45
1 యూదా రాజైన యెషీయా కొడుకు యెహోయాకీం పరిపాలించిన నాలుగో సంవత్సరంలో యిర్మీయా నోటినుంచి వెలువడ్డ ఆ మాటలు నేరీయా కొడుకు బారూకు చుట్టిన కాగితంలో వ్రాసిన తరువాత యిర్మీయాప్రవక్త బారూకుతో ఇలా అన్నాడు: 2 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా నీకు చెప్పేదేమిటంటే, 3 బారూకు! నీవు అన్నావు గదా, ‘నేను బాధితుణ్ణి. నా నొప్పికి యెహోవా దుఃఖాన్ని తోడు చేశాడు. మూలుగుతూ నీరసించిపోయాను. నాకు విశ్రాంతి దొరకడం లేదు.’
4 “అతనితో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, ఈ దేశం అంతటిలో నేను నిర్మించిన దానిని పడగొట్టివేస్తున్నాను, నేను నాటిన దానిని పెరికివేస్తున్నాను. 5 ఇలాంటప్పుడు నీకోసం నీవు ఏమైనా గొప్పవాటిని వెదుకుతూ ఉన్నావా? వాటిని వెదకవద్దు. శరీరం ఉన్న వాళ్ళందరి మీదికీ నేను విపత్తు రప్పిస్తాను. అయితే నీవు ఎక్కడికి వెళ్ళినా అన్ని స్థలాలలో దోపిడీసొమ్ము దొరికినట్టు నీకు ప్రాణం దక్కేలా చేస్తాను.”