34
1 బబులోనురాజు నెబుకద్‌నెజరు, అతడి సైన్యమంతా, అతడి అధికారంక్రింద ఉన్న రాజ్యాలన్నీ జెరుసలంమీద, జెరుసలం చుట్టూ ఉన్న పట్టణాలన్నిటిమీదా యుద్ధం చేస్తూ ఉంటే, యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 2 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు యూదా రాజైన సిద్కియాదగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు: యెహోవా చెప్పుచున్నాడు, ఇదిగో నేను ఈ నగరాన్ని బబులోను రాజు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానిని మంటలు అంటించి కాల్చివేస్తాడు. 3 అతడి చేతినుంచి నీవు తప్పించుకోవు. తప్పనిసరిగా పట్టబడి అతడి వశం అవుతావు. నీవు బబులోను రాజును కండ్లారా చూచి ముఖాముఖిగా మాట్లాడుతావు, బబులోనుకు వెళ్ళిపోతావు.
4 “అయినా యెహోవా ఇచ్చే వాగ్దానం విను. యూదా రాజు సిద్కియా! నీ విషయం యెహోవా చెప్పేదేమిటంటే, నీవు ఖడ్గంచేత మృతి చెందవు. 5 ప్రశాంతంగానే చనిపోతావు. నీకంటే ముందు ఉన్న నీ పూర్వీకులైన రాజులకోసం ప్రజలు చేసినట్టే నీకోసం కూడా పరిమళ ద్రవ్యాలు కాలుస్తారు. ‘అయ్యో, యజమానీ!’ అంటూ నీ విషయం రోదనం చేస్తారు. ఈ మాట ఇచ్చింది నేనే అని యెహోవా అంటున్నాడు.”
6 అప్పుడు యిర్మీయాప్రవక్త జెరుసలంలో యూదా రాజు సిద్కియాతో ఆ మాటలన్నీ చెప్పాడు. 7 బబులోను రాజు సైన్యం జెరుసలంమీదా యూదా పట్టణాలలో మిగిలిన లాకీష్‌మీదా అజేకామీదా ఇంకా యుద్ధం చేస్తూ ఉంది. యూదాలో ప్రాకారాలూ కోటలూ ఉన్నపట్టణాలలో మిగిలినవి అవే.
8 సిద్కియారాజు జెరుసలంలో ఉన్న ప్రజలందరూ దాస్యంలో ఉన్నవారికి విడుదల ప్రకటించాలని వారితో ఒడంబడిక చేశారు. ఆ తరువాత యెహోవానుంచి యిర్మీయాకు వాక్కు వచ్చింది. 9 ఆ ఒడంబడిక ప్రకారం ఒక్కొక్కరు తమ హీబ్రూ బానిసలను, మగవారినేమీ ఆడవారినేమీ విడిపించాలి; ఎవరూ సాటివారైన యూదులలో ఎవరినీ దాస్యంలో ఉంచకూడదు. 10 ఆ ఒడంబడికలో చేరిన అధికారులందరూ ప్రజలందరూ తమ దాసదాసీజనాన్ని విడిపించడానికి ఒప్పుకొన్నారు. ఇకనుంచి వారితో సేవ చేయించుకోమన్నారు. వారు విధేయులై బానిసలను విడుదల చేశారు. 11 అయితే తరువాత వాళ్ళు మనసు మార్చుకొని, తాము విడుదల చేసిన దాసులనూ దాసీలనూ మళ్ళీ తెచ్చుకొని వారిని దాస్యంలో ఉంచారు.
12 అప్పుడు యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 13 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, దాస్యగృహంలాంటి ఈజిప్ట్‌దేశంనుంచి మీ పూర్వీకులను నేను తీసుకువచ్చినప్పుడు వారితో ఒడంబడిక చేశాను. నేను ఇలా ఆదేశించాను: 14 మీకు సాటి హీబ్రూ వంశంవారెవరైనా అమ్మబడితే, ఏడో సంవత్సరంలో వారిని విడుదల చేయాలి. వారు ఆరు సంవత్సరాలు సేవ చేసినతరువాత వారిని స్వేచ్ఛగా వెళ్ళనివ్వాలి. అయితే మీ పూర్వీకులు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. 15 ఇటీవల మీరు పశ్చాత్తాపపడి నా దృష్టికి ఏది మంచిదో అది చేశారు – ఒక్కొక్కరు సాటివారిని విడుదల చేస్తామని ప్రకటన చేశారు. నా పేరు ఉన్న ఆలయంలో నా ఎదుట ఒడంబడిక చేశారు కూడా. 16 ఇప్పుడైతే మీరు మనసు మార్చుకొని నా పేరును దూషణకు గురి చేశారు. వారి ఇష్టప్రకారం మీరు స్వేచ్ఛగా వెళ్ళనిచ్చిన దాసదాసీ జనాన్ని ఒక్కొక్కరు మళ్ళీ తెప్పించుకొని దాస్యంలో ఉంచారు. 17 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే, తోటి వంశంవారికీ పొరుగువారికీ విడుదల ప్రకటించాలని నేను చెప్పిన మాట మీలో ఎవరూ వినలేదు, గనుక నేను మీకు ఒక ‘విడుదల’ ప్రకటిస్తున్నాను. ఈ ‘విడుదల’ ఖడ్గానికీ కరవుకూ ఘోరమైన అంటురోగానికీ గురియై చావడమే. నేను మిమ్ములను లోక రాజ్యాలన్నిటికీ అసహ్యకారణంగా చేస్తాను. 18 ఈ మనుషులు నా ఎదుట ఒడంబడిక చేసి ఒక దూడను రెండుగా చీల్చి ఆ భాగాలమధ్య నడిచారు. అయితే వాళ్ళు నా ఒడంబడికను, ఒడంబడికలో ఉన్న షరతులను నెరవేర్చలేదు. వాళ్ళు ఆ దూడను చేసినట్టు నేను వాళ్ళను చేస్తాను. 19 ఆ దూడ రెండు భాగాలమధ్య నడిచిన యూదా నాయకులనూ జెరుసలం నాయకులనూ రాజ పరివారంలో ఉన్నవాళ్ళనూ యాజులనూ ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ 20 వారి శత్రువుల వశం చేస్తాను; వారి ప్రాణాన్ని తీయడానికి చూచేవాళ్ళ చేతికి అప్పగిస్తాను. వారి మృతదేహాలు గాలిలో ఎగిరే పక్షులకూ భూమి మీద తిరిగే జంతువులకూ ఆహారం అవుతాయి.
21 “నేను యూదారాజైన సిద్కియానూ అతడి అధికారులనూ వారి శత్రువుల చేతికీ, వారి ప్రాణాన్ని తీయడానికి చూచేవాళ్ళ చేతికీ, మీ దగ్గరనుంచి వెళ్ళిన బబులోనురాజు సైన్యం చేతికీ అప్పగిస్తాను. 22 నేను బబులోనువాళ్ళను ఆదేశించి, ఈ నగరంమీదికి తిరిగి వచ్చేలా చేస్తాను. ఇది యెహోవా వాక్కు. వాళ్ళు దానిమీద యుద్ధం చేసి దానిని వశం చేసుకొని, మంటలు అంటించి కాల్చివేస్తారు. కాపురం చేసేవాళ్ళు లేకుండా యూదా పట్టణాలను నేను పాడు చేస్తాను.”