32
1 యూదా రాజు సిద్కియా పరిపాలించిన పదో సంవత్సరంలో (నెబుకద్‌నెజరు పరిపాలించిన పద్ధెనిమిదో సంవత్సరంలో) ఈ వాక్కు యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చింది. 2 ఆ కాలంలో బబులోను రాజు సైన్యం జెరుసలంను ముట్టడి వేస్తూ ఉంది. యిర్మీయాప్రవక్త యూదా రాజు భవనం ఆవరణంలో ఉన్న ఖైదులో ఉన్నాడు. 3 యూదా రాజు సిద్కియా అతణ్ణి ఖైదిగా అక్కడ ఉంచి ఇలా అన్నాడు:
“నీవు అంటున్నావు గదా, ‘యెహోవా చెప్పేదేమిటంటే, నేను నగరాన్ని బబులోను రాజు వశం చేస్తాను. అతడు దానిని పట్టుకొంటాడు. 4 యూదారాజు సిద్కియా కల్దీయవాళ్ళ చేతినుంచి తప్పించుకోడు. అతడు బబులోను రాజు చేతిలో పడడం ఖాయం. అతణ్ణి కళ్ళారా చూచి, ముఖాముఖిగా అతడితో మాట్లాడుతాడు. 5 అతడు సిద్కియాను బబులోనుకు తీసుకుపోతాడు. నేను అతడి సంగతిని మళ్ళీ చూచేవరకూ అతడు అక్కడే ఉంటాడు. ఇది యెహోవా వాక్కు. మీరు కల్దీయవాళ్ళతో యుద్ధం చేసినా గెలువరు.’ నీవిలా ప్రకటించడం ఎందుకని?”
6 తరువాత యిర్మీయా తనకు యెహోవానుంచి వాక్కు వచ్చిందని అనుకొన్నాడు. ఆ వాక్కు ఏమిటంటే, 7 “నీ పినతండ్రి షల్లూం కొడుకు హనమేల్ నీదగ్గరికి రాబోతున్నాడు, ‘అనతోతులో ఉన్న నా పొలం కొనుక్కో. విడిపించి నీ స్వాధీనం చేసుకొనే హక్కు నీదే గదా’ అంటాడు.” 8 యెహోవా వాక్కు ప్రకారమే నా పినతండ్రి కొడుకు హనమేల్ నాదగ్గరికి ఆవరణంలో ఉన్న ఖైదుకు వచ్చాడు, “బెన్యామీను ప్రదేశంలో అనతోతులో ఉన్న నా పొలం కొనుక్కో. దానిని కొని, విడిపించి, స్వాధీనం చేసుకొనే హక్కు నీదే గదా. దానిని కొనుక్కో” అన్నాడు. అది యెహోవా వాక్కు అని అప్పుడు నేను తెలుసుకొన్నాను.
9 గనుక నేను పదిహేడు తులాల వెండి తూచి, నా పినతండ్రి కొడుకుకు ఇచ్చి, అనతోతులో ఉన్న అతడి పొలం కొన్నాను. 10 క్రయపత్రం మీద నా సంతకం చేసి, ముద్రవేసి, సాక్షులను పెట్టుకొని, త్రాసులో ఆ వెండి తూచాను. 11 అప్పుడు ఒప్పందం, షరతులు కలిగి ముద్రించిన క్రయపత్రం, ముద్రలేని క్రయపత్రం రెండూ తీసుకొని, 12 మహసేయా మనుమడూ నేరీయా కొడుకూ అయిన బారూకుకు అప్పగించాను. నా పినతండ్రి కొడుకు హనమేల్, పత్రంమీద సంతకం చేసిన సాక్షులు, ఖైదు ప్రాంగణంలో కూర్చుని ఉన్న యూదులందరూ చూస్తూ ఉండగానే అలా చేశాను.
13 వారిముందే నేను బారూకుకు ఇలా ఆదేశించాను: 14 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ముద్ర ఉన్న క్రయపత్రం, ముద్రలేని క్రయపత్రం రెండూ చాలా రోజులు ఉండేలా వాటిని తీసుకొని మట్టికుండలో ఉంచు. 15 ఎందుకంటే, ‘ఈ దేశంలో ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను కొనడం మళ్ళీ జరుగుతుందని ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తెలియజేస్తున్నాడు.” 16 నేను క్రయపత్రం నేరీయా కొడుకు బారూకు చేతికిచ్చిన తరువాత యెహోవాకు ఈ ప్రార్థన చేశాను.
17 యెహోవాప్రభూ! నీవు చాచిన నీ చేతితో, నీ గొప్ప బలంతో భూమిని, ఆకాశాలను చేశావు. నీ బలానికి మించిన పని ఏదీ లేదు. 18 నీవు వేలకొలదిమంది మీద దయ చూపుతున్నావు. తండ్రుల పాపఫలితం సంతానంమీదికి రప్పిస్తున్నావు. గొప్ప దేవా! బలాఢ్యుడా! సేనల ప్రభువు యెహోవా అనే పేరు వహించేవాడా! 19 నీ ఆలోచనలు గొప్పవి, నీ క్రియలు గొప్పవి. మనుషులందిరి త్రోవలమీద నీ కనుదృష్టి ఉంది. ప్రతి ఒక్కరి ప్రవర్తన ప్రకారం, పనుల ప్రకారం, ప్రతిఫలం ఇస్తావు. 20  ఈ రోజు వరకు నీవు ఈజిప్ట్‌దేశంలో, ఇస్రాయేల్ ప్రజలమధ్య, ఇతర జనాలన్నిటి మధ్య నీవు సూచకమైన అద్భుతాలు చేస్తూ ఉన్నావు. ఈ రోజువరకు నిలిచి ఉండే పేరు ప్రతిష్ఠలు సంపాదించుకొన్నావు. 21 సూచనలు, అద్భుతాలు చూపుతూ, బలమైన చేతితో, చాపిన హస్తంతో భయంకరమైన విధంగా నీ ప్రజలైన ఇస్రాయేల్‌వారిని ఈజిప్ట్‌దేశంనుంచి తీసుకువచ్చావు. 22 పాలు తేనెలు నదులై పారే ఈ దేశాన్ని ఇస్తానని వారి పూర్వీకులకు ప్రమాణం చేశావు, ఈ దేశాన్ని వారికిచ్చావు. 23 వారు వచ్చి దానిని స్వాధీనం చేసుకొన్నారు. అయితే వారు నీ మాట వినలేదు, నీ ఉపదేశం ప్రకారం ప్రవర్తించలేదు. చేయాలని నీవు ఆజ్ఞాపించినట్లు చేయలేదు. అందుచేతే నీవు ఈ విపత్తంతా వారిమీదికి రప్పించావు.
24 ఇదిగో! ఈ నగరాన్ని పట్టుకోవడానికి ముట్టడి దిబ్బలు వేశారు. ఈ నగరంమీద కల్దీయవాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఖడ్గం, కరవు, ఘోరమైన అంటురోగం కారణంగా నగరం వాళ్ళ హస్తగతం అవుతుంది. నీవు చెప్పినట్టే జరిగింది. అది నీవు చూస్తూనే ఉన్నావు. 25 అయినా, యెహోవాప్రభూ, నీవు నాతో “వెండి ఇచ్చి ఆ పొలం కొనుక్కో. సాక్షులను పిలిపించు” అన్నావు. అయితే ఈ నగరం కల్దీయవాళ్ళ చేతుల్లో పడుతుంది.
26 అప్పుడు యెహోవానుంచి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది: 27 “నేను యెహోవాను, సర్వమానవకోటికి దేవుణ్ణి. నా బలానికి మించిన పని ఏదైనా ఉందా? 28 గనుక యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఈ నగరాన్ని కల్దీయవాళ్ల చేతికి, బబులోను రాజు నెబుకద్‌నెజరు చేతికి అప్పగించబోతున్నాను. అతడు దానిని పట్టుకొంటాడు. 29 నగరంమీద యుద్ధం చేస్తున్న కల్దీయవాళ్ళు లోపలికి వచ్చి నగరానికి జ్వాల అంటించి దానిని కాల్చివేస్తారు. ఈ ప్రజ ఏ ఇండ్ల కప్పులమీద బయల్‌దేవుడికి ధూపం వేసి, ఇతర దేవుళ్ళకూ దేవతలకూ పానార్పణలు అర్పించి నాకు కోపం రేకెత్తించారో ఆ ఇండ్లు కూడా కాల్చివేస్తారు.
30 “యూదావారు, ఇస్రాయేల్‌వారు యువదశనుంచే నా దృష్టిలో చెడుగు తప్ప ఇంకేమీ చేయలేదు. వాళ్ళు చేతులతో చేసినవాటితో నన్ను విసికిస్తూనే వచ్చారు. 31 వారు దానిని కట్టినప్పటినుంచీ ఈ రోజువరకూ ఈ నగరం నా కోపానికి, ఆగ్రహానికీ కారణంగా ఉంది. గనుక దానిని నా సముఖంనుంచి తొలగించాలి. 32 ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ, వాళ్ళ రాజులు, అధికారులు, యాజులు, ప్రవక్తలు, యూదావారు, జెరుసలం నివాసులు తాము చేసిన చెడుగు అంతటిచేతా నాకు కోపం రేపారు. 33 వారు నాకు వీపు చూపించారు గాని, ముఖం కాదు. నేను పొద్దున్నే లేచి వారికి ఉపదేశించినా వారు వినలేదు, దిద్దుబాటును అంగీకరించలేదు. 34 నా పేర పిలవబడ్డ ఆలయంలో తమ నీచమైన విగ్రహాలను ఉంచి దానిని అపవిత్రం చేశారు. 35 తమ కొడుకులను కూతుళ్ళను మోలెక్‌దేవుడికి అగ్నిద్వారా దాటిస్తామని చెప్పి బెన్‌హిన్నోం లోయలో బయల్‌దేవుడికి ఎత్తు పూజాస్థలాలను కట్టారు. వాళ్ళు అలాంటి నీచమైన పని చేసి, అలాంటి పాపానికి యూదాప్రజ ఒడికట్టేలా చేయాలని నేను వారిని ఎన్నడూ ఆదేశించలేదు. అలాంటిది నా మనసుకు తట్టలేదు.
36 “అయినా, ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఈ నగరం విషయం చెప్పేదేమిటంటే, మీరు అంటున్నారు గదా ‘ఇది ఖడ్గంచేత, కరవుచేత, ఘోరమైన అంటురోగంచేత బబులోను రాజు హస్తగతమవుతుంది’– 37 అయితే నేను నా తీవ్రకోపంతో, మహా ఆగ్రహంతో వారిని ఇతర దేశాలకు వెళ్ళగొట్టినతరువాత, ఆ దేశాలనుంచి వారిని మళ్ళీ సమకూరుస్తాను, ఈ స్థలానికి తీసుకువచ్చి, ఇక్కడ వారు నిర్భయంగా నివాసం ఉండేలా చేస్తాను. 38 వారు నాకు ప్రజలై ఉంటారు. నేను వారికి దేవుడనై ఉంటాను. 39 వారు నాపట్ల ఎప్పటికీ భయభక్తులు చూపేలా వారికి ఒకే మనసును, ఒకే జీవిత విధానాన్ని కలిగిస్తాను. ఆ విధంగా వారికీ, వారి తరువాత వారి సంతానానికీ మేలు చేకూరుతుంది. 40 నేను వారికి మేలు చేయడం మాననని ఎప్పటికీ నిలిచే ఒడంబడిక వారితో చేస్తాను. వారు నానుంచి తొలగిపోకుండా నా భయం వారి అంతరంగంలో ఉంచుతాను. 41 వారికి మేలు చేయడమే నాకు ఆనందం అవుతుంది. నేను మనసారా హృదయపూర్వకంగా వారిని ఈ దేశంలో నాటితీరుతాను.
42 “యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఈ ప్రజమీదికి గొప్ప విపత్తును రప్పించినట్లే, నేను వారికి వాగ్దానం చేసిన మేలంతా వారికి చేకూరుస్తాను. 43 మీరీ దేశం గురించి ఇలా అంటున్నారు గదా: ‘ఇది పాడైపోయింది. మనుషులు లేరు, పశువులు కూడా లేవు. ఈ దేశం కల్దీయవాళ్ళ చేతుల్లో పడింది’. అయితే ఈ దేశంలో మళ్ళీ పొలాలను కొనడం జరుగుతుంది. 44 బెన్యామీను ప్రదేశంలో, జెరుసలం పరిసరాలలో, యూదా పట్టణాలలో, కొండసీమలో ఉన్న ఊళ్ళలో, పడమటి మైదానాల ఊళ్ళలో, దక్షిణ ప్రదేశం ఊళ్ళలో మనుషులు ద్రవ్యమిచ్చి పొలాలు కొంటారు. క్రయపత్రాలు వ్రాసి, ముద్ర వేస్తారు, సాక్షులను పెట్టుకొంటారు. ఎందుకంటే బందీలుగా వెళ్ళిపోయిన ఈ ప్రజను నేను మళ్ళీ తీసుకువస్తాను. ఇది యెహోవా వాక్కు.”