిమ్ములను కన్నది వెలవెల బోతుంది.
అది అన్ని జనాలలో అల్పంగా ఉంటుంది.
అది పాడుపడి ఎండిపోయిన ఎడారిగా అవుతుంది.
13 ✽ యెహోవా కోపానికి అది పూర్తిగా నాశనమై
నిర్మానుష్యంగా ఉంటుంది.
బబులోను దారిన వెళ్ళే వాళ్ళంతా దాని దెబ్బలు చూచి
నిర్ఘాంతపోయి దూషిస్తారు.
14 ✽విల్లు వంచే వారలారా! బబులోను చుట్టూరా
వ్యూహం ఏర్పరచండి.
అది యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది
గనుక బాణాలు వేయండి! తక్కువ వేయకండి!
15 ✽దానిచుట్టూ ఉండి దానిమీద కేకలు వేయండి!
అది లొంగిపోతున్నది! దాని స్తంభాలు
పడిపోతూ ఉన్నాయి!
ఇది యెహోవా చేసే ప్రతీకారం, గనుక దానిమీద
పగతీర్చుకోండి. అది చేసినట్టే దానికి చేయండి.
16 బబులోనులో విత్తనాలు చల్లేవాళ్ళను
ఉండకుండా చేయండి.
కోతకాలంలో కొడవలి పట్టుకొనేవాళ్ళను
ఉండకుండా చేయండి.
క్రూరుల ఖడ్గం కారణంగా అందరూ తమ సొంత ప్రజల
దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు,
సొంత దేశాలకు పారిపోతారు.
17 ✽“ఇస్రాయేల్ ప్రజలు చెదరిపోయిన గొర్రెల లాంటివారు.
వారిని వెళ్ళగొట్టినది సింహాలలాంటివాళ్ళు.
మొట్టమొదట వారిని దిగమ్రింగినవాడు
అష్షూరు రాజు. చివరగా వారి ఎముకలు
విరగగొట్టినది బబులోను రాజు నెబుకద్‌నెజరు.
18 ✽కాబట్టి ఇస్రాయేల్ ప్రజల దేవుడూ,
సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే,
నేను అష్షూరు రాజును దండించినట్లే
బబులోను రాజునూ అతడి దేశాన్నీ దండిస్తాను.
19 అయితే నేను ఇస్రాయేల్‌వారిని తమ పచ్చిక మైదానాలకు
తిరిగి తీసుకువస్తాను.
కర్మెల్, బాషాను ప్రదేశాలలో వారికి పోషణ చేకూరుతుంది.
ఎఫ్రాయిం, గిలాదు కొండప్రదేశాలలో
వారికి తృప్తి కలుగుతుంది.
20 ✽ఆ కాలంలో, ఆ రోజుల్లో ఇస్రాయేల్ వారిలో దోషం కోసం
సోదా జరుగుతుంది గాని, ఏమీ ఉండదు.
యూదావారి పాపాల కోసం సోదా జరుగుతుంది గాని,
ఒక్కటి కూడా దొరకదు.
ఎందుకంటే నేను మిగిల్చినవారిని క్షమిస్తాను.
ఇది యెహోవా వాక్కు.”
21 “మెరాతయీం✽ దేశంమీదికి దండెత్తి వెళ్ళండి!
పెకోదు వాళ్ళపై బడండి! వాళ్ళను హతం చేయండి!
పూర్తిగా నాశనం చేయండి! నేను మీకు
ఆజ్ఞాపించినట్టెల్లా జరిగించండి. ఇది యెహోవా వాక్కు.
22 యుద్ధ ధ్వని, గొప్ప నాశన ధ్వని ఆ దేశంలో
వినబడుతూ ఉన్నాయి.
23 సర్వలోకాన్నీ కొట్టే సమ్మెట✽లాంటి బబులోను
చీలి ముక్కలుగా అయింది!
అది ఇతర జనాల మధ్య అసహ్యకారణంగా అయింది!
24 ✽బబులోనూ! నీవు యెహోవా మీద యుద్ధం
జరిగించావు, గనుక నీ కోసం నేను వల ఉంచాను.
నీకు తెలియకుండానే వలలో చిక్కుపడ్డావు.
నీవు దొరికావు, పట్టుబడ్డావు.
25 సేనలప్రభువు యెహోవాకు కల్దీయదేశంలో
ఒక పని ఉంది.
యెహోవా తన ఆయుధ శాలను తెరచి,
తన కోపం తీర్చుకొనే ఆయుధాలను✽ బయటికి తెచ్చాడు.
26 “దూరంగా ఉన్న వారలారా!
అక్కడనుంచి బబులోను మీదికి రండి!
దాని ధాన్యం గిడ్డంగులను విప్పండి!
చెత్తలాగా దానిని కుప్పలు వేయండి!
దానిని పూర్తిగా నాశనం చేయండి!
దానికి చెందినది ఏదీ మిగులకుండా చేయండి!
27 ✽దాని ఎద్దులన్నిటినీ కత్తిపాలు చేయండి!
అవి వధకు గురి కావాలి.
వాళ్ళకు బాధ తప్పదు. వాళ్ళ రోజు వచ్చింది,
వాళ్ళను శిక్షించేకాలం వచ్చింది.”
28 ✽మన దేవుడు యెహోవా ప్రతీకారం చేశాడు,
తన ఆలయాన్ని✽ గురించి ప్రతీకారం చేశాడు.
సీయోనులో ఈ సంగతి ప్రకటించడానికి
బబులోనునుంచి తప్పించుకొని పలాయనమై
వచ్చినవారి చప్పుడు వినబడుతూ ఉంది.
29 ✽“బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి!
విల్లు వంచేవారలారా! మీరంతా దాని చుట్టూ దిగండి.
వాళ్ళలో ఎవరినీ తప్పించుకోనివ్వకండి.
అది ఇస్రాయేల్‌ప్రజల పవిత్రుడైన యెహోవాకు
వ్యతిరేకంగా గర్వంగా ప్రవర్తించింది,
గనుక దాని పనులకు అనుగుణంగా దానికి చేయండి.
అది చేసిన వాటన్నిటికీ ప్రతిక్రియ చేయండి.
30 ఇది యెహోవా వాక్కు:
దాని యువకులు వీధులలో కూలుతారు.
ఆ రోజున దాని సైనికులంతా హతం అవుతారు.
31 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
నీవు గర్వంతో ఉప్పొంగిపోతున్నావు.
నేను నీకు విరోధిని.
నీ రోజు – నిన్ను శిక్షించేకాలం – వచ్చింది.
32 గర్వంతో ఉప్పొంగేది తొట్రుపడి కూలుతుంది.
దానిని లేవనెత్తడానికి ఎవరూ ఉండరు.
దానికి చెందిన ఊళ్ళలో మంటలు అంటిస్తాను.
దానివల్ల దానిచుట్టూ ఉన్నవన్నీ కాలిపోతాయి.
33 ✝“సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ ఏకంగా దౌర్జన్యానికి
గురి అయ్యారు.
వారిని బందీలుగా తీసుకుపోయిన వాళ్ళందరూ
వారిని గట్టిగా పట్టుకొంటున్నారు,
వారిని వెళ్ళనివ్వడం లేదు.
34 ✽వారి విమోచకుడు✽ బలం గలవాడు.
ఆయన పేరు ‘సేనలప్రభువు యెహోవా’.
ఆయన వారి పక్షాన తప్పకుండా వాదిస్తాడు,
వారి దేశానికి విశ్రాంతి ఇస్తాడు.
బబులోనులో ఉండే వాళ్ళకు కలత కలిగిస్తాడు.
35 ఇది యెహోవా వాక్కు:
కల్దీయవాళ్ళు కత్తిపాలవుతారు,
బబులోను నివాసులూ అధికారులూ జ్ఞానులూ
కత్తిపాలవుతారు.
36 అబద్ధాలు పలికే దాని ప్రవక్తలు కత్తిపాలవుతారు.
వాళ్ళు పిచ్చివాళ్ళవుతారు.
దాని యుద్ధవీరుల మీదికి కూడా ఖడ్గం వస్తుంది.
వాళ్ళు చితికిపోతారు.
37 దాని గుర్రాలమీదికి, రథాలమీదికి ఖడ్గం వస్తుంది.
దానితో కలిసి మెలసి దానిలో ఉన్న విదేశీయులందరి
మీదికీ కూడా ఖడ్గం వస్తుంది.
వాళ్ళు స్త్రీలలాంటివాళ్ళవుతారు.
దాని విలువైన వస్తువుల మీదికి కూడా ఖడ్గం వస్తుంది.
అవి దోపిడీ సొమ్ము అవుతాయి.
38 ✽దాని నీళ్ళకు ఎద్దడి తగులుతుంది.
నీళ్ళు ఇంకిపోతాయి. ఎందుకని?
అది విగ్రహాలతో నిండి ఉన్న దేశం.
భయంకరమైన విగ్రహాల కారణంగా
ఆ దేశస్థులు పిచ్చిగా ప్రవర్తిస్తారు.
39 ✽ అందుచేత ఎడారి జంతువులు నక్కలతో పాటు
దానిని ఉనికిపట్టుగా చేస్తాయి.
నిప్పుకోళ్ళు కూడా దానిలో ఉంటాయి.
అయితే మనుషులు దానిలో ఇంకా ఎన్నడూ
కాపురం చేయరు, దానిలో తరతరాలకు
ఎవరూ ఉండరు.
40 దేవుడు సొదొమనూ గొమొర్రానూ వాటి దగ్గర ఉన్న
పట్టణాలనూ నాశనం చేసిన తరువాత ఎలా ఉందో
బబులోను అలాగే ఉంటుంది.
అక్కడ ఎవరూ కాపురం చేయరు,
ఏ మనిషీ దానిలో బస చేయడు.
ఇది యెహోవా వాక్కు.”
41 ✽ “ఇదిగో! ఉత్తర దిక్కునుంచి సైన్యం వస్తూ ఉంది.
భూమి కొనలలో మహా జనాన్ని,
చాలా మంది రాజులను రేపడం జరుగుతూ ఉంది.
42 వాళ్ళు విల్లు, ఈటె పట్టుకొన్నారు.
వాళ్ళు క్రూరులు, నిర్దయులు.
వాళ్ళు గుర్రాలెక్కి వస్తూ ఉంటే వాళ్ళు చేసే చప్పుడు
సముద్ర ఘోషలాగా ఉంది.
బబులోను నగరమా! నీపై పడడానికి వాళ్ళు యుద్ధానికి
బారులు తీరి వస్తూ ఉన్నారు.
43 వాళ్ళ విషయం బబులోను రాజుకు కబురు వచ్చింది.
అతడి చేతులు బలహీనమై పడి ఉన్నాయి.
అతడు వేదన పాలయ్యాడు. ప్రసవిస్తూ ఉన్న స్త్రీకి
పట్టుకొనేట్టు అతడికి నొప్పి పట్టుకొంది.
44 ✽ యొర్దాను అడవినుంచి ఎప్పుడూ నీళ్ళున్న
పచ్చిక మైదానాలకు సింహం వచ్చినట్టు
శత్రువులు వస్తారు.
వాళ్ళ ముందునుంచి బబులోనువారిని
శీఘ్రంగా తరిమివేస్తారు.
నేను ఎన్నుకొన్న వాణ్ణి ఆ పనిమీద నియమిస్తాను.
నాలాంటివాడు ఎవడు ఉన్నాడు?
నన్ను ఎవడు సవాలు చేయగలడు?
ఏ పరిపాలకుడు నాకు ఎదురుగా నిలబడగలడు?
45 బబులోను మీద యెహోవా చేసిన
ఆలోచన వినండి!
కల్దీయ దేశంమీద ఆయన సంకల్పించినది వినండి!
శత్రువులు వాళ్ళలో చిన్నవారిని కూడా లాగివేస్తారు.
వాళ్ళ కారణంగా ఆయన వాళ్ళ నివాసస్థలాలను
పాడుచేస్తాడు.
46 బబులోను కూలిపోయిన చప్పుడుకు
భూమి వణకుతుంది.
దాని బొబ్బలు జనాలలో వినబడుతూ ఉంటాయి.”