48
1 ✽ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా మోయాబు విషయం చెప్పేదేమంటే,“నెబో✽కు బాధ తప్పదు. అది పాడైపోతుంది.
కిర్యతాయిం పట్టబడి అవమానం పాలవుతుంది.
కోటను పడగొట్టడం, సిగ్గు పరచడం జరుగుతుంది.
2 ✽మోయాబుకు ఇకనుంచి ప్రసిద్ధి ఉండదు.
మోయాబును జనంగా ఉండకుండా అంతం చేద్దాం,
పట్టండి అంటూ హెష్బోనులో దానికి వ్యతిరేకంగా
దురాలోచనలు చేయడం జరుగుతుంది.
మద్మేనూ! నీవు కూడా నాశనమవుతావు.
ఖడ్గం నిన్ను తరుముతుంది.
3 హొరొవయీంలోనుంచి కేకలు వినబడుతాయి.
అక్కడ కొల్లగొట్టడం, గొప్ప నాశనం జరుగుతుంది.
4 మోయాబు ధ్వంసమవుతుంది.
దాని చిన్నవారి పెడబొబ్బలు వినిపిస్తూ ఉంటాయి.
5 లూహీతుకు ఎక్కుతూ ఉండగా ఏడుస్తూనే ఉంటారు.
హొరొవయీంకు దిగుతూ ఉండేవాళ్ళకు నాశనం
అవుతున్న చప్పుడు వినబడుతుంది.
6 “పారిపోండి! మీ ప్రాణాలను దక్కించుకోండి!
ఎడారిలో పొదలాగా ఉండండి!
7 ✽నీవు నీ పనుల మీద, ధనంమీద ఆధారపడ్డావు,
గనుక నీవు కూడా పట్టుబడతావు.
కెమోషు✽, వాడి పూజారులు, అధికారులు
బందీలుగా వేరే దేశానికి పోతారు.
8 వినాశకారి ప్రతి పట్టణం మీదికీ వస్తాడు.
ఏ పట్టణమూ తప్పించుకోదు.
యెహోవా చెప్పినట్టే లోయ నాశనం అవుతుంది,
ఎత్తయిన మైదానం పాడవుతుంది.
9 మోయాబు త్వరగా ఎగిరిపోయేట్టు దానికి
రెక్కలు ఇవ్వండి. దాని పట్టణాలు పాడవుతాయి.
వాటిలో ఎవరూ కాపురముండరు.
10 యెహోవా పూనుకొన్న ఈ పని అశ్రద్ధగా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక! తన ఖడ్గాన్ని రక్తపాతం✽ చేయకుండా చేసేవాడు శాపానికి గురి అవుతాడు గాక!
11 ✽“మోయాబు ఆరంభం నుంచి నెమ్మదిగా ఉంది.
అది మడ్డిమీద నిలిచే ద్రాక్షరసంలాంటిది.
ఒక పాత్రలోనుంచి ఇంకో పాత్రలోకి పోయబడని
దానిలాగా ఉంది.
ఆ జనాన్ని చెరపట్టుకుపోవడం జరగలేదన్న మాట.
గనుక దాని సారం ఎప్పటిలాగే ఉంది.
దాని వాసన కూడా మారలేదు.
12 అయితే రాబోయే రోజుల్లో పాత్రలను వంచేవాళ్ళను దాని దగ్గరికి పంపిస్తాను. వాళ్ళు దానిని వంచి దాని పాత్రలను ఖాళీ చేస్తారు, పగలగొట్టివేస్తారు. ఇది యెహోవా వాక్కు, 13 ✽ఇస్రాయేల్ ప్రజలు బేతేల్ మీద నమ్మకం ఉంచిన సంగతిని గురించి సిగ్గుపడ్డట్టే మోయాబు కెమోషు విషయం సిగ్గుపాలవుతుంది.
14 ‘మేము బలాఢ్యులం, యుద్ధవీరులం’
అని మీరు ఎలా చెప్పుకొంటారు?
15 మోయాబు నాశనం అవుతుంది.
శత్రువులు దాని పట్టణాలలో చొరబడతారు.
మోయాబు యువకులలో ఉత్తములు హతం అవుతారు
అని రాజూ✽, సేనలప్రభువూ అయిన యెహోవా
చెపుతున్నాడు.
16 “మోయాబుకు విపత్తు సమీపంగానే ఉంది.
దానికి ఆపద త్వరగా వస్తూ ఉంది.
17 దాని చుట్టూరా ఉన్న వారలారా!
దాని పేరు ప్రతిష్ఠలు తెలిసిన వారలారా!
మీరంతా దాని విషయం శోకించండి.
‘బలం గల రాజదండం విరిగిపోయింది!
ఘనమైన రాజదండం విరిగిపోయింది!’ అనండి.
18 దీబోను✽ పురవాసులారా! మోయాబును
నాశనం చేసేవాడు మీ మీదికి కూడా వస్తాడు,
మీ కోటలను పాడు చేస్తాడు,
గనుక మీ గొప్పతనం విడిచి దిగిరండి!
ఎండిపోయిన భూమిలో కూర్చోండి!
19 ✽ఆరోయేరు పట్టణస్థులారా!
దారి దగ్గర నిలబడి చూస్తూ ఉండండి.
పారిపోతున్నవాణ్ణి, తప్పించుకుపోతున్న స్త్రీని చూచి
‘ఏం జరిగింది?’ అని అడగండి.”
20 “మోయాబు చితికిపోయింది. సిగ్గుపాలయింది.
గోలపెట్టండి! కేకలు వేయండి!
‘మోయాబు పాడైపోయింద’ని అర్నోను నది దగ్గర చాటించండి.
21 ✽దాని ఎత్తయిన మైదానం మీదికి కూడా న్యాయమైన దండన వచ్చింది. హోలోను, యాహను, మేఫాతు, దీబోను, 22 నెబో, బేత్ దిబ్లాతయీం, 23 కిర్యతాయిం, బేత్‌మెయోను, 24 కెరీయోతు, బొస్రా మోయాబు దేశంలో దగ్గరగా దూరంగా ఉన్న అన్ని పట్టణాలకూ దండన వచ్చింది. 25 ✽మోయాబు కొమ్ము విరిగిపోయింది. దాని హస్తం తెగిపోయింది. ఇది యెహోవా వాక్కు.
26 ✽“మోయాబు యెహోవాకు వ్యతిరేకంగా తనను గొప్ప చేసుకొంది, గనుక దానికి మత్తు కలిగించండి. అది తన వాంతిలో పొర్లాడాలి, నవ్వుల పాలు కావాలి. 27 ఇస్రాయేల్‌ప్రజ నీకు నగుబాటుగా ఉంది గదా. నీవు వారిని గురించి మాట్లాడేటప్పుడెల్లా తల ఆడించుకొంటావేం! మరి వారు దొంగలతో కలిసి తిరిగారా?
28 మోయాబులో నివసించేవారలారా!
మీ పట్టణాలు విడిచి బండల సందులలో ఉండండి.
అగాధం అవతల ప్రక్కన గూడు కట్టుకొనే
పావురంలాగా ఉండండి.
29 ✽“మోయాబువాళ్ళ గర్వాన్ని గురించి మేము విన్నాం.
వాళ్ళు చాలా గర్విష్ఠులు. వాళ్ళ మిడిసిపాటు,
గర్వం, మదం, అహంభావం గురించి నాకు తెలుసు.
ఇది యెహోవా వాక్కు.
30 వాళ్ళ అహంకారం వ్యర్థం. వాళ్ళు పలికే
డంబాలు పనికిమాలినవి.
31 ✽కాబట్టి నేను మోయాబు విషయం విలపిస్తాను.
మోయాబువాళ్ళందరి కోసం ఏడుస్తాను.
కీర్‌హరెశ్ మనుషుల విషయం మూలుగుతాను.
32 సిబ్మా ద్రాక్ష చెట్టూ! యాజెరు విషయం లాగా
నీ విషయం కన్నీళ్ళు విడుస్తాను.
నీ తీగెలు సరస్సు అవతలికి కూడా వ్యాపించాయి.
అవి యాజెరు సరస్సు వరకు ప్రాకాయి.
నీ వేసవికాలం పండ్లమీద, నీ ద్రాక్ష గెలలమీద
వినాశకారి పడ్డాడు.
33 మోయాబు ఫలవంతమైన పొలాలలో
సంతోషానందాలు లేకుండా పోయాయి.
ద్రాక్ష గానుగ తొట్లలో ద్రాక్షరసం లేకుండా నేను చేశాను.
ఎవరూ వాటిని సంతోషంతో త్రొక్కరు.
కేకలు ఉన్నా అవి సంతోషాన్ని సూచించే కేకలు కావు.
34 నిమ్రీంలో నీళ్ళు కూడా ఇంకిపోయాయి గనుక హెష్బోనులోనుంచి వాళ్ళ బొబ్బలు ఏలాలే వరకు, యాహసు వరకు వినబడుతూ ఉన్నాయి; సోయరు నుంచి హొరొనయీం వరకు, ఎగ్లాత్‌షాలిషా వరకు వినబడుతాయి. 35 ✽ఎత్తయిన పూజా స్థలాలలో బలులు అర్పించేవాళ్ళు, తమ దేవుళ్ళకు ధూపం వేసేవాళ్ళు మోయాబులో లేకుండా నేను చేస్తాను. ఇది యెహోవా వాక్కు.
36 “కాబట్టి మోయాబు కోసం నా హృదయం పిల్లనగ్రోవిలాగా ధ్వనిస్తూ ఉంది. కీర్‌హరెశ్‌వాళ్ళ విషయం నా హృదయం పిల్లనగ్రోవిలాగా ధ్వనిస్తూ ఉంది. వాళ్ళు సంపాదించుకొన్న ఆస్తి అంతా నాశనమైంది. 37 ✽ప్రతి తల బోడిగా చేయబడింది. ప్రతి గడ్డం చెక్కివేయబడింది. అన్ని చేతులకు కాట్లు ఉన్నాయి, ప్రతి నడుముమీద గోనెపట్ట ఉంది. 38 ✽ఎవరికీ నచ్చని కుండలాగా మోయాబును నేను పగలగొట్టాను, గనుక మోయాబులో ప్రతి ఇంటి కప్పుమీద, దాని వీధుల్లో రోదనం వినబడుతూ ఉంది. ఇది యెహోవా వాక్కు. 39 మోయాబు ఎంత చితికిపోయింది! వాళ్ళు ఎంత గోల పెడుతున్నారు! మోయాబు వీపు చూపి పారిపోయింది. ఎంత సిగ్గు! వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు హేళనగా అసహ్యకారణంగా అయ్యారు.”
40 ✽ యెహోవా చెప్పేదేమిటంటే,
“ఇదిగో! శత్రువు గరుడపక్షిలాగా ఎగిరివస్తున్నాడు,
తన రెక్కలు మోయాబుమీద చాపుతున్నాడు.
41 పట్టణాలను పట్టుకొంటాడు, కోటలను వశం చేసుకొంటాడు.
ఆ రోజున మోయాబు యుద్ధవీరుల గుండెలు,
ప్రసవవేదనలు పడుతున్న స్త్రీ గుండెలాగా ఉంటాయి.
42 ✽యెహోవాకు వ్యతిరేకంగా తనను గొప్ప చేసుకొన్నందుచేత
మోయాబు జనంగా ఉండకుండా పూర్తిగా నాశనం అవుతుంది.
43 మోయాబు దేశ నివాసులారా!
భయం, గొయ్యి, ఉరి మీ ఎదుటే ఉన్నాయి.
ఇది యెహోవా వాక్కు.
44 భయ కారణం నుంచి పారిపోయేవాళ్ళు గోతిలో పడతారు.
గోతిలోనుంచి పైకి ఎక్కేవాళ్ళు ఉరిలో చిక్కుకొంటారు.
మోయాబు మీదికి రావలసిన శిక్షా సంవత్సరం✽
రప్పించబోతున్నాను. ఇది యెహోవా వాక్కు.
45 ✝హెష్బోనులో నుంచి జ్వాల బయలుదేరింది,
సీహోను మధ్యనుంచి మంటలు వచ్చాయి.
అవి మోయాబు నుదురును, అల్లరిమూక
నడినెత్తిని కాల్చాయి,
గనుక పారిపోయినవాళ్ళు హెష్బోను నీడలో
దిక్కుమాలినవాళ్ళై నిలబడి ఉన్నారు.
46 మోయాబూ! నీకు బాధ తప్పదు.
కెమోషు జనం నాశనమవుతారు.
నీ కొడుకులు బందీలుగా పోతారు,
నీ కూతుళ్ళు చెరలోకి పోతారు.
47 ✽అయినా రాబోయే కాలంలో మోయాబుకు
ముందున్న క్షేమస్థితిని నేను మళ్ళీ కలిగిస్తాను.
ఇది యెహోవా వాక్కు.”
ఇంతటితో మోయాబు తీర్పును గురించిన
సందేశం అయిపోయింది.