36
1 యూదారాజు యోషీయా కొడుకు యెహోయాకీం పరిపాలించిన నాలుగో సంవత్సరంలో యెహోవా నుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2 ✝“యోషీయా రోజుల్లో నుంచి ఈరోజువరకు నేను ఇస్రాయేల్ ప్రజ విషయం, యూదా ప్రజ విషయం, ఇతర జనాల విషయం నీతో మాట్లాడాను. నీవు చుట్టిన కాగితం తీసుకొని, ఆ మొదటి రోజునుంచి ఈ రోజువరకు నేను చెప్పిన మాటలన్నీ వ్రాయి. 3 ✽ నేను వారిమీదికి రప్పించాలనుకొన్న విపత్తు అంతటి విషయం యూదా ప్రజ విని ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవనుంచి మళ్ళితే నేను వారి అపరాధాన్నీ పాపాన్నీ క్షమిస్తాను.”4 అప్పుడు యిర్మీయా నేరీయా కొడుకైన బారూకును పిలిపించాడు. యెహోవా తనతో పలికిన మాటలన్నీ యిర్మీయా చెప్పి బారూకు✽చేత ఆ చుట్టిన కాగితంలో వ్రాయించాడు. 5 ✽తరువాత యిర్మీయా బారూకును ఇలా ఆదేశించాడు: “యెహోవా ఆలయానికి వెళ్ళడానికి నాకు స్వేచ్ఛ లేదు. 6 ✽గనుక నీవు వెళ్ళి, ఈ చుట్టిన కాగితంలో నీచేత నేను వ్రాయించిన యెహోవా మాటలను ప్రజలకు చదివి వినిపించు. ఉపవాస దినాన నీవు వెళ్ళాలి. యూదా పట్టణాలనుంచి వచ్చే ప్రజలందరికీ ఈ మాటలు వినిపించు. 7 ఒకవేళ వాళ్ళ విన్నపం యెహోవా సన్నిధానానికి చేరవచ్చు. ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళవచ్చునేమో. నిజంగా ఈ ప్రజకు వ్యతిరేకంగా యెహోవా ప్రకటించిన కోపం, ఆగ్రహం ఇంతంత కాదు.”
8 యిర్మీయా తనను ఆదేశించినట్టెల్లా నేరీయా కొడుకు బారూకు చేశాడు. యెహోవా ఆలయంలో చుట్టిన కాగితం చేతపట్టుకొని యెహోవా వాక్కులు చదివి వినిపించాడు. 9 ✽ యూదా రాజూ, యోషీయా కొడుకూ అయిన యెహోయాకీం పరిపాలించిన అయిదో సంవత్సరం, తొమ్మిదో నెలలో జెరుసలం ప్రజలందరికీ, యూదా పట్టణాలనుంచి జెరుసలంకు వచ్చిన ప్రజలందరికీ యెహోవా ఎదుట ఉపవాసం ఉండాలని ప్రకటించడం జరిగింది. 10 అప్పుడు బారూకు చుట్టిన కాగితంలో ఉన్న యిర్మీయా మాటలు యెహోవా ఆలయంలో ప్రజలందరికీ వినిపించాడు. లేఖకుడైన షాఫాను కొడుకు గెమర్యా గదిలో చదివాడు. ఆ గది యెహోవా ఆలయంలో ఉన్న “క్రొత్త ద్వారం” దగ్గర ఉన్న “మీది ఆవరణం”లో ఉంది.
11 షాఫాను మనుమడూ గెమర్యా కొడుకూ అయిన మీకాయా చుట్టిన కాగితంలోని యెహోవా వాక్కులన్నీ విన్నాడు. 12 వెంటనే అతడు రాజు నగరులో ఉన్న లేఖకుడి గదికి వెళ్ళాడు. అక్కడ అధికారులందరూ కూర్చుని ఉన్నారు. లేఖకుడు ఎలీషామా, షెమాయా కొడుకు దెలాయ్యా, అక్బోరు కొడుకు ఎల్‌నాతాను, షాఫాను కొడుకు గెమర్యా, హనన్యా కొడుకు సిద్కియా, ఇతర అధికారులందరూ ఉన్నారు. 13 బారూకు చుట్టిన కాగితం చేతపట్టుకొని ప్రజలకు చదువుతూ ఉంటే తాను విన్న వాక్కులన్నీ మీకాయా ఆ అధికారులతో చెప్పాడు.
14 అధికారులంతా “ప్రజలకు చదివి వినిపించిన ఆ చుట్టిన కాగితం చేతపట్టుకొని రా” అని బారూకుతో చెప్పాలని కూషీ కొడుకైన షెలెమ్యా కొడుకైన నెతన్యా కొడుకు యెహూదిని బారూకు దగ్గరకి పంపారు. గనుక నేరీయా కొడుకు బారూకు ఆ చుట్టిన కాగితం చేతపట్టుకొని వాళ్ళదగ్గరికి వచ్చాడు. 15 “కూర్చుని, మాకు దానిని చదువు” అని వాళ్ళు బారూకుతో అన్నారు. బారూకు దానిని వాళ్ళకు చదివి వినిపించాడు.
16 ✽ఆ మాటలన్నీ విని వాళ్ళు భయంతో ఒకరివైపు ఇంకొకరు చూచుకొన్నారు. బారూకుతో “మేము ఈ మాటలన్నీ రాజుకు చెప్పాలి” అన్నారు. 17 అప్పుడు బారూకును చూచి “ఈ మాటలన్నీ ఎలా వ్రాశావు? ఇవి యిర్మీయా చెపుతూ ఉంటే వ్రాశావా? మాకు చెప్పు” అని అడిగారు.
18 ✽అందుకు బారూకు “ఆయన ఈ మాటలన్నీ చెప్పి, సిరాతో ఈ చుట్టిన కాగితంలో నాచేత వ్రాయించాడు” అని జవాబిచ్చాడు.
19 ✽అప్పుడా అధికారులు బారూకుతో అన్నారు: “వెళ్ళి నీవు, యిర్మీయా దాక్కోండి. మీరు ఎక్కడ ఉన్నదీ ఎవరికీ తెలియనివ్వకండి.”
20 ఆ అధికారులు చుట్టిన కాగితం లేఖకుడు ఎలీషామా గదిలో ఉంచి, దర్బారులో ఉన్న రాజుదగ్గరికి వెళ్ళి, ఆ విషయమంతా రాజుకు తెలియజేశారు. 21 చుట్టిన కాగితం తెమ్మని రాజు యెహూదిని పంపాడు. యెహూది లేఖకుడైన ఎలీషామా గదిలోనుంచి దానిని తెచ్చి రాజుకూ, రాజు ప్రక్కన నిలబడి ఉన్న అధికారులకూ చదివి వినిపించాడు. 22 అది తొమ్మిదో నెల. రాజు చలికాలం భవనంలో కూర్చుని ఉన్నాడు. అతడి ముందు కుంపటిలో నిప్పు మండుతూ ఉంది. 23 ✽యెహూది మూడు, నాలుగు వరుసలను చదవడం ముగించాక రాజు చాకుతో దానిని కోసి, కుంపటిలో ఉన్న నిప్పులోకి విసిరాడు. చుట్టిన కాగితమంతా కుంపటిలో ఉన్న నిప్పుచేత కాలిపోయేవరకు రాజు అలా చేశాడు. 24 ఆ మాటలన్నీ విన్న రాజు గానీ, అతడి పరివారం గానీ ఏమీ భయపడలేదు, తమ బట్టలు చింపుకోలేదు. 25 చుట్టిన కాగితం తగలబెట్టకూడదని ఎల్‌నాతాను, దెలాయ్యా, గెమర్యా రాజును ప్రాధేయపడ్డారు గాని, అతడు వారి మాట వినిపించుకోలేదు. 26 ✽ అంతేగాక, లేఖకుడైన బారూకునూ యిర్మీయాప్రవక్తనూ పట్టుకోమని అతడు రాజవంశంవాడైన యెరహ్మేల్‌నూ, అజ్రీయేల్ కొడుకు శెరాయానూ, అబ్‌దేల్ కొడుకు షెలెమ్యాను ఆదేశించాడు. అయితే యెహోవా వారిని దాచాడు.
27 ✽యిర్మీయా చెప్పి బారూకుచేత వ్రాయించిన మాటలు ఉన్న ఆ చుట్టిన కాగితం రాజు తగలబెట్టిన తరువాత, యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది: 28 “యూదా రాజు యెహోయాకీం ఆ మొదటి చుట్టిన కాగితం తగలబెట్టాడు. మరో చుట్టిన కాగితం తీసుకొని మొదటి కాగితంమీద ఉన్న మాటలన్నీ దానిమీద వ్రాయి. 29 తరువాత నీవు యూదా రాజు యెహోయాకీంకు ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నీవు ఆ చుట్టిన కాగితం తగలబెట్టి, ‘బబులోను రాజు తప్పకుండా వచ్చి ఈ దేశాన్ని నాశనం చేసి ఇక్కడ మనుషులూ, పశువులూ లేకుండా చేస్తాడని ఆ కాగితంమీద ఎందుకు వ్రాశావు?’ అని అడిగావు. 30 అందుచేత యూదా రాజు యెహోయాకీం విషయం యెహోవా ఇలా చెపుతున్నాడు: దావీదు సింహాసనమెక్కడానికి అతడికి ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి మంచులో ఉండడానికి అతడి మృతదేహాన్ని బయట పారవేయడం జరుగుతుంది. 31 నేను అతణ్ణి, అతడి సంతానాన్ని, అతడి పరివారాన్ని వాళ్ళ అపరాధానికి శిక్షిస్తాను. వాళ్ళూ జెరుసలం నగరవాసులూ యూదాప్రజా నా మాట వినలేదు, గనుక వాళ్ళ విషయం నేను చెప్పిన విపత్తు అంతా వాళ్ళమీదికి రప్పిస్తాను.”
32 ✽గనుక యిర్మీయా మరో చుట్టిన కాగితం తీసుకొని నేరీయా కొడుకూ లేఖకుడూ బారూకు చేతికి ఇచ్చాడు. యిర్మీయా చెపుతూ ఉంటే బారూకు దానిమీద వ్రాశాడు. యూదా రాజు యెహోయాకీం తగలబెట్టిన కాగితం చుట్టమీద ఉన్న మాటలన్నీ వ్రాశాడు. అలాంటివే చాలా మాటలు వాటితో చేర్చాడు.