47
1 ✽ఇది ఫిలిష్తీయప్రజలను గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు, ఇది ఫరో గాజా పట్టణాన్ని గెలవక ముందే వచ్చింది. 2 “యెహోవా చెప్పేదేమిటంటే,ఉత్తరదిక్కున నీళ్ళు పెల్లుబికి వస్తున్నాయి.
అవి వరదలై పొర్లి పారుతాయి.
అవి ఈ దేశంనిండా పారుతాయి.
దేశంలో ఉన్న వాటన్నిటిమీదా పారుతాయి.
పట్టణాల మీద, వాటిలో కాపురముంటున్న
వాళ్ళమీద పారుతాయి.
ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు.
దేశంలో ఉంటున్న వాళ్ళంతా రోదనం చేస్తారు.
3 శత్రువుల బలమైన గుర్రాల గిట్టలు నేలకు
తగులుతూ ఉంటే, రథాలు వేగంగా వస్తూ ఉంటే,
వాటి చక్రాలు ఉరుముతూ ఉంటే,
ఆ చప్పుడుకు తండ్రుల చేతులు బలహీనమవుతాయి.
వాళ్ళు తమ పిల్లలకోసం వెనక్కు చూడరు.
4 ✽ఫిలిష్తీయవాళ్ళందరినీ నాశనం చేసే రోజు రాబోతున్నది.
తూరు, సీదోనులకు సహాయం చేయగల
మిగతా వాళ్ళందరినీ నిర్మూలించే రోజు రాబోతున్నది.
కఫ్తోర్ ద్వీపం నుంచి వచ్చిన మిగతా ఫిలిష్తీయవాళ్ళను
యెహోవా నాశనం చేస్తాడు.
5 ✽గాజా నగరం బోడిగా మారింది.
అష్కెలోను నగరం పాడైపోయింది.
ఆ మైదానంలో మిగిలినవారలారా!
ఎన్నాళ్ళు మిమ్ములను మీరే గాయపరచుకొంటారు?
6 యెహోవా ఖడ్గమా! ఇంకా ఎన్నాళ్ళు
నీవు విశ్రాంతి తీసుకోకుండా ఉంటావు?
నీ ఒరలోకి దూరి విశ్రాంతి తీసుకో, ఊరుకో! అంటారా?
7 కాని, యెహోవా దానికి ఆజ్ఞ జారీ చేశాడు,
అష్కెలోనుమీద, సముద్రతీర ప్రదేశాలమీద
పడమని ఆదేశించాడు.
గనుక అది ఎలా నిమ్మళంగా ఉంటుంది?”