46
1  ఇతర జనాలను గురించి యిర్మీయా ప్రవక్తకు వచ్చిన యెహోవా వాక్కు: 2 ఈజిప్ట్‌ను గురించి వచ్చిన మాట ఇది: యూదా రాజైన యెషీయా కొడుకు యెహోయాకీం పరిపాలించిన నాలుగో సంవత్సరంలో, ఈజిప్ట్ రాజు ఫరో నెకో సైన్యాన్ని బబులోను రాజు నెబుకద్‌నెజరు యూఫ్రటీసు నది దగ్గర ఉన్న కర్కెమీషులో ఓడించాడు. ఇది ఫరో నెకో సైన్యాన్ని గురించిన మాట:
3 “పెద్ద డాలు, చిన్న డాలు పట్టుకొని
వరుసగా నిలబడి యుద్ధానికి సాగండి!
4 గుర్రాలను సిద్ధం చేసుకొని ఎక్కండి!
శిరస్త్రాణాలను తలమీద పెట్టుకొని నిలబడండి!
ఈటెలను పదునుపెట్టండి! కవచాలు తొడుక్కోండి!
5 అయితే నాకు ఏమి కనిపిస్తున్నది?
వాళ్ళు హడలిపోతున్నారు! వెనక్కు తిరుగుతున్నారు!
వాళ్ళ యుద్ధ వీరులు ఓడిపోతున్నారు!
వెనక్కు చూడకుండా వేగంగా పారిపోతున్నారు!
అన్ని వైపులా భయం తాండవిస్తూ ఉంది!
ఇది యెహోవా వాక్కు.
6 “త్వరగా పరుగెత్తగలవాడు కూడా పరారీ కాలేడు.
బలాఢ్యుడు కూడా తప్పించుకోలేడు.
ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది దగ్గర తడబడుతూ
కూలుతున్నారు.
7 నైలు నదిలాగా పైకి ఎక్కుతున్నదెవరు?
8 నైలు నదిలాగా, ఉప్పొంగిపోతున్న ప్రవాహాలలాగా
ఈజిప్ట్ పైకి ఎక్కుతూ ఉంది,
‘నేను ఎక్కి భూమిని కప్పుతాను. నగరాలను,
వాటి నివాసులను నాశనం చేస్తాను’ అంటున్నది.
9 గుర్రాల్లారా! ముందుకు సాగండి!
డాళ్ళు పట్టుకొన్న కూషు, పూత్ జాతులవారలారా,
విల్లెక్కుపెట్టే లూదీయవారలారా, ముందుకు సాగండి!
10 “అయితే ఆ దినం సేనలప్రభువు యెహోవాది.
ఆయన తన శత్రువులకు ప్రతీకారం చేసే రోజు అది.
ఉత్తర దేశంలో యూఫ్రటీస్ నది దగ్గర సేనల ప్రభువు
యెహోవా బలి చేస్తాడు.
ఖడ్గం తృప్తిపడే వరకూ హతం చేస్తూ ఉంటుంది,
మత్తెక్కే వరకు వాళ్ళ రక్తం త్రాగుతూ ఉంటుంది.
11 ఈజిప్ట్ కన్య కుమారీ! గిలాదుకు వెళ్ళి మందు తెచ్చుకో.
అయితే నీవు అనేక మందులు వాడుకోవడం వ్యర్థం.
నీకు నయం కావడమంటూ ఉండదు.
12 ఇతర జనాలు నీ అపకీర్తిని గురించి వింటాయి.
భూమి అంతా నీ పెడబొబ్బలతో నిండి ఉంటుంది.
నీ శూరులు తడబడుతూ, ఒకణ్ణి ఒకడు తగిలి కూలుతారు.”
13 ఈజిప్ట్ పైబడడానికి బబులోను రాజు నెబుకద్‌నెజరు రాకడను గురించి యెహోవా యిర్మీయా ప్రవక్తతో పలికిన వాక్కు:
14 “ఈజిప్ట్‌లో ఈ ప్రకటన చేయండి –
మిగ్దోల్‌లో, నోప్‌లో, తహపనేసులో దీనిని చాటించండి:
ఖడ్గం మీ చుట్టూరా నాశనం చేస్తుంది,
గనుక మీరు ధైర్యంతో నిలబడండి.
15 మీ యుద్ధవీరులు కూలడం ఎందుకు?
యెహోవా వాళ్ళను త్రోసివేస్తున్నాడు
గనుక వాళ్ళు నిలబడలేకపోతారు.
16 వాళ్ళు మళ్ళీ మళ్ళీ తడబడుతారు,
ఒకడిమీద ఒకడు పడిపోతారు.
వాళ్ళు ‘లెండి! క్రూరుల ఖడ్గాన్ని తప్పించుకొందాం పదండి!
మన సొంత ప్రజ దగ్గరికి, మన దేశానికి వెళ్దాం’
అని చెప్పుకొంటారు.
17 ‘ఈజిప్ట్ రాజు ఫరో వట్టి చప్పుడు చేసేవాడు.
అవకాశాన్ని జార విడుచుకొనేవాడు’
అని వాళ్ళు అక్కడ అంటారు.
18 రాజు – సేనల ప్రభువు యెహోవా –
చెప్పేదేమిటంటే, పర్వతాలలో తాబోరు లాంటివాడు
మీ మీదికి వస్తాడు.
అతడు సముద్రం దగ్గర ఉన్న కర్మెల్ పర్వతం
లాంటివాడు. నా జీవం తోడని చెపుతున్నాను.
19 ఈజిప్ట్‌లో ఉంటున్న వారలారా!
నోప్ నగరం పాడైపోతుంది.
కాపురస్థులెవరూ లేకుండా శిథిలమవుతుంది.
మీరు బందీలుగా వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకోండి.
20 “ఈజిప్ట్ అందమైన పెయ్యలాంటిది.
అయితే దానిమీదికి ఉత్తర దిక్కునుంచి
కందిరీగ తప్పక వస్తుంది.
21 దాని అరువు సైనికులు బలిసిన దూడలలాంటివాళ్ళు.
వాళ్ళు కూడా నిలవలేకపోతారు,
వెనక్కు తిరిగి పారిపోతారు.
ఆపద రోజు వాళ్ళమీదికి వస్తుంది.
అది వాళ్ళను దండించే సమయం.
22 శత్రువులు దండెత్తి వస్తూ ఉంటే, ఈజిప్ట్ చేసే చప్పుడు
పారిపోయే పాము చేసే చప్పుడు వంటిది అవుతుంది.
చెట్టును నరికేవాళ్ళలాగా శత్రువులు గొడ్డళ్ళు పట్టుకువస్తారు.
23 అన్వేషణ చేయడానికి వీలులేకుండా ఉన్న దాని అడవిని నరికి వేస్తారు. ఇది యెహోవా వాక్కు. వాళ్ళు మిడతలకంటే ఎక్కువగా ఉంటారు. వాళ్ళు లెక్కలేనంత మంది. 24 ఈజిప్ట్ కుమారి అవమానం పాలవుతుంది. ఉత్తరదిక్కున ఉన్న ప్రజల వశం అవుతుంది.”
25 ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, “నో నగరం లో ఉన్న ఆమోను దేవుణ్ణి, ఫరోను, ఈజిప్ట్‌ను, దాని దేవుళ్ళను, దాని రాజులను, ఫరోమీద నమ్మకం ఉంచినవాళ్ళను నేను దండిస్తాను. 26 వాళ్ళ ప్రాణం తీయడానికి చూచే బబులోను రాజు నెబుకద్‌నెజరుకూ అతడి అధిపతులకూ వాళ్ళను అప్పగిస్తాను. అయినా, తరువాత ఈజిప్ట్‌లో మునుపటిలాగే కాపురస్థులు ఉంటారు. ఇది యెహోవా వాక్కు.
27 “నా సేవకుడైన యాకోబూ! భయపడకు!
ఇస్రాయేలూ! హడలిపోవద్దు.
దూరదేశంలో ఉన్న మిమ్ములను అక్కడనుంచి
నేను రక్షిస్తాను.
మీ సంతానాన్ని వాళ్ళు బందీలుగా వెళ్ళినదేశం
నుంచి రక్షిస్తాను.
యాకోబు ప్రజ తిరిగి వచ్చి నిమ్మళంగా
ప్రశాంతంగా ఉంటారు.
వారిని ఎవరూ భయపెట్టరు.
28 నా సేవకుడైన యాకోబూ,
నేను నీకు తోడుగా ఉన్నాను.
భయపడవద్దు. నేను మిమ్ములను చెదరగొట్టిన
అన్ని దేశాల ప్రజలను పూర్తిగా నాశనం చేసినా,
మిమ్ములను పూర్తిగా నాశనం చేయను.
మిమ్ములను శిక్షించకుండా ఉండను గాని,
న్యాయానుసారంగా శిక్షిస్తాను.”