35
1 యూదా రాజూ యోషీయా కొడుకూ అయిన యెహోయాకీం రోజుల్లో యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2 “నీవు రేకాబు వంశం వారిదగ్గరికి వెళ్ళి, వారితో మాట్లాడి, వారిని యెహోవా ఆలయంలో ఉన్న ఒక గదిలోపలికి తీసుకురా. వారికి త్రాగడానికి ద్రాక్షరసం ఇవ్వు.”
3 గనుక నేను యజన్యా మనుమడూ యిర్మీయా కొడుకూ అయిన హబజిన్యానూ అతడి సోదరులనూ అతడి కొడుకులందరినీ – రేకాబు కుటుంబంవారినందరినీ యెహోవా ఆలయానికి తీసుకువచ్చాను. 4 దేవుని మనిషి ఇగ్‌దల్యా కొడుకైన హానాను కొడుకుల గది లోపలికి వారిని తీసుకువచ్చాను. అది అధికారుల గది దగ్గర ఉంది, ద్వారపాలకుడూ షల్లూం కొడుకూ అయిన మయశేయా గదికి పైగా ఉంది. 5 అక్కడ నేను రేకాబువంశంవారి ముందు నిండుగా ఉన్న ద్రాక్షరసం కడవలను, కొన్ని గిన్నెలను ఉంచి “ద్రాక్షరసం త్రాగండి” అన్నాను.
6 అందుకు వారు ఇలా అన్నారు: “మేము ద్రాక్షరసం త్రాగము. ఎందుకంటే, మా పూర్వీకుడైన రేకాబు కొడుకు యెహోనాదాబు మాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ‘మీరు గానీ మీ సంతానం గానీ ఎన్నడూ ద్రాక్షరసం త్రాగకూడదు. 7 అంతేగాక, మీరు ఇండ్లను కట్టుకోకూడదు, విత్తనాలు చల్లకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు. ఇలాంటివి మీకు ఉండకూడదు. మీరు బ్రతికినన్నాళ్ళు డేరాలలోనే కాపురముండాలి. అప్పుడు మీరు పరదేశులుగా ఉంటున్న ఈ దేశంలో చాలా కాలం బ్రతుకుతారు. 8 మా పూర్వీకుడు రేకాబు కొడుకు యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము శిరసావహించాం. మేము గానీ మా భార్యలు గానీ మా కొడుకులు గానీ, కూతుళ్ళు గానీ ఎన్నడూ ద్రాక్షరసం త్రాగలేదు; 9 ఉండడానికి ఇండ్లు కట్టుకోలేదు; ద్రాక్షతోటలూ పొలాలూ చల్లడానికి విత్తనాలూ సంపాదించుకోలేదు. 10 మేము డేరాలలోనే కాపురముంటూ, మా పూర్వీకుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞలన్నీ శిరసావహించి ఆ ప్రకారమే జరిగించాం. 11 కాని, బబులోను రాజు నెబుకద్‌నెజరు దేశంమీదికి వచ్చాడు. అప్పుడు మేము ‘కల్దీయవాళ్ళ సైన్యంనుంచి, సిరియా సైన్యంనుంచి తప్పించుకోవడానికి జెరుసలంకు వెళ్దాం పదండి’ అని చెప్పుకొన్నాం. అందుకే ఇప్పుడు జెరుసలంలో ఉంటున్నాం.”
12 అప్పుడు యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 13 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, వెళ్ళి, యూదావారికి జెరుసలం కాపురస్థులకూ ఇలా చెప్పు: మీరు ఒక పాఠం నేర్చుకొని నా మాటలు వినరా? అని యెహోవా అడుగుతున్నాడు. 14 ద్రాక్షరసం త్రాగకూడదని రేకాబు కొడుకు యెహోనాదాబు తన సంతానానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ వారు పాటించారు. వారి పూర్వీకుడి ఆజ్ఞ శిరసావహించి ఈ రోజువరకు ద్రాక్షరసం త్రాగలేదు. అయితే నేను పొద్దున్నే లేచి మీతో మాట్లాడుతూ వచ్చినా మీరు నా మాట వినలేదు. 15 నేను పొద్దున్నే లేచి నా సేవకులైన ప్రవక్తలందరినీ మీదగ్గరికి పంపిస్తూవచ్చాను. వారిచేత ఇలా మాట్లాడించాను: మీలో ప్రతి ఒక్కరూ తన చెడ్డ త్రోవనుంచి నావైపు తిరగాలి, తన ప్రవర్తనను సరిదిద్దుకోవాలి. ఇతర దేవుళ్ళనూ, దేవతలనూ అనుసరించకూడదు, సేవించకూడదు. అప్పుడు మీ పూర్వీకులకూ మీకూ నేను ఇచ్చిన దేశంలో మీరు ఉండవచ్చు. కాని, మీరు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. 16 రేకాబు కొడుకు యెహోనాదాబు తమకు ఇచ్చిన ఆదేశాన్ని అతడి సంతానం ఆచరించారు గాని, ఈ ప్రజ నా మాట వినలేదు. 17 అందుచేత ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో వినండి! నేను యూదావారికీ జెరుసలంలో ఉంటున్న వారందరికీ వ్యతిరేకంగా చెప్పిన విపత్తు వారిమీదికి రప్పిస్తాను. ఎందుకంటే, నేను వారితో మాట్లాడినా వారు వినలేదు. వారిని పిలిచినా వారు బదులు చెప్పలేదు.”
18 అప్పుడు రేకాబు వంశంవారిని చూచి యిర్మీయా ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీ పూర్వీకుడు యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞలను మీరు శిరసావహించి, అతడి ఆదేశాలన్నీ పాటించారు, అతడు మీకు ఆజ్ఞాపించినట్టెల్లా చేశారు. 19 గనుక ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, రేకాబు కొడుకు యెహోనాదాబు సంతానంలో నా సన్నిధానంలో నిలుచుండేవాడు ఎప్పటికీ ఉంటాడు. ఇది ఖాయం.”