33
1 యిర్మీయా ఇంకా ఆ నగరు ఆవరణంలో ఉన్న ఖైదులో ఉన్నాడు. అతడికి యెహోవానుంచి వాక్కు రెండో సారి వచ్చింది. 2 ✝అదేమిటంటే, “భూమిని నిర్మించినవాడు యెహోవా. ఆయన దానిని సుస్థిరం చేయడానికి రూపొందించాడు. ఆయన పేరు యెహోవా. ఆయన చెప్పేదేమిటంటే 3 ✽నాకు ప్రార్థన చెయ్యి. నేను నీకు జవాబిస్తాను, నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులను తెలియజేస్తాను. 4 ఈ ప్రజ కల్దీయవాళ్ళతో చేసిన యుద్ధంలో ముట్టడి దిబ్బల దెబ్బనుంచీ కత్తిబారినుంచీ తమను కాపాడుకోవడానికి పడగొట్టిన నగర గృహాల విషయం, యూదా రాజుల భవనాల విషయం ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇలా చెపుతున్నాడు: 5 ✝నా తీవ్రమైన కోపంతో నేను కొట్టిన మనుషుల శవాలు ఆ ఇండ్లనిండా ఉంటాయి. ఈ నగరవాసుల చెడ్డతనం కారణంగా ఈ నగరానికి నా ముఖం కనబడకుండా చేస్తాను.6 ✝“అయితే, విను – నేను దానికి ఆరోగ్యం చేకూర్చి, దానిని బాగు చేస్తాను. నా ప్రజను బాగు చేసి వారికి శాంతినీ విశ్వసనీయతనూ సమృద్ధిగా వెల్లడిస్తాను. 7 ✝యూదావారిని, ఇస్రాయేల్‌వారిని చెరలోనుంచి వచ్చేలా చేసి, మునుపటిలాగే వారికి అభివృద్ధి కలిగిస్తాను. 8 ✝వారు నాకు వ్యతిరేకంగా చేసిన అపరాధమంతటినుంచీ వారిని శుద్ధి చేస్తాను, వారు నామీద చేసిన తిరుగుబాటంతా, నాకు విరోధంగా చేసిన అపరాధాలన్నీ క్షమిస్తాను. 9 ✝అప్పుడు వారికి నేను చేసే మేలంతటి విషయం విన్న లోక జనాలన్నిటి ఎదుట ఈ నగరంచేత నాకు పేరుప్రతిష్ఠలు, సంతోషం, స్తుతి, ఘనత చేకూరుతాయి. నేను ఈ నగరానికి చేసే మేలంతా, క్షేమమంతా చూచి వారు భయపడుతారు, వణకుతారు.”
10 యెహోవా చెప్పేదేమిటంటే, “ఈ స్థలాన్ని గురించి మీరు అంటున్నారు గదా ‘ఇది పాడుగా ఉంది. మనుషులు లేరు, పశువులూ లేవు.’ అయితే పాడైపోయి పశువులూ కాపురస్థులూ ఎవరూ లేకుండా ఉన్న యూదా పట్టణాలలో, జెరుసలం వీధుల్లో సంబరం, సంతోషం సూచించే ధ్వనులు మళ్ళీ వినబడుతాయి. 11 ✝పెండ్లికూతుళ్ళు, పెండ్లికొడుకుల స్వరాలు వినబడుతాయి. యెహోవా ఆలయానికి కృతజ్ఞత నైవేద్యాలు తీసుకువచ్చేవారి కంఠాలు వినబడుతాయి. వారు
‘యెహోవా దయగలవాడు.
ఆయన అనుగ్రహం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
సేనలప్రభువైన యెహోవాకు కృతజ్ఞత అర్పించండి’ అంటారు.
ఎందుకంటే, మునుపటి క్షేమస్థితికి నేను ఈ దేశాన్ని తెస్తాను. ఇది యెహోవా వాక్కు. 12 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, పాడైపోయి మనుషులూ పశువులూ లేకుండా ఉన్న ఈ స్థలంలో దీని ఊళ్ళన్నిటిలో కాపరులకు మందలను మేపడానికీ పడుకోబెట్టడానికీ పచ్చిక మైదానాలు ఉంటాయి. 13 కొండప్రదేశం ఊళ్ళలో, పడమటి మైదానాల ఊళ్ళలో, దక్షిణ ప్రాంతం ఊళ్ళలో బెన్యామీను ప్రదేశం ఊళ్ళలో, జెరుసలం పరిసరాలలో, యూదా ఊళ్ళలో తమ గొర్రెలను, మేకలను లెక్క పెట్టేవారు ఉంటారు. ఇది యెహోవా వాక్కు.”
14 ✽“యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఇస్రాయేల్‌ప్రజకూ యూదాప్రజకూ చెప్పిన మంచి విషయం నెరవేర్చే రోజులు రాబోతాయి. 15 ✽ఆ రోజుల్లో, ఆ సమయంలోనే నేను దావీదు వంశంలో న్యాయవంతుడైన ‘కొమ్మ’ను పుట్టిస్తాను. లోకంలో ఆయన నీతిన్యాయాలను జరిగిస్తాడు. 16 ఆ రోజుల్లో యూదావారికి రక్షణ కలుగుతుంది. జెరుసలంవారు నిర్భయంగా నివాసం చేస్తారు. ఆయనకు ఈ పేరు పెట్టబడుతుంది: ‘యెహోవాయే మనకు నీతిన్యాయాలు’.
17 ✝యెహోవా చెప్పేదేమిటంటే, దావీదు వంశంలో ఇస్రాయేల్‌ప్రజల సింహాసనం ఎక్కేవాడు ఎన్నడూ లేకుండా ఉండడు. 18 ✽అంతేగాక, ఎప్పుడూ నా ఎదుట హోమాలను అర్పించడానికీ నైవేద్యాలను కాల్చివేయడానికీ బలులను అర్పించడానికీ లేవీవంశస్థులైన యాజులలో మనిషి తప్పకుండా ఉంటాడు.”
19 ✝మరోసారి యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది. 20 “యెహోవా చెప్పేదేమిటంటే, పగలు, రాత్రి నియామక కాలాలలో రాకుండా, నేను వాటికి నిర్ణయించిన నియమాలను ఒకవేళ మీరు భంగం చేయగలిగితే, 21 అతడి సింహాసనమెక్కి పరిపాలన చేయడానికి అతడికి ఎప్పటికీ సంతానం ఉండక తప్పదని నేను నా సేవకుడైన దావీదుతో చేసిన ఒడంబడిక భంగం కాగలదు, నాకు సేవ చేసే లేవీవంశస్థులైన యాజులతో నేను చేసిన ఒడంబడిక భంగం కాగలదు. 22 ✝ఆకాశ నక్షత్రాలనూ సముద్రం ఇసుకరేణువులనూ ఎవరూ లెక్కపెట్టలేరు. అలాగే నేను నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నాకు సేవ చేసే లేవీవంశస్థుల సంతానాన్ని ఎవరూ లెక్కపెట్టలేనంత మందిగా వృద్ధి చేస్తాను.”
23 ✝యెహోవానుంచి వాక్కు మరోసారి యిర్మీయాకు వచ్చింది. 24 “ఈ ప్రజలు ఏం చెపుతున్నారో నీవు గమనించలేదా? ‘యెహోవా ఈ రెండు వంశాలను ఎన్నుకొన్నాడు, రెంటినీ తిరస్కరించాడు’ అంటారు. వారి ఎదుట నా ప్రజను ఒక జనంగా ఇంకా లేనట్టు తృణీకరిస్తూ ఉన్నారు. 25 యెహోవా చెప్పేదేమిటంటే, ఒకవేళ నేను పగలు, రాత్రి విషయం నియమాన్ని నిర్ణయించకపోతే, ఆకాశానికీ భూమికీ క్రమాలు ఏర్పాటు చేయకపోతే, 26 నేను యాకోబు సంతానాన్ని తిరస్కరిస్తాను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల సంతానాన్ని✽ పరిపాలించడానికి నా సేవకుడు దావీదు సంతానంలో ఒకణ్ణి ఎన్నుకోకుండా ఉంటాను. తప్పక నేను వారిని కరుణించి చెరలోనుంచి మళ్ళీ తీసుకువస్తాను.”