42
1 అప్పుడు సైన్యాధిపతులందరూ, కారేహ కొడుకు యోహానాను, హోషీయా కొడుకు యెజన్యా, కొద్దివారేమీ, గొప్పవారేమీ ప్రజలంతా యిర్మీయాప్రవక్త దగ్గరికి వచ్చారు, 2 అతనితో ఇలా అన్నారు: “చాలామందిలో కొద్దిమందిమే మిగిలాం. అది మీరు చూస్తూ ఉన్నారు. దయచేసి మా విన్నపం అంగీకరించి, మిగిలిన మా అందరికోసం మీ దేవుడు యెహోవాకు ప్రార్థన చెయ్యండి. 3 మేము ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చెయ్యాలో మీ దేవుడు యెహోవా మాకు తెలియజేయాలి.”
4 యిర్మీయా ప్రవక్త “సరే, మీరు చెప్పినది నేను విన్నాను. మీరు చెప్పినట్టే నేను మన దేవుడు యెహోవాకు ప్రార్థన చేస్తాను. యెహోవా మీకు ఏ జవాబు ఇస్తాడో అది మీకు తెలియజేస్తాను. మీనుంచి ఏదీ దాచుకోను” అని వారికి బదులు చెప్పాడు.
5 అందుకు వారు యిర్మీయాతో, “యెహోవా మిమ్మల్ని ఏ సందేశంతో మా దగ్గరికి పంపిస్తాడో దానంతటి ప్రకారం మేము ప్రవర్తించకపోతే యెహోవా నమ్మకమైన సత్యసాక్షిగా ఉంటాడు గాక! 6 ఆయన చెప్పేది అనుకూలంగా ఉన్నా, లేకపోయినా, దానికి లోబడతాం. మాకు మేలు చేకూరేలా మన దేవుడు యెహోవా మాటకు లోబడతామని మేము నిన్ను ఆయన దగ్గరికి పంపిస్తున్నాం గదా” అన్నారు.
7 పది రోజుల తర్వాత యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది. 8 గనుక అతడు కారేహ కొడుకైన యోహానానునూ అతడితో కూడా ఉన్న సైన్యాధిపతులందరినీ, కొద్దివారేమీ, గొప్పవారేమీ ప్రజలందరినీ పిలిపించి వారితో ఇలా అన్నాడు: 9 “ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా సన్నిధానంలో మీ మనవి తెలియజేయమని నన్ను పంపారు గదా. ఆయన చెప్పేదేమిటంటే, 10 నేను మీ మీదికి రప్పించిన విపత్తు విషయం నేను నొచ్చుకొంటూ ఉన్నాను, గనుక మీరు మీ దేశంలోనే నిలిచి ఉంటే, నేను మిమ్ములను పడగొట్టక మీకు అభివృద్ధి కలిగిస్తాను. మిమ్ములను పెరికివేయక నాటుతాను. 11 మీరు బబులోను రాజుకు భయపడుతున్నారు. భయపడవద్దు. ఇది యెహోవా వాక్కు. మిమ్ములను కాపాడుతూ, అతడి చేతినుంచి రక్షించడానికి నేను మీతో ఉన్నాను. 12 అతడు మిమ్ములను దయతో చూచి మీ భూములకు తిరిగి వెళ్ళనిచ్చేట్టు నేను మీ మీద దయ చూపుతాను.
13 “ఒకవేళ మీరు మీ దేవుడు యెహోవా మాట వినక ‘మేము ఈ దేశంలో ఉండమ’ని చెప్పవచ్చు. 14 ఈజిప్ట్‌లో యుద్ధం చూడము, బూరధ్వని వినము, ఆహారంకోసం ఆకలిగొనము. ఆ దేశానికి వెళ్ళి అక్కడే ఉంటామని చెప్పవచ్చు. 15 అయితే యూదాలో మిగిలిన ప్రజలారా, యెహోవా చెప్పేది వినండి. ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే ఈజిప్ట్‌కు వెళ్ళడానికి మీరు నిశ్చయించుకొని, అక్కడ ఉండడానికి వెళ్తే, 16 మీరు భయపడుతూ ఉన్న ఖడ్గం అక్కడ మీమీదికి వస్తుంది, మీరు భయపడుతూ ఉన్న కరవు ఈజిప్ట్‌కు మీ వెంటబడి వస్తుంది. మీరు అక్కడ చస్తారు. 17 ఈజిప్ట్‌లో ఉండడానికి వెళ్ళాలని నిశ్చయించుకొన్న వారందరూ అక్కడ ఖడ్గానికి, కరవుకు, ఘోరమైన అంటురోగానికి గురియై చస్తారు. నేను వారి మీదికి రప్పించే విపత్తు నుంచి ఎవరూ తప్పించుకోరు. 18 ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ‘జెరుసలం నివాసులమీద నా కోపం, నా ఆగ్రహం కుమ్మరించినట్టే ఈజిప్ట్‌కు వెళ్ళే మీమీద నా ఆగ్రహం కుమ్మరిస్తాను. మీరు శాపానికి గురి అవుతారు, అసహ్యకారణం అవుతారు, దూషణ నిందలపాలౌతారు. తిరిగి ఈ స్థలాన్ని ఎన్నడూ చూడరు.
19 “యూదాలో మిగిలిన వారలారా, ఈజిప్ట్‌కు వెళ్ళవద్దని యెహోవా మీకు చెప్పాడు. ఈ రోజు నేను మీ ఎదుట సాక్షిగా నిలబడి ఉన్నానని తెలుసుకోండి. 20 మీరు నన్ను మన దేవుడు యెహోవా దగ్గరికి పంపిస్తూ మాకోసం మన దేవుడు యెహోవాకు ప్రార్థన చెయ్యండి. ఆ ప్రకారమే చేస్తాం అన్నారు. అందులో మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొన్నారు. 21 ఆయన చెప్పినది ఈ రోజు మీకు తెలియజేశాను. అయినా మీ దేవుడు యెహోవా నాచేత మీకు పంపించిన మాట మీరు వినలేదు. 22 ఉండడానికి వెళ్ళాలని మీరు ఆశించే స్థలంలో మీరు ఖడ్గంచేత, కరవుచేత, అంటురోగం చేత చస్తారని బాగా తెలుసుకోండి.”