37
1 బబులోను రాజు నెబుకద్‌నెజరు యూదాదేశానికి యోషీయా కొడుకు సిద్కియాను రాజుగా చేశాడు. అతడు యెహోయాకీం కొడుకైన కొన్యాకు మారుగా పరిపాలన చేశాడు. 2 అయితే యెహోవా యిర్మీయా ప్రవక్తచేత పలికించిన మాటలను అతడు గానీ అతడి పరివారం గానీ ప్రజలు గానీ పాటించలేదు. 3 అయినా సిద్కియారాజు, “మా కోసం మన దేవుడు యెహోవాకు ప్రార్థన చేయండి” అని యిర్మీయాప్రవక్త దగ్గరికి షెలెమ్యా కొడుకు యెహుకల్‌నూ మయశేయా కొడుకు జెఫన్యాయాజినీ పంపాడు.
4 యిర్మీయాను ఖైదులో ఉంచడం ఇంకా జరగలేదు. అతడు ప్రజలమధ్యకు వస్తూ పోతూ ఉన్నాడు. 5 అంతలో ఫరో సైన్యం ఈజిప్ట్‌నుంచి బయలుదేరింది. జెరుసలంను ముట్టడివేస్తూ ఉన్న కల్దీయవాళ్ళు అది విని జెరుసలంనుంచి వెళ్ళారు. 6 అప్పుడు యెహోవానుంచి వాక్కు యిర్మీయా ప్రవక్తకు వచ్చింది:
7 “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నా దగ్గర విచారణ చేయాలని నిన్ను పంపిన యూదా రాజుకు నీవు ఇలా చెప్పు: నీకు సహాయం చేయడానికి బయలుదేరిన ఫరో సైన్యం దాని సొంత దేశమైన ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళిపోతుంది. 8 కల్దీయవాళ్ళు మళ్ళీ వచ్చి ఈ నగరంమీద యుద్ధం చేస్తారు. దీనిని వశం చేసుకొని మంటలతో కాల్చివేస్తారు. 9 యెహోవా చెప్పేదేమిటంటే, మిమ్మల్ని మీరు మోసం చేసుకొంటూ ‘కల్దీయవాళ్ళు మనదగ్గరనుంచి దూరంగా వెళ్ళిపోతారు’ అనవద్దు. వాళ్ళు అలా చేయరు. 10 ఒకవేళ మీమీద యుద్ధం చేసే కల్దీయవాళ్ళ సైన్యమంతటినీ మీరు గెలిచినా, వాళ్ళ డేరాలలో గాయపడ్డవాళ్ళు మాత్రమే మిగిలినా, వాళ్ళు డేరాలనుంచి వచ్చి ఈ నగరాన్ని మంటలు అంటించి కాల్చివేస్తారు.”
11 ఫరో సైన్యం రావడం కారణంగా కల్దీయవాళ్ళ సైన్యం వెళ్ళాక, 12 యిర్మీయా జెరుసలంనుంచి బెన్యామీను ప్రదేశానికి బయలుదేరాడు. అక్కడ తనవారిదగ్గర తన భాగం తీసుకొందాం అనుకొన్నాడు. 13 అతడు “బెన్యామీను ద్వారం” దగ్గరికి చేరినప్పుడు కాపలావాళ్ళ అధిపతి అక్కడ ఉన్నాడు. అతడి పేరు ఇరీయా. అతడు షెలమ్యా కొడుకు, హనన్యా మనుమడు. అతడు యిర్మీయాప్రవక్తను పట్టుకొని “నువ్వు కల్దీయవాళ్ళతో చేరబోతున్నావు” అన్నాడు.
14 అందుకు యిర్మీయా “అది నిజం కాదు. నేను కల్దీయవాళ్ళతో చేరబోవడం లేదు” అన్నాడు. అయితే ఇరీయా అతడి మాట నమ్మలేదు. యిర్మీయాను పట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకుపోయాడు. 15 వాళ్ళు యిర్మీయామీద కోపపడి, అతణ్ణి తాము ఖైదుగా మార్చిన యోనాతాను ఇంటిలో వేయించారు. ఇతడు లేఖకుడు. 16 యిర్మీయా ఖైదు గదిలో చేరి, అక్కడ చాలా రోజులు ఉన్నాడు.
17 తరువాత సిద్కియారాజు మనుషులను పంపి రాజు నగరుకు అతణ్ణి రప్పించాడు. “యెహోవానుంచి ఏదైనా వాక్కు ఉందా?” అని అతణ్ణి రహస్యంగా అడిగాడు.
అందుకు యిర్మీయా “ఉంది, మిమ్ములను బబులోను రాజు చేతికి అప్పగించడం జరుగుతుంది” అన్నాడు. 18  యిర్మీయా సిద్కియారాజుతో ఇంకా అన్నాడు, “మీరు నన్ను ఖైదులో వేశారు. అయితే నేను మీకు గానీ, మీ పరివారానికి గానీ ఈ ప్రజలకు గానీ వ్యతిరేకంగా ఏం తప్పు చేశాను? 19 ‘మీమీదికి, ఈ దేశంమీదికి బబులోను రాజు రాడని మీ ప్రవక్తలు ప్రకటించారు గదా. వాళ్ళెక్కడ ఉన్నారు? 20 నా యజమానీ, రాజా, ఇప్పుడు దయతో వినండి. నా మనవి అంగీకరించండి. నేను లేఖకుడైన యోనాతాను ఇంట్లో చస్తానేమో. నన్ను అక్కడికి పంపించవద్దు.”
21 అందుచేత సిద్కియారాజు యిర్మీయాను కాపలావాళ్ళ ఆవరణంలో ఉంచాలనీ, నగరంలో రొట్టెలన్నీ అయిపోయేంత వరకూ రొట్టెలు కాల్చేవాళ్ళ వీధిలోనుంచి ప్రతిరోజూ రొట్టెను తెచ్చి అతడికి ఇవ్వాలనీ ఆదేశించాడు. యిర్మీయా కావలివాళ్ళ ఆవరణంలో ఉండిపోయాడు.