44
1 ఈజిప్ట్ దేశంలో ఉన్న మిగ్‌దోల్, తహపనేసు, నోప్, పత్రోసులలో యూదులు కాపురమున్నారు. వారిని గురించి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్తున్నాడు: నేను జెరుసలం మీదికీ యూదా పట్టణాలన్నిటి మీదికీ రప్పించిన విపత్తును మీరు చూశారు. ప్రజలు చేసిన దుర్మార్గం కారణంగా అవి పాడుగా ఉన్నాయి, వాటిలో ఎవరూ ఉండడం లేదు. 3  తమకు గానీ మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని ఇతర దేవుళ్ళకు వాళ్ళు మొక్కుతూ, ధూపం వేస్తూ వచ్చారు. ఆ విధంగా వాళ్ళు నాకు కోపం రేపారు. 4 నేను నా సేవకులైన ప్రవక్తలను పొద్దున్నే లేపి మీ దగ్గరికి పంపిస్తూ నేను అసహ్యించుకొనే ఆ నీచమైన పని చేయవద్దు అని వారి చేత పలికించాను. 5 అయినా వాళ్ళు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు, వాళ్ళ చెడుగునుంచి మళ్ళలేదు, ఇతర దేవుళ్ళకు ధూపం వేయడం మానలేదు. 6  అందుచేత నా తీవ్ర కోపం కుమ్మరించాను. అది జెరుసలం వీధుల్లో యూదా పట్టణాలలో మండుతూ ఉంది. ఈ రోజు వరకు అవి నాశనమై పాడుదిబ్బలుగా ఉన్నాయి.
7 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా దేవుడు చెప్పేదేమంటే, ఇప్పుడు మీకు మీరే ఎందుకు ఈ గొప్ప హాని చేసుకొంటున్నారు? మీలో ఎవరూ మిగలకుండా యూదా ప్రజల మధ్యనుంచి పురుషులు, స్త్రీలు, చంటిబిడ్డలు, చిన్నవారు అందరూ నాశనం అయ్యేట్టు చేస్తున్నారు. 8 ఉండడానికి మీరు వచ్చిన ఈజిప్ట్‌లో ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ మీ చేతులు చేసిన వాటిచేత నాకు కోపం రేపుతూ ఉన్నారు. ఎందుకు? దాని మూలంగా మీరు నాశనమౌతారు, భూమిమీద ఉన్న అన్ని జనాలమధ్య శాపానికీ నిందకూ గురి అవుతారు. 9 మీ పూర్వీకులూ యూదా రాజులూ వాళ్ళ భార్యలూ మీరూ మీ భార్యలూ యూదా దేశంలో, జెరుసలం వీధుల్లో జరిగించిన చెడుగును మీరు మర్చిపోయారా? 10 ఈ రోజు వరకు వాళ్ళు పశ్చాత్తాపపడలేదు, భయపడలేదు, నేను మీకు, మీ పూర్వీకులకు నియమించిన ఉపదేశాన్నీ చట్టాలనూ అనుసరించలేదు.
11 “కాబట్టి ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీమీదికి విపత్తు రప్పించాలని నిశ్చయించుకొన్నాను, యూదావారందరినీ నాశనం చేస్తాను. 12 ఈజిప్ట్‌లో కాపురముందామని నిశ్చయించుకొన్న మిగతా యూదావాళ్ళను నేను తీసివేస్తాను. వాళ్ళంతా ఈజిప్ట్‌లోనే నాశనమవుతారు. కొద్దివాళ్ళేమీ గొప్పవాళ్ళేమీ అందరూ ఖడ్గానికీ కరవుకూ గురి అయి చస్తారు. వాళ్ళు శాపకారణంగా, అసహ్యకారణంగా అవుతారు, దూషణ నిందల పాలవుతారు. 13 నేను జెరుసలం వాళ్ళను ఖడ్గంతో కరవుతో ఘోరమైన అంటురోగంతో శిక్షించినట్లే ఈజిప్ట్‌లో ఉంటున్న వీళ్ళను దండిస్తాను. 14 వాళ్ళు యూదా దేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడ కాపురముండాలని ఆశిస్తున్నారు గానీ ఈజిప్ట్‌లో ఉందామని ఇక్కడికి వచ్చిన మిగతా యూదావాళ్ళలో తప్పించుకొనే వాళ్ళు ఎవరూ ఉండరు, ఎవరూ మిగలరు, యూదా దేశానికి తిరిగి వెళ్ళరు కొద్దిమంది మాత్రమే తప్పించుకొంటారు.”
15 తమ భార్యలు ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తున్నారని తెలిసిన పురుషులందరూ, అక్కడ పెద్ద గుంపుగా సమకూడిన స్త్రీలందరూ ఈజిప్ట్‌లో, పత్రోసు ప్రదేశంలో కాపురమున్న వాళ్ళంతా యిర్మీయాకు ఇలా జవాబిచ్చారు: 16 “యెహోవా పేర నీవు మాతో చెప్పిన మాట మేము వినము. 17 మా నోటినుంచి వెలువడే ప్రతిమాట ప్రకారం తప్పక జరిగిస్తాం. మేము, మా తండ్రులు, మా రాజులు, అధికారులు, యూదా పట్టణాలల్లో, జెరుసలం వీధుల్లో ఆకాశరాణి దేవతకు ధూపం వేసి పానార్పణలు అర్పించినట్టే ఇప్పుడు కూడా మేము చేస్తాం. ఆ కాలంలో మాకు ఆహారం సమృద్ధిగా ఉంది. అంతా క్షేమంగా ఉంది. మేము ఏమీ ఆపద చూడలేదు. 18 మేము ఎప్పుడైతే ఆకాశరాణి దేవతకు ధూపం వేయడం, పానార్పణలు అర్పించడం మానుకొన్నామో అప్పటినుంచి మాకు అన్నీ కొరతగానే ఉన్నాయి. మేము ఖడ్గం చేత, కరవుచేత నాశనం అవుతున్నాం.”
19 ఆ స్త్రీలు “మేము ఆకాశరాణికి ధూపం వేశాం, పానార్పణలు అర్పించాం నిజమే. అయితే మా భర్తల అనుమతి లేకుండా ఆమెకోసం ఆమెను పోలిన పిండివంటలు చేసి ఆమెకు పానార్పణలు అర్పించామా?” అన్నారు.
20 యిర్మీయా తనకు జవాబిచ్చిన ప్రజలందరితో ఆ స్త్రీ పురుషులతో ఇలా అన్నాడు: 21 “యూదా పట్టణాలలో, జెరుసలం వీధులలో మీరు, మీ తండ్రులు, మీ రాజులు, మీ అధికారులు, యూదా దేశంవాళ్ళంతా ధూపం వేసిన సంగతి యెహోవాకు జ్ఞాపకం లేదని అనుకొంటున్నారా? ఆయన దాని గురించి తలచుకొన్నాడు గదా. 22 మీరు చేసిన చెడుగునూ, నీచమైన పనులనూ ఆయన ఇక సహించలేకపోయాడు. అందుకే మీ దేశం ఈరోజు ఉన్నట్టు, నిర్మానుష్యంగా, పాడుగా, దూషణ కారణంగా, అసహ్యకారణంగా అయింది. 23 మీరు యెహోవా మాట వినలేదు. ఆయన ఉపదేశం, చట్టాలు, సాక్షిగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రవర్తించలేదు. మీరు ధూపం వేస్తూ, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నారు. గనుకనే ఈరోజు మీరు చూస్తూ ఉన్నట్టు ఈ విపత్తు మీకు సంభవించింది.”
24 యిర్మీయా ఆ ప్రజలందరితో, స్త్రీలందరితో ఇంకా ఇలా అన్నాడు: “ఈజిప్ట్‌లో ఉంటున్న యూదావారలారా, మీరంతా యెహోవా మాట వినండి. 25 ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీరు అన్నారు గదా, ‘మేము ఆకాశరాణి దేవతకు ధూపం వేస్తామని, పానార్పణలు అర్పిస్తామని మొక్కుబడి చేసుకున్నాం. దాని ప్రకారం తప్పనిసరిగా జరిగిస్తాం కూడా.’ మీరు, మీ భార్యలు నోటితో చెప్పిన మాటను మీ చేతులతో నెరవేర్చారు. అవును, మీరు మీ మొక్కుబళ్ళను తప్పక నెరవేరుస్తారు! వాటిప్రకారమే చేసితీరుతారు! 26 అయితే యెహోవా మాట వినండి. ఈజిప్ట్‌లో ఉంటున్న యూదులారా! యెహోవా చెప్పేదేమిటంటే, ఈజిప్ట్‌లో ఉన్న యూదావాళ్ళలో ఎవరూ ‘యెహోవా ప్రభు జీవం తోడు’ అని ఇకమీదట నా పేర ఒట్టు పెట్టుకోరు. నా గొప్ప పేరు మీద శపథం చేస్తున్నాను. 27 ఎందుకంటే నేను వాళ్ళకు మంచి కాదు గాని, కీడే కలిగించడానికి పూనుకొంటాను. ఈజిప్ట్‌లో ఉంటున్న యూదా వాళ్ళంతా పూర్తిగా నాశనమయ్యేవరకు ఖడ్గం, కరవు పాలవుతారు. 28 ఖడ్గాన్ని తప్పించుకొని ఈజిప్ట్‌నుంచి యూదా దేశానికి తిరిగి వెళ్ళేవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఈజిప్ట్‌లో ఉండడానికి వచ్చిన మిగతా యూదా వాళ్ళంతా నా మాట నిలుస్తుందో, వాళ్ళ మాట నిలుస్తుందో అప్పుడు తెలుసుకొంటారు.
29 “ఇది యెహోవా వాక్కు మీకు వ్యతిరేకంగా నా మాట తప్పకుండా నిలుస్తుందని మీరు తెలుసుకొనేలా ఈ స్థలంలో నేను మిమ్ములను శిక్షిస్తానని ఈ సూచన మీకు ఇస్తాను: 30 ఈజిప్ట్ రాజైన ఫరో హొఫ్రను, అతడి ప్రాణం తీయజూచే అతడి శత్రువుల వశం చేస్తాను. యూదా రాజు సిద్కియాను, అతడి ప్రాణం తీయజూచిన శత్రువైన బబులోను రాజు నెబుకద్‌నెజరు వశం చేసినట్టే ఫరో హొఫ్రను అతడి ప్రాణం తీయజూచే శత్రువుల వశం చేస్తాను.”