43
1 వారి దేవుడు యెహోవా తనద్వారా ప్రజలకు పంపించిన సందేశం యిర్మీయా వారందరికీ తెలియజేసిన తర్వాత వారి దేవుడు యెహోవా మాటలన్నీ చెప్పిన తర్వాత, 2 హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానాను, ఇంకా గర్విష్ఠులంతా యిర్మీయాతో ఇలా అన్నారు: “నీవు అబద్ధమాడుతున్నావు. ఈజిప్ట్‌లో ఉండడానికి అక్కడికి వెళ్ళవద్దని మాతో చెప్పమని మన దేవుడు యెహోవా నిన్ను పంపలేదు. 3 అయితే నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపిస్తున్నాడు. మేము కల్దీయవాళ్ళ వశం కావాలనీ వాళ్ళు మమ్మల్ని చంపాలనీ లేదా బబులోనుకు బందీలుగా తీసుకుపోవాలనీ వాడి ఉద్దేశం.”
4 యూదాదేశంలో ఉండాలని యెహోవా ఇచ్చిన ఆజ్ఞను కారేహ కొడుకు యోహానాను, సైన్యాధిపతులంతా, ప్రజలంతా శిరసావహించలేదు. 5 కారేహ కొడుకు యోహానాను సైన్యాధిపతులంతా ఇలా చేశారు: చెదరిపోయిన అన్ని దేశాలనుంచి యూదా దేశంలో కాపురముండడానికి వచ్చిన యూదా వారందరినీ పురుషులనూ స్త్రీలనూ పిల్లలనూ అందరినీ 6 రాజు కుమార్తెలనూ తీసుకొని బయలుదేరారు. కావలివాళ్ళ అధిపతి నెబుజరదాను షాఫాను మనుమడూ అహీకాం కొడుకూ అయిన గెదల్యా దగ్గర విడిచిపెట్టిన వారందరినీ, యిర్మీయాప్రవక్తనూ నేరీయా కొడుకైన బారూకునూ కూడా తీసుకుపోయారు. 7 వాళ్ళు యెహోవా మాట పెడచెవిని పెట్టి, ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. తహపనేసు వరకు ప్రయాణం సాగించారు.
8 తహపనేసులో యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 9 “యూదులు చూస్తూ ఉండగానే నీ చేతుల్లో పెద్ద రాళ్ళను తీసుకొని తహపనేసులో ఫరో నగరుద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పరచిన స్థలంలో ఉన్న సున్నంలో వాటిని పాతిపెట్టు. 10 అప్పుడు వాళ్ళతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడూ సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేది ఏమిటంటే ఇదిగో వినండి! నేను నా దాసుడైన బబులోను రాజు నెబుకద్‌నెజరును పిలవనంపిస్తాను. నేను దాచిన ఈ రాళ్ళమీద అతడు తన సింహాసనం నిలుపుకొనేట్టు చేస్తాను. అతడు తన రత్నకంబళిని వాటిమీదే వేయిస్తాడు. 11 అతడు వచ్చి ఈజిప్ట్ పై బడతాడు. అప్పుడు అంటురోగానికి నిర్ణయిమైన వాళ్ళు అంటురోగానికి గురి అవుతారు, చెర కోసం నిర్ణయమైన వాళ్ళు చెరకు పోతారు, కత్తికి నిర్ణయమైన వాళ్ళు కత్తిపాలవుతారు. 12 ఈజిప్ట్‌వారి దేవుళ్ళ గుళ్ళకు నేను జ్వాల అంటిస్తాను. నెబుకద్‌నెజరు వాటిని కాల్చివేసి ఆ దేవుళ్ళ విగ్రహాలను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన కంబళిని చుట్టుకొన్నట్టు అతడు ఈజిప్ట్ దేశాన్ని తనకు చుట్టుకొంటాడు. తర్వాత అక్కడనుంచి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. 13 ఈజిప్ట్‌లో ఉన్న సూర్యుడి ఆలయంలోని విగ్రహాలను పగలగొట్టివేస్తాడు. ఈజిప్ట్ వారి దేవుళ్ళ గుళ్ళను మంటలంటించి కాల్చివేస్తాడు.”