41
1 ✽ఎలీషామా మనుమడూ నెతన్యా కొడుకూ అయిన ఇష్మాయేల్ రాజవంశంవాడు, రాజు అధికారులలో ఒకడు. ఏడో నెలలో అతడు పదిమంది మనుషులతో కూడా మిస్పాలో ఉన్న అహీకాం కొడుకైన గెదల్యాదగ్గరికి వచ్చాడు. వారందరూ మిస్పాలో కలిసి భోజనం చేశారు. 2 ఉన్నట్లుండి నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అతడితోపాటు ఉన్న ఆ పదిమంది మనుషులు లేచి ఖడ్గంతో షాఫాను మనుమడూ అహీకాం కొడుకు అయిన గెదల్యాను కొట్టారు బబులోను రాజు దేశంమీద అధిపతిగా నియమించిన ఆ గెదల్యాను చంపారు. 3 అంతేగాక, మిస్పాలో గెదల్యాదగ్గర ఉన్న యూదులందరినీ, అక్కడ కనిపించిన కల్దీయ సైనికులను కూడా ఇష్మాయేల్ హతమార్చాడు.4 అతడు గెదల్యాను చంపిన సంగతి ఎవరికీ తెలియదు. మరుసటి రోజే ఇలా జరిగింది: 5 ఎనభైమంది మనుషులు గడ్డం గీక్కొని బట్టలు చింపుకొని శరీరాన్ని కోసుకొని షెకెం, షిలోహు, షోమ్రోను పట్టణాల నుంచి వచ్చారు. యెహోవా ఆలయానికి నైవేద్యాలను, ధూపద్రవ్యాన్ని తీసుకువస్తూ ఉన్నారు. 6 వారిని కలుసుకోవడానికి నెతన్యా కొడుకు ఇష్మాయేల్ మిస్పానుంచి బయలుదేరి నడుస్తూ ఏడుస్తూ వెళ్ళాడు. వారిని కలుసుకొని “అహీకాం కొడుకు గెదల్యాదగ్గరికి రండి” అని వారితో చెప్పాడు.
7 వారు పట్టణంలోకి వచ్చాక, నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అతడితో కూడా ఉన్న మనుషులు వారిని చంపి, ఒక గోతిలో పడవేశారు. 8 అయితే వారిలో పదిమంది ఇష్మాయేల్‌తో “మమ్మల్ని చంపవద్దు. మాకు పొలంలో దాచిపెట్టిన గోధుమలు, యవలు, నూనె, తేనె ఉన్నాయి” అన్నారు. గనుక అతడు వారిని వారి తోడివాళ్ళతోపాటు చంపక మానుకొన్నాడు.
9 ఇష్మాయేల్ గెదల్యాను చంపినప్పుడు అతనితోకూడా హతం చేసిన మనుషుల మృతదేహాలను పడవేసిన గోతిని త్రవ్వించినది ఆసారాజు. ఒకప్పుడు ఇస్రాయేల్ రాజు బయెషాను ఎదుర్కొంటూ ఉంటే ఆసారాజు దానిని త్రవ్వించాడు. నెతన్యా కొడుకు ఇష్మాయేల్ దానిని మృతదేహాలతో నింపాడు. 10 ఆ తరువాత ఇష్మాయేల్ మిస్పాలో ఉన్న మిగతావారందరినీ చెరపట్టాడు కావలివాళ్ళ అధిపతి నెబుజరదాన్ అహీకాం కొడుకు గెదల్యాకు అప్పగించిన ప్రజలందరితోపాటు రాజు కుమార్తెలను చెరపట్టాడు. నెతన్యా కొడుకు ఇష్మాయేల్ వారిని చెరపట్టి అమ్మోను దేశస్థులదగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు.
11 నెతన్యా కొడుకు ఇష్మాయేల్ చేసిన దుర్మార్గమంతటి విషయం కారేహ కొడుకు యోహానాను, అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులు విన్నారు. 12 వెంటనే వారు తమ మనుషులందరినీ తీసుకొని, నెతన్యా కొడుకు ఇష్మాయేల్‌తో యుద్ధం చేయడానికి తరలివెళ్ళారు. గిబియోనులో ఉన్న పెద్ద చెరువుదగ్గర అతడు వారికి దొరికాడు. 13 కారేహ కొడుకు యోహానానునూ అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులనూ చూచి ఇష్మాయేల్‌తో ఉన్నవారంతా సంతోషించారు. 14 మిస్పాలో ఇష్మాయేల్ చెరపట్టినవారంతా అతణ్ణి విడిచి, కారేహ కొడుకు యోహానానుదగ్గరికి చేరారు. 15 అయితే నెతన్యా కొడుకు ఇష్మాయేల్ తన మనుషులలో ఎనిమిదిమంది యోహానాను దగ్గరనుంచి తప్పించుకొని అమ్మోనువాళ్ళ దగ్గరికి పారిపోయారు.
16 ✽నెతన్యా కొడుకు ఇష్మాయేల్ అహీకాం కొడుకు గెదల్యాను హతం చేసిన తరువాత, ఇష్మాయేల్ దగ్గర ఉన్న మిగతా మిస్పావారందరినీ సైనికులను, స్త్రీలను, పిల్లలను, రాజపరివారాన్ని గిబియోనునుంచి కారేహ కొడుకు యోహానాను అతడితోకూడా ఉన్న సైన్యాధిపతులందరూ మళ్ళీ తీసుకువచ్చారు. 17 అక్కడనుంచి వారందరూ ప్రయాణమై బేత్‌లెహేందగ్గర ఉన్న గెరూత్‌కింహాంలో దిగారు. 18 బబులోను రాజు దేశంమీద అధికారిగా నియమించిన అహీకాం కొడుకైన గెదల్యాను నెతన్యా కొడుకు ఇష్మాయేల్ చంపినందుచేత వారు కల్దీయవాళ్ళకు భయపడ్డారు, గనుక ఈజిప్ట్‌కు వెళ్ళిపోదామను కొన్నారు.