49
1 అమ్మోను ప్రజను గురించి యెహోవా చెప్పేది ఏమిటంటే,
“ఇస్రాయేల్‌కు సంతానం లేదా? వారసులు లేరా?
మరి మల్కోందేవుడు గాదు ప్రదేశాన్ని
స్వాధీనం చేసుకోవడమెందుకని?
వాడి ప్రజ దాని పట్టణాలలో ఎందుకు
కాపురముంటున్నారు?
2 అయితే రాబోయే రోజుల్లో అమ్మోనులో
రబ్బా మీద యుద్ధధ్వని వినబడేలా నేను చేస్తాను.
ఇది యెహోవా వాక్కు.
రబ్బా పాడుదిబ్బ కావడం, దానికి చెందిన ఊళ్ళను
మంటలతో తగలబెట్టడం జరుగుతుంది.
అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు తమను వెళ్ళగొట్టిన
వాళ్ళను వెళ్ళగొట్టివేస్తారు. ఇది యెహోవా వాక్కు.
3 హాయీ నాశనమైంది, గనుక హెష్బోను,
రోదనం చేయి! రబ్బా పురవాసులారా!
పెడబొబ్బలు పెట్టండి! మల్కోం, వాడి యాజులూ
అధికారులూ బందీలుగా దేశాంతరం పోతారు,
గనుక గోనెపట్ట కట్టుకొని దుఃఖించండి.
గోడల లోపల అటు ఇటు పరుగెత్తుతూ ఉండండి.
4 నానుంచి తొలగిపోయిన కుమారీ!
సమృద్ధితో పారుతున్న నీ లోయల విషయం నీవెందుకు
గొప్పలు చెప్పుకొంటున్నావు?
నీ ధనం మీద ఆధారపడుతూ,
‘మా మీదికి ఎవరు వస్తారు?’ అంటున్నావు.
5 అయితే నీ చుట్టూరా ఉన్న జనాలన్నిటిచేత
నీ మీదికి భయం రప్పిస్తాను.
ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు.
వాళ్ళు మిమ్ముల్నందరినీ వెళ్ళగొట్టివేస్తారు.
పారిపోయినవాళ్ళను సమకూర్చడానికి ఎవరూ ఉండరు.
6 అయినా, తరువాత అమ్మోను ప్రజకు ముందున్న క్షేమస్థితిని మళ్ళీ కలిగిస్తాను. ఇది యెహోవా వాక్కు.
7 ఎదోం ప్రజను గురించి సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“తేమానులో జ్ఞానం ఇంకా లేదా?
వివేకుల దగ్గర ఆలోచన దొరకదా?
వాళ్ళ జ్ఞానం లేకుండా పోయిందా?
8 దదానులో ఉంటున్న వారలారా!
నేను ఏశావు ప్రజమీదికి ఆపద రప్పించి
వాళ్ళను శిక్షించబోతున్నాను,
గనుక మీరు వెనక్కు మళ్ళి పారిపోండి!
లోతైన స్థలాలలో దాగుకోండి!
9 ఒకవేళ ద్రాక్షపండ్లు ఏరేవారు నీ దగ్గరికి వస్తే
వారు పరిగెను వదలివేస్తారు గదా.
రాత్రి పూట దొంగలు వస్తే తమకు కావలసినది
మాత్రమే ఎత్తుకుపోతారు గదా.
10 అయితే నేను ఏశావుకు ఏమీ మిగలకుండా చేస్తాను.
వాళ్ళు దాక్కోకుండా వాళ్ళ రహస్య స్థలాలను
బహిరంగపరుస్తాను. వాళ్ళ సంతానం,
బంధువులు, పొరుగువాళ్ళు నాశనమవుతారు.
ఏశావు ఇక ఉండదు.
11 అయితే తల్లిదండ్రులు లేని మీ పిల్లలను వదలిపెట్టండి.
నేను వారిని కాపాడుతాను. మీ విధవరాండ్రు
నా మీద నమ్మకం ఉంచగలరు.”
12 యెహోవా చెప్పేదేమిటంటే, “పాత్రలోది త్రాగడానికి నియమించబడనివాళ్ళు త్రాగవలసివుంటే, మీరు మాత్రం శిక్షకు గురి కాకుండా ఉంటారా? మీరు ఏ మాత్రమూ శిక్షకు గురి కాకుండా ఉండరు. మీరూ పాత్రలోది త్రాగితీరాలి. 13 బొస్రా అసహ్యకారణంగా పాడుగా అవుతుంది, హేళనకూ శాపానికీ గురి అవుతుంది. దానికి చెందిన ఊళ్ళన్నీ ఎప్పటికీ పాడుగా ఉంటాయి. ఇలా జరుగుతుందని నామీద ఒట్టుబెట్టి చెపుతున్నాను. ఇది యెహోవా వాక్కు.”
14  యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది.
“మీరు సమకూడి దానిమీదికి రండి!
యుద్ధానికి లేవండి!” అనడానికి వేరు వేరు
జనాలమధ్యకు రాయబారిని పంపడం జరిగింది.
15 “ఇదిగో నేను మిమ్ములను జనాలలో అల్పజనంగా,
మనుషులు తృణీకరించిన జనంగా చేస్తాను.
16 బండ సందులలో కాపురముంటున్న జనమా!
కొండల శిఖరాలను పట్టుకొని ఉన్న జనమా!
మీ బీకరత్వం, హృదయంలో ఉన్న మీ గర్వం
మిమ్ములను మోసగించాయి.
గరుడపక్షిలాగా మీ నివాసం చాలా ఎత్తుగా కట్టుకొన్నా
అక్కడనుంచి నేను మిమ్ములను క్రిందికి పడద్రోస్తాను.
ఇది యెహోవా వాక్కు.
17 “ఎదోం పాడైపోతుంది. ఆ దారిన వెళ్ళేవారు దానికి తగిలిన దెబ్బలను చూచి ఆశ్చర్యపడి వేళాకోళం చేస్తారు. 18 సొదొమ, గొమొర్రా, వాటి దగ్గర ఉన్న పట్టణాలు నాశనమైన తరువాత ఎలా ఉన్నాయో ఎదోం అలాగే ఉంటుంది – అందులో ఎవరూ కాపురముండరు, ఎవరూ బస చేయరు. ఇది యెహోవా వాక్కు. 19 యొర్దాను అడవినుంచి ఎప్పుడూ నీళ్ళున్న పచ్చికమైదానాలకు సింహం వచ్చినట్టు శత్రువులు వస్తారు. వాళ్ళ ముందునుంచి ఎదోంవాళ్ళు త్వరగా పారిపోయేలా నేను చేస్తాను. నేను ఎన్నుకొన్నవాణ్ణి ఆ పనిమీద నియమిస్తాను. నాలాంటి వాడు ఎవడు ఉన్నాడు? నన్ను ఎవడు సవాలు చేయగలడు? ఏ పరిపాలకుడు నాకు ఎదురుగా నిలబడగలడు?”
20 ఎదోం మీద యెహోవా చేసిన ఆలోచన వినండి! తేమానులో ఉంటున్న వాళ్ళమీద ఆయన సంకల్పించినది వినండి! శత్రువులు వాళ్ళలో చిన్న వాళ్ళను కూడా లాగివేస్తారు. వాళ్ళ కారణంగా ఆయన వాళ్ళ నివాసస్థలాలను పాడు చేస్తాడు. 21 వాళ్ళు కూలిపోయిన చప్పుడుకు భూమి వణకుతుంది. వాళ్ళ పెడబొబ్బలు ఎర్రసముద్రం వరకు వినబడుతాయి. 22 ఇదిగో! శత్రువు గరుడపక్షిలాగా ఎగిరి వస్తాడు, తన రెక్కలు బొస్రా మీద చాపుతాడు. ఆ రోజున ఎదోం యుద్ధవీరుల గుండెలు, ప్రసవవేదన పడుతున్న స్త్రీ గుండెలాగా ఉంటాయి.
23 ఇది దమస్కు విషయం:
“హమాతు, అర్పాదు పట్టణాలు విపత్తును గురించిన
కబురు విని ఆశాభంగం పొందాయి.
వాటి నివాసుల ధైర్యం చెడిపోయింది.
పరిస్థితులు నెమ్మదిలేని సముద్రంలాగా ఉన్నాయి.
అంతా భయాక్రాంతమయింది.
24 దమస్కు బలహీనమైంది. పారిపోవడానికి వెనక్కు తిరిగింది.
దానికి అధిక భయం ముంచుకువచ్చింది.
ప్రసవవేదన పడుతున్న స్త్రీలాగా దానికి నొప్పి,
వేదనలు పట్టుకొన్నాయి.
25 ప్రసిద్ధికెక్కిన ఆ నగరం, నాకు సంతోషం
కలిగించిన ఆ నగరం విడవబడలేదేమిటి!
26 కాబట్టి, దాని వీధులలో దాని యువకులు కూలుతారు.
ఆ రోజు దాని సైనికులంతా హతం అవుతారు.
ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
27 నేను దమస్కు ప్రాకారాలకు జ్వాల అంటిస్తాను.
ఇది బెన్‌హదదు నగరులను దహించివేస్తుంది.”
28 బబులోను రాజు నెబుకద్‌నెజరు కొట్టిన కేదారు, హాసోరు రాజ్యాల విషయం యెహోవా చెప్పేది ఏమిటంటే,
“లేచి, కేదారుమీదికి వెళ్ళండి!
తూర్పు జనాన్ని నాశనం చేయండి!
29 వాళ్ళ డేరాలనూ మందలనూ శత్రువులు తీసుకుపోతారు.
వాళ్ళ తెరలనూ పాత్రలనూ ఒంటెలనూ కూడా పట్టుకు పోతారు.
వాళ్ళకు ‘అన్ని వైపులూ భయం’ అని మనుషులు కేకలు వేస్తారు.
30 హాసోరులో ఉంటున్న వారలారా! త్వరగా పారిపోండి!
లోతైన స్థలాలలో ఉండండి! ఇది యెహోవా వాక్కు.
బబులోను రాజు నెబుకద్‌నెజరు మీపైబడాలని ఆలోచన చేశాడు,
మీ మీద పన్నాగం పన్నాడు.
31 ఇది యెహోవా వాక్కు:
లేచి, నెమ్మదిగా నిర్భయంగా ఉన్న జనం మీదికి వెళ్ళండి.
ఆ జనం ఏకాంతంగా ఉంటున్నది.
వాళ్ళకు తలుపులు గానీ గడియలు గానీ లేవు.
32 వాళ్ళ ఒంటెలు, పెద్ద పశువుల మందలు దోపిడీ అవుతాయి.
గడ్డం ప్రక్కలు గొరిగించుకొనే వాళ్ళను నేను చెదరగొట్టివేస్తాను.
అన్ని వైపులనుంచీ వాళ్ళమీదికి ప్రమాదం రప్పిస్తాను.
ఇది యెహోవా వాక్కు.
33 హాసోరు ఎప్పటికీ పాడుపడి నక్కలకు
ఉనికిపట్టుగా ఉంటుంది.
అక్కడ ఎవరూ కాపురం చేయరు, ఎవరూ బస చేయరు.”
34 యూదా రాజు సిద్కియా పరిపాలనారంభంలో ఏలాం విషయం యెహోవానుంచి యిర్మీయాప్రవక్తకు వచ్చిన వాక్కు: 35 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“నేను ఏలాం వింటిని విరుస్తాను.
వాళ్ళ బలానికి అదే ముఖ్యమైన ఆధారం.
36 నేను ఏలాం మీదికి ఆకాశం నలుదిక్కులనుంచి
నాలుగు గాలులను రప్పిస్తాను,
నలుదిక్కులకు వాళ్ళను చెదరగొట్టి వేస్తాను.
దేశభ్రష్టులైన ఏలాంవాళ్ళు వెళ్ళని దేశమేదీ ఉండదు.
37 వాళ్ళ ప్రాణం తీయజూచే శత్రువుల ఎదుట
ఏలాంవాళ్ళు చితికిపోయేలా చేస్తాను.
నేను వాళ్ళమీదికి నా తీవ్రమైన కోపం అనే విపత్తును రప్పిస్తాను.
ఇది యెహోవా వాక్కు.
వాళ్ళను పూర్తిగా హతం చేసే వరకు
నా ఖడ్గాన్ని వాళ్ళవెంట పంపిస్తాను.
38 ఏలాంలో నా సింహాసనం నిలిపి, వాళ్ళ రాజునూ
అధికారులనూ నాశనం చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
39 అయినా రాబోయే రోజుల్లో ఏలాంకు ముందున్న
క్షేమస్థితిని కలిగిస్తాను. ఇది యెహోవా వాక్కు.”