40
1 కావలివాళ్ళ అధిపతి నెబుజరదాన్ జెరుసలం నుంచి, యూదానుంచి బబులోనుకు బందీలుగా వెళ్ళిపోయే వాళ్ళందరిలో సంకెళ్ళతో కట్టి ఉన్న యిర్మీయాను చూచి విడుదల చేశాడు. అది రమాలో జరిగింది. ఆ తరువాత యెహోవానుంచి యిర్మీయాకు వాక్కు వచ్చింది. 2 ✽కావలివాళ్ళ అధిపతి యిర్మీయాను చూచి ఇలా అన్నాడు: “ఈ స్థలంమీదికి ఈ విపత్తు రావాలని నీ దేవుడు యెహోవా నిర్ణయించాడు. 3 యెహోవా తాను చెప్పినట్టే చేసి ఈ విపత్తు రప్పించాడు. మీరు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి, ఆయన మాట వినకుండా ఉన్నారు. గనుకనే ఇదంతా జరిగింది. 4 ఇదిగో, ఈవేళ నీ చేతులకు ఉన్న సంకెళ్ళను తీసివేసి నిన్ను విడుదల చేస్తున్నాను. నాతోపాటు బబులోనుకు రావడం మంచిదని నీకు తోస్తే రావచ్చు. నేను నిన్ను కాపాడుతాను. నాతోపాటు బబులోనుకు రావడం మంచిది కాదని తోస్తే రావద్దు. ఈ దేశమంతా నీముందే ఉంది. నీవు ఏ స్థలం మంచిది, సరైనది అనుకొంటే అక్కడికి వెళ్ళవచ్చు.”5 వెళ్ళడానికి యిర్మీయా తటపటాయిస్తూ ఉంటే నెబుజరదాన్ “బబులోనురాజు షాఫాను మనుమడూ అహీకాం కొడుకూ అయిన గెదల్యాను యూదా పట్టణాలమీద అధికారిగా నియమించాడు. అతడిదగ్గరికి వెళ్ళి అతడితో ఉంటూ ప్రజలమధ్య నివాసం చెయ్యి. లేకపోతే ఎక్కడికి వెళ్ళడం సరి అని నీవనుకొంటే అక్కడికి వెళ్ళు.” అప్పుడు కావలివాళ్ళ అధిపతి అతనికి భోజనపదార్థాలు, కానుక ఇచ్చి అతణ్ణి వెళ్ళనిచ్చాడు. 6 యిర్మీయా మిస్పాలో ఉన్న అహీకాం కొడుకు గెదల్యా దగ్గరికి వెళ్ళాడు. దేశంలో మిగిలిన ప్రజలమధ్య అతడిదగ్గర ఉండిపోయాడు.
7 ✽బబులోను రాజు దేశంమీద, అంటే బందీలుగా బబులోనుకు వెళ్ళక దేశంలో ఉండిపోయిన నిరుపేద పురుషులు, స్త్రీలు, పిల్లలమీద అహీకాం కొడుకైన గెదల్యాను అధికారిగా నియమించాడు. ఈ సంగతి పల్లెటూళ్ళ ప్రదేశాలలో ఉన్న యూదా సైన్యాధిపతులందరూ వాళ్ళ మనుషులూ విన్నారు. 8 అప్పుడు ఆ అధిపతులు, వాళ్ళ మనుషులు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. వాళ్ళెవరంటే, నెతన్యా కొడుకు ఇష్మాయేల్, కారేహ కొడుకులు యోహానాను, యోనాతాను, తన్‌హుమెతు కొడుకు శెరాయా, నెటోపా గ్రామంవాడు ఏపయి కొడుకులు, మాయకా ప్రాంతంవాడొకడి కొడుకు యెజన్యా. 9 వాళ్ళతో, వాళ్ళ మనుషులతో షాఫాను మనుమడూ, అహీకాం కొడుకూ అయిన గెదల్యా ప్రమాణపూర్వకంగా ఇలా చెప్పాడు: “కల్దీయవాళ్ళకు సేవ చేయడానికి భయపడవద్దు. దేశంలో ఉంటూ బబులోను రాజుకు సేవ చెయ్యండి. అప్పుడు మీకు మేలు చేకూరుతుంది. 10 నేను మిస్పాలో నివాసం చేస్తాను, మనదగ్గరికి వచ్చే కల్దీయవాళ్ళ ఎదుట మీ పక్షంగా ఉంటాను. మీరైతే ద్రాక్షరసం, నూనె, వేసవికాల ఫలాలు పోగు చేసుకొని, మీ పాత్రల్లో నిలువ చేసుకొని, మీరు స్వాధీనం చేసుకొన్న పట్టణాలలో ఉండండి.”
11 ఆ కాలంలో మోయాబు, అమ్మోను, ఎదోం దేశాలలో, ఇతర దేశాలలో కొంతమంది యూదులు ఉన్నారు. బబులోను రాజు యూదాలో తాను ఉండిపోనిచ్చిన వారిమీద షాఫాను మనుమడూ అహీకాం కొడుకూ అయిన గెదల్యాను అధికారిగా నియమించిన సంగతి ఆ యూదులు విన్నారు. 12 అప్పుడు వారంతా తాము చెదరిపోయిన అన్ని స్థలాలనుంచి యూదాదేశానికి, మిస్పాలో ఉన్న గెదల్యాదగ్గరికి వచ్చారు. వారు ద్రాక్షరసం, వేసవికాలం పండ్లు సమృద్ధిగా పోగు చేసుకొన్నారు.
13 తరువాత కారేహ కొడుకు యోహానాను, పల్లెసీమలో ఉన్న సైన్యాధిపతులు మిస్పాలో ఉన్న గెదల్యాదగ్గరికి వచ్చి ఇలా చెప్పారు: 14 “నీ ప్రాణం తీయడానికి అమ్మోనువాళ్ళ రాజైన బయలీసు నెతన్యా కొడుకైన ఇష్మాయేల్‌ను పంపాడు. నీకు తెలుసా?” అయితే అహీకాం కొడుకు గెదల్యా వారిని నమ్మలేదు.
15 మిస్పాలో కారేహ కొడుకు యోహానాను గెదల్యాతో రహస్యంగా మాట్లాడాడు. “అతడు నిన్ను ఎందుకు చంపాలి? నీ చుట్టు సమకూడిన యూదులంతా చెదరిపోవడానికీ యూదాలో మిగతావారు నశించడానికీ అతడు ఎందుకు కారణం కావాలి? నెతన్యా కొడుకు ఇష్మాయేల్‌ను చంపడానికి నన్ను వెళ్ళనియ్యి. అది ఎవరికీ తెలియకుండా ఉంటుంది” అన్నాడు.
16 ✽అయితే అహీకాం కొడుకు గెదల్యా కారేహ కొడుకు యోహానానుతో “నీవు ఇష్మాయేల్‌ను గురించి అబద్ధంగా మాట్లాడుతున్నావు. ఆ పని నీవు చేయకూడదు” అన్నాడు.