38
1 యిర్మీయా ప్రజలందరికీ ఇలా చెప్పాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరంలో ఉండిపోయేవారు ఖడ్గానికీ కరవుకూ ఘోరమైన అంటురోగానికి గురి అయి చస్తారు. కాని, కల్దీయవాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు బ్రతుకుతారు. దోపిడీసొమ్ములాగా వారి ప్రాణం దక్కించుకొని బ్రతుకుతారు. 2 యెహోవా చెప్పేదేమిటంటే, ఈ నగరాన్ని తప్పనిసరిగా బబులోను రాజు సైన్యానికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు దానిని వశం చేసుకొంటారు.”
3 ఈ మాటలను మత్తాను కొడుకు షెఫట్య, పషూరు కొడుకు గెదల్యా, షెలెమా కొడుకు యూకల్, మల్కీయా కొడుకు పషూరు విన్నారు. 4 అప్పుడు ఆ అధికారులు రాజుతో ఇలా చెప్పారు: “ఆ మనిషికి మరణశిక్ష వేయండి. అలాంటి మాటలు చెప్పి నగరంలో ఉన్న సైనికులనూ ప్రజలందరినీ నిరుత్సాహపరుస్తున్నాడు. అతడు ఈ ప్రజల క్షేమం కోరడం లేదు గాని, కీడునే కోరుతున్నాడు.” 5 అందుకు సిద్కియారాజు “ఇదిగో, అతడు మీ వశంలో ఉన్నాడు. మీకు వ్యతిరేకంగా రాజు ఏమీ చేయలేడు” అని జవాబిచ్చాడు.
6 అప్పుడు వాళ్ళు యిర్మీయాను పట్టుకొని రాజ వంశీకుడైన మల్కీయా బావిలోకి దించారు. ఆ బావి కావలివాళ్ళ ఆవరణంలో ఉంది. వాళ్ళు యిర్మీయాను త్రాళ్ళతో దాని లోపలికి దించారు. దానిలో నీళ్ళు లేవు. బురద మాత్రమే ఉంది. ఆ బురదలో యిర్మీయా కూరుకుపోయాడు.
7 రాజు నగరులో ఎబెద్‌మెలెకు అనే నపుంసకుడు ఉండేవాడు. అతడు కూషు దేశంవాడు. వాళ్ళు యిర్మీయాను బావిలో ఉంచిన సంగతి అతడికి వినవచ్చింది. అప్పుడు రాజు “బెన్యామీను ద్వారం”లో కూర్చుని ఉన్నాడు. 8 ఎబెద్‌మెలెకు రాజు నగరు బయటికి వెళ్ళి రాజుతో ఇలా చెప్పాడు: 9 “నా యజమానీ, రాజా, ఆ మనుషులు యిర్మీయాప్రవక్తను బావిలో వేశారు. వాళ్ళు ఆయనపట్ల చేసినదంతా అన్యాయం. నగరంలో రొట్టెలు మిగలలేదు, గనుక ఆయన అక్కడే చనిపోతాడు.”
10 అప్పుడు రాజు కూషువాడైన ఎబెద్‌మెలెకుకు “ఇక్కడనుంచి నీతో ముప్ఫయిమంది మనుషులను తీసుకువెళ్ళు. యిర్మీయాప్రవక్త చావకముందే అతణ్ణి బావిలోనుంచి తీయి” అని ఆజ్ఞాపించాడు.
11 అలాగే ఎబెద్‌మెలెకు ఆ మనుషులను తీసుకొని రాజు నగరులో ఖజానా క్రింద ఉన్న గదికి వెళ్ళాడు. అక్కడనుంచి పాత పేలికలు, చింపిరి గుడ్డలు తీసుకువెళ్ళి వాటిని బావిలో ఉన్న యిర్మీయాదగ్గరికి త్రాళ్ళతో దించాడు. 12 కూషువాడు ఎబెద్‌మెలెకు యిర్మీయాతో “ఈ పాత పేలికలు, గుడ్డలు నీ చంకలకు త్రాళ్ళకు మధ్య ఉంచుకో” అన్నాడు. యిర్మీయా అలా చేశాక 13 వారు త్రాళ్ళతో యిర్మీయాను బావినుంచి చేది బయటికి తీశారు. ఆ తరువాత యిర్మీయా ఆ కాపలావాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.
14 సిద్కియారాజు యిర్మీయాప్రవక్త కోసం మనిషిని పంపాడు. అతడు యిర్మీయాను యెహోవా ఆలయం మూడో ద్వారందగ్గరికి తీసుకువచ్చాడు. రాజు యిర్మీయాతో “నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. నానుంచి ఏదీ దాచవద్దు” అన్నాడు.
15 అందుకు యిర్మీయా “నేను నీకు జవాబిస్తే ఆ సంగతి చెపితే మీరు నన్ను తప్పకుండా చంపిస్తారు గదా, నేను మీకు ఆలోచన చెప్పినా వినరు” అని సిద్కియాతో చెప్పాడు.
16 అయితే సిద్కియారాజు “మనకు ప్రాణం పోసిన యెహోవామీద ఒట్టుపెట్టి చెపుతున్నాను – నేను నిన్ను చంపను, నీ ప్రాణం తీయాలని చూచేవాళ్ళ చేతికి అప్పగించను” అని యిర్మీయాతో శపథం చేశాడు.
17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీరు బబులోను రాజు అధిపతులదగ్గరికి వెళ్ళి వాళ్ళకు లోబడితే మీ ప్రాణం దక్కుతుంది. వాళ్ళు ఈ నగరాన్ని మంటలతో తగలబెట్టరు. మీరు, మీవారు బ్రతుకుతారు. 18 ఒకవేళ మీరు వెళ్ళి బబులోను రాజు అధిపతులకు లోబడకపోతే, ఈ నగరం వాళ్ళ వశం అవుతుంది. వాళ్ళు దానిని మంటలతో తగలబెడతారు. మీరు కూడా వాళ్ళ చేతినుంచి తప్పించుకోలేకపోతారు.”
19  యిర్మీయాతో సిద్కియారాజు “వెళ్ళి కల్దీయవాళ్ళతో చేరిన యూదులంటే నాకు భయం. ఒకవేళ కల్దీయవాళ్ళు నన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తే వాళ్ళు నన్ను బాధిస్తారు” అన్నాడు.
20 “వాళ్ళు అలా అప్పగించర”ని యిర్మీయా జవాబిచ్చాడు, “నేను మీకు చెప్పేది విని, యెహోవా వాక్కుకు లోబడండి. అప్పుడు మీకు మేలు జరుగుతుంది. మీ ప్రాణం దక్కుతుంది. 21 ఒకవేళ మీరు వాళ్ళదగ్గరికి వెళ్ళడానికి తిరస్కరిస్తే, యెహోవా నాకు తెలియజేసిన సంగతి జరుగుతుంది. 22 అదేమిటంటే, యూదా రాజు నగరులో మిగిలి ఉండే స్త్రీలందరినీ బబులోను రాజు అధిపతుల దగ్గరికి తీసుకుపోతారు. ఆ స్త్రీలు మీతో ఇలా అంటారు:
‘మీరు నమ్ముకొన్న మిత్రులు నిన్ను మోసపుచ్చి గెలిచారు.
మీ కాళ్ళు బురదలో దిగబడ్డాయి.
వాళ్ళు మీదగ్గరనుంచి మళ్ళుకొని వెళ్ళారు.’
23 మీ భార్యలందరినీ, సంతతివాళ్ళందరినీ కల్దీయవాళ్ళ దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. మీరు కూడా వాళ్ళ చేతినుంచి తప్పించుకోరు. బబులోను రాజు మిమ్ములను పట్టుకొంటాడు, ఈ నగరాన్ని మంటలు అంటించి కాల్చివేస్తాడు.”
24 అప్పుడు సిద్కియా యిర్మీయాతో ఇలా అన్నాడు: “నీవు చావకుండా ఉండాలంటే ఈ సంభాషణ గురించి ఎవరికీ తెలియజేయకు సుమా. 25 ఒకవేళ నేను నీతో మాట్లాడిన సంగతి విని అధికారులు నీదగ్గరికి రావచ్చు. నీతో ఇలా అనవచ్చు: ‘రాజుతో నీవు చెప్పినదీ, రాజు నీతో చెప్పినదీ మాకు తెలియజేయి. మానుంచి ఏదీ దాచవద్దు. లేకపోతే మేము నిన్ను చంపివేస్తాం.’ 26 అలాంటప్పుడు నీవు వాళ్ళతో ‘నేను చావకుండా మళ్ళీ నన్ను యోనాతాను ఇంటికి పంపవద్దని రాజును ప్రాధేయపడ్డాను’ అని చెప్పాలి.”
27 తరువాత అధికారులంతా యిర్మీయా దగ్గరికి వచ్చి అతణ్ణి ప్రశ్నించారు. ఇలా చెప్పాలని రాజు ఆదేశించినదంతా అతడు వాళ్ళతో చెప్పాడు. వాళ్ళకు ఆ సంభాషణ తెలియనందుకు వాళ్ళు అతనితో ఇంకేమీ చెప్పలేదు. 28 జెరుసలంను పట్టుకోవడం జరిగే రోజువరకు యిర్మీయా కాపలావాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.