39
1 ✽ యూదా రాజు సిద్కియా పరిపాలించిన తొమ్మిదో సంవత్సరం, పదో నెలలో బబులోను రాజు నెబుకద్‌నెజరు తన సైన్యమంతటితో వచ్చి జెరుసలంను ముట్టడి వేశాడు. 2 సిద్కియా పరిపాలనలో పదకొండో సంవత్సరం, నాలుగోనెల, తొమ్మిదోరోజున నగర ప్రాకారానికి రంధ్రం చేసి జెరుసలంను పట్టుకొన్నారు. 3 అప్పుడు బబులోను రాజు అధికారులందరూ – నేర్గల్‌షరేజరు, సమర్‌నెబో, అధికారులలో ప్రముఖుడు శర్‌సెకీం, ప్రధానుడు నేర్గల్‌షరేజరు, ఇతర అధికారులందరూ నగరంలోపలికి వచ్చి “మధ్య ద్వారం”లో కూర్చున్నారు. 4 యూదా రాజు సిద్కియా, సైనికులంతా వాళ్ళను చూచి పారిపోయారు. వారు నగరంనుంచి రాత్రివేళ బయలుదేరి, రాజు తోటగుండా రెండు గోడలమధ్య ఉన్న గుమ్మంద్వారా వెళ్ళారు. రాజు అరాబా లోయవైపు వెళ్ళాడు.5 అయితే కల్దీయవాళ్ళ సైన్యం వారిని తరిమి, యెరికో మైదానాల్లో సిద్కియాను పట్టుకొన్నారు. అప్పుడు బబులోను రాజు నెబుకద్‌నెజరు హమాతు ప్రదేశంలో రిబ్లాలో ఉన్నాడు. వాళ్ళు సిద్కియాను అక్కడికి తీసుకుపోయారు. నెబుకద్‌నెజరు అతడికి శిక్ష విధించాడు. 6 రిబ్లాలోనే బబులోను రాజు సిద్కియా కొడుకులను అతడి కండ్లముందే హతం చేశాడు. బబులోను రాజు యూదా గొప్ప వంశస్థులందరినీ హతమార్చాడు. 7 అప్పుడతడు సిద్కియా కండ్లు ఊడబెరికించాడు. అతణ్ణి బబులోనుకు తీసుకుపోవడానికి కంచు సంకెళ్ళతో బంధించాడు.
8 కల్దీయవాళ్ళు రాజు నగరునూ, ప్రజల ఇండ్లనూ తగలబెట్టారు. జెరుసలం ప్రాకారాలను పడగొట్టారు. 9 కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్ నగరంలో మిగిలినవాళ్ళనూ, నగరం విడిచి తనదగ్గరికి చేరినవాళ్ళనూ, మిగతా ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు పోయాడు. 10 కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్ ఏమీ ఆస్తిలేని దరిద్రులను కొంతమందిని యూదాదేశంలో ఉండనిచ్చాడు, వారికి పొలాలు, ద్రాక్షతోటలు ఇచ్చాడు.
11 ✽బబులోను రాజైన నెబుకద్‌నెజరు కావలివాళ్ళకు అధిపతి నెబుజరదాన్‌కు యిర్మీయాను గురించి ఈ ఆజ్ఞ ఇచ్చాడు: 12 “అతణ్ణి తీసుకొని కాపాడు. అతడికి ఏమీ హాని చేయకు. అతడు నీతో చెప్పినట్టే అతడికోసం చెయ్యి.”
13 అందుచేత కావలివాళ్ళ అధిపతి నెబుజరదాన్, అధికారులలో ఒక ప్రముఖుడు నెబుషజబాన్, ప్రధానుడు నెర్గల్‌షరేజరు, బబులోను రాజు ప్రధాన అధికారులందరూ మనుషులను పంపి, 14 కాపలావాళ్ళ ఆవరణంలోనుంచి యిర్మీయాను తెప్పించారు. అతణ్ణి ఇంటికి తీసుకుపోవడానికి షాఫాను మనుమడూ, అహీకాం కొడుకూ అయిన గెదల్యాకు అప్పగించారు. యిర్మీయా తన ప్రజలమధ్య ఉండిపోయాడు.
15 ✽యిర్మీయా ఇంకా కాపలావాళ్ళ ఆవరణంలో ఉన్నప్పుడు యెహోవానుంచి వాక్కు అతడికి వచ్చింది. 16 అదేమిటంటే, “వెళ్ళి కూషువాడైన ఎబెద్‌మెలెకుతో ఇలా చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరాన్ని గురించి నేను చెప్పిన మాటలను కీడుకే నెరవేరుస్తాను గాని, మంచికి కాదు. అవి ఆ రోజు నీ కళ్ళముందే నెరవేరుతాయి. 17 అయితే ఆ రోజున నేను నిన్ను విడిపిస్తాను – నీవు భయపడుతున్నవాళ్ళ చేతిలో చిక్కుపడవు. ఇది యెహోవా వాక్కు. 18 నీవు నన్ను నమ్ముకొన్నావు, గనుక నేను నిన్ను తప్పక కాపాడుతాను. నీవు ఖడ్గానికి కూలవు. దోపిడీసొమ్ములాగా నీ ప్రాణం దక్కుతుంది. ఇది యెహోవా వాక్కు.”