31
1 యెహోవా చెప్పేదేమిటంటే,“ఆ కాలంలో ఇస్రాయేల్ గోత్రాలన్నిటికీ✽
నేను దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.
2 ✽యెహోవా ఇలా చెపుతున్నాడు,
పట్టాకత్తి బారినుంచి తప్పించుకొన్న ప్రజ
ఎడారిలోకి పారిపోయినప్పుడు,
అక్కడ నా దయ అనుభవించారు.”
3 ✽ గతకాలంలో యెహోవా మనకు ప్రత్యక్షమై
ఇలా అన్నాడు:
“శాశ్వతమైన ప్రేమ మీపట్ల నాకు ఉంది.
గనుకనే మిమ్ములను కృపతో నాదగ్గర చేర్చాను.
4 ✽ఇస్రాయేల్‌కన్యా! నిన్ను క్షేమస్థితికి
మళ్ళీ తెస్తాను. నీవు మళ్ళీ క్షేమస్థితి పొంది,
కంజరి చేతపట్టుకొని వెళ్ళి సంబరంగా
నాట్యం చేసేవారితో కలుస్తావు.
5 నీవు సమరయ కొండలమీద మళ్ళీ
ద్రాక్షతోటలు నాటుతావు.
నాటేవారు వాటి ఫలాలను అనుభవిస్తారు.
6 ✽‘లేచి సీయోనుకు, మన దేవుడు యెహోవా
దగ్గరికి వెళ్దాం పదండి’ అని ఎఫ్రాయిం కొండ ప్రాంతంలో
కాపలావారు కేకలు వేసే రోజులు వస్తాయి.”
7 ✽యెహోవా చెప్పేదేమిటంటే,
“యాకోబు ప్రజల కారణంగా సంతోషధ్వనులు చేయండి.
జనాలలో ఈ ప్రముఖ జనం కారణంగా
ఆనందంతో కేకలు వేయండి.
మీ స్తుతులు పెద్దగా వినిపిస్తూ,
‘యెహోవా! నీ ప్రజలైన ఇస్రాయేల్‌వారిలో
మిగతావారిని కాపాడు’ అని చెప్పండి.
8 ఇదిగో వినండి! నేను వారిని ఉత్తర దేశంనుంచి
తీసుకువస్తాను.
భూమి కొనల✽నుంచి వారిని సమకూరుస్తాను.
వారిలో కొంతమంది గుడ్డివారు, కుంటివారు,
గర్భిణులు, ప్రసవించనై ఉన్న స్త్రీలు ఉంటారు.
వారు మహా గొప్ప సమూహం✽గా ఇక్కడికి తిరిగి వస్తారు.
9 వారు ఏడుస్తూ✽ వస్తారు. నేను వారిని తీసుకువస్తూ ఉంటే
వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇస్రాయేల్‌కు నేను తండ్రిని.
ఎఫ్రాయిం✽ నా జ్యేష్ఠుడు. గనుక నేను వారిని
నీటి కాలువల ఒడ్డున, చక్కని త్రోవలో నడిపిస్తాను.
ఆ త్రోవలో వారు తొట్రుపడరు.
10 “ఇతర జనాల్లారా! యెహోవా వాక్కు వినండి!
దూరంగా ఉన్న సముద్ర తీరాల ప్రాంతాలలో
ఇలా చాటించండి –
‘ఇస్రాయేల్ ప్రజను చెదరగొట్టినవాడు
వారిని సమకూరుస్తాడు.
కాపరి తన మందను కాపాడే విధంగా వారిని కాపాడుతాడు.
11 ఎందుకంటే యెహోవా యాకోబును విమోచిస్తాడు.
వారికంటే బలాఢ్యుల చేతిలోనుంచి వారిని విడిపిస్తాడు.
12 వారు వచ్చి సీయోను కొండమీద సంతోషధ్వనులు చేస్తారు.
యెహోవా ప్రసాదించిన ధాన్యం, ద్రాక్షరసం, నూనె,
గొర్రెపిల్లలు, పశువులపిల్లల కారణంగా వారి ముఖాలు
సంతోషంగా ప్రకాశిస్తాయి.
వారి బ్రతుకు నీళ్ళు పారిన తోటలాగా ఉంటుంది.
అప్పటినుంచి వారు నీరసించిపోరు✽.
13 వారి దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తాను.
వారి విచారానికి బదులుగా ఓదార్పు, ఆనందం కలిగిస్తాను.
వారిలో కన్యలు, యువకులు, ముసలివారు
సంతోషంతో నాట్యం చేస్తారు.
14 యాజులను సమృద్ధితో తృప్తిపరుస్తాను.
నేను చేసే మేలు అనుభవిస్తూ సంతుష్టి చెందుతూ ఉంటారు.
ఇది యెహోవా వాక్కు.”
15 ✽యెహోవా ఇలా చెప్పాడు:
“రమాలో విలాపం, మహా రోదనం వినబడుతున్నాయి.
రాహేలు తన పిల్లలకోసం ఏడుస్తూ ఉంది.
వారిని కోల్పోయినందుచేత ఓదార్పును నిరాకరిస్తూ ఉంది.”
16 ✽యెహోవా ఇలా చెప్పాడు:
“నీవింకా ఏడ్వవద్దు. ఇంకా కంటతడి పెట్టవద్దు.
ఎందుకంటే నీవు చేసినదానికి బహుమానం ఉంటుంది.
ఇది యెహోవా వాక్కు. వారు శత్రువుల
దేశంనుంచి తిరిగి వస్తారు.
17 భవిష్యత్తులో క్షేమం కలుగుతుందని
నీవు ఆశాభావంతో ఎదురు చూడవచ్చు.
ఇది యెహోవా వాక్కు. నీ పిల్లలు స్వదేశానికి తిరిగి వస్తారు.
18 ✽“ఎఫ్రాయిం మూలుగుతూ ఇలా అంటూ
ఉన్నప్పుడు నేను విన్నాను:
‘శిక్షణ లేని దూడను శిక్షించే విధంగా
నీవు నన్ను శిక్షించావు.
నేను శిక్షకు లోబడుతున్నాను. నీవే నా దేవుడివి,
యెహోవావు. నీవైపు నన్ను త్రిప్పుకో, తిరుగుతాను.
19 ✽నేను నీవైపు తిరిగిన తరువాత నాకు పశ్చాత్తాపం కలిగింది.
ఉపదేశం పొందినతరువాత నా తొడ చరచుకొన్నాను.
నా కుర్రతనం విషయమైన అవమానం భరిస్తూ
ఉండడంచేత నాకు సిగ్గు, తలవంపులు కలిగాయి.
20 ✽యెహోవా చెప్పేదేమిటంటే, ఎఫ్రాయిం
నాకు ప్రియమైన కొడుకులాగా కాడా?
ఎఫ్రాయిం అంటే నాకు చాలా ఇష్టం గదా?
నేను ఆ ప్రజకు వ్యతిరేకంగా అనేక సార్లు మాట్లాడినా
వారిని నేను ఎంతమాత్రం మరవలేను.
నాకు అంతరంగంలో పరితాపం కలిగింది.
నేను వారిని తప్పక దయ చూస్తాను.
ఇది యెహోవా వాక్కు.
21 ✽ఇస్రాయేల్‌కన్యా! నీకోసం దారి గుర్తులు పెట్టుకో!
త్రోవ చూపే స్తంభాలు పాతుకో!
నీవు వెళ్ళిపోయిన మార్గాన్ని బాగా గుర్తుంచుకో.
ఈ నీ పట్టణాలకు తిరిగి రా!
22 దారి తప్పిన కుమారీ! నీవు ఎన్నాళ్ళు
తిరుగాడుతూ ఉంటావు?
యెహోవా భూమిమీద క్రొత్తదానిని కలగజేస్తాడు –
స్త్రీ వీరోచితంగా వ్యవహరిస్తుంది.”
23 ✽ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా ఇలా చెప్పాడు: “నేను వారిని చెరనుంచి తీసుకువచ్చిన తరువాత యూదాదేశంలో, దాని పట్టణాలలో వారు మళ్ళీ ఈ మాటలు వినియోగిస్తారు:
‘న్యాయానికి నివాసమా! పవిత్ర పర్వతమా✽!
యెహోవా నిన్ను దీవిస్తాడు గాక!’
24 అలసిపోయినవారిని బలంతో నింపుతాను. 25 ✝గనుక యూదాలో, దాని పట్టణాలన్నిటిలో ప్రజలు నివాసం చేస్తారు. వారిమధ్య రైతులు, కాపరులు ఉంటారు.”
26 ✽అప్పుడు నేను నిద్ర లేచి కలయ చూశాను. ఆ నిద్ర నాకు సంతోషకరం అనిపించింది. 27 ✽యెహోవా ఇంకా అన్నాడు “రాబోయే రోజుల్లో ఇస్రాయేల్ ప్రాంతంలో, యూదా ప్రాంతంలో మనుషుల సంతానం, పశువుల సంతానం అంతటా ఉండేలా చేస్తాను. 28 మునుపు నేను వారిని పెరికివేయడానికీ విరగగొట్టడానికీ పడగొట్టడానికీ నాశనం చేయడానికీ విపత్తుకు గురి చేయడానికీ జాగ్రత్త తీసుకొన్నాను. అలాగే వారిని నాటడానికీ వారికి అభివృద్ధి చేకూర్చడానికీ నేను జాగ్రత్త తీసుకొంటాను. ఇది యెహోవా వాక్కు. 29 ✽ ఆ రోజుల్లో ప్రజలు
‘తండ్రులు పుల్లని ద్రాక్షకాయలు తిన్నారు.
వాళ్ళ పిల్లలకు పళ్ళు పులిసిపోయాయి’
అని ఇంకా చెప్పరు.
30 ✝కాని ఎవరు పాపం చేస్తే, వారే వారి పాపానికి చస్తారు. ఎవరు పుల్లని ద్రాక్షకాయలు తింటారో వారికే పళ్ళు పులిసిపోతాయి.”
31 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “ఇదిగో, ఒక కాలం రాబోతుంది. అప్పుడు నేను ఇస్రాయేల్‌వారితోనూ యూదావారితోనూ✽ క్రొత్త ఒడంబడిక చేస్తాను. 32 ✝నేను ఈజిప్ట్‌లోనుంచి వారి పూర్వీకులను చేయి పట్టుకొని నడిపించాను. ఈ క్రొత్తది నేను ఆ కాలంలో వారితో చేసిన ఒడంబడికలాగా ఉండదు. ఎందుకని? నేను వారికి భర్తలాగా ఉన్నా వారు నా ఒడంబడికను భంగం చేశారు. ఇది యెహోవా వాక్కు. 33 ఆ రోజులయిన తరువాత నేను ఇస్రాయేల్‌వారితో చేయబోయే ఒడంబడిక ఇదే: ఇది యెహోవా వాక్కు – నేను నా ధర్మశాస్త్రం వారి మనసులలో ఉంచుతాను, వాటిని వారి హృదయాలపై✽ వ్రాస్తాను, నేను వారికి దేవుడనై ఉంటాను✽. వారు నాకు ప్రజలై ఉంటారు. 34 ✽వారంతా✽ అల్పులైనా ఘనులైనా నన్ను తెలుసుకొంటారు✽, గనుక ‘యెహోవాతో పరిచయం చేసుకో’ అంటూ వారు తమ తమ సాటి పౌరులకూ, సోదరులకూ బోధించరు. నేను వారి అపరాధాలను క్షమించి✽, అప్పటినుంచి వారి పాపాలను ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను. ఇది యెహోవా వాక్కు.”
35 ✽యెహోవా చెప్పేదేమిటంటే,
“పగటివేళ వెలుగు కోసం పొద్దును నియమించి
రాత్రివేళ వెలుగుకోసం చంద్రనక్షత్రాల క్రమం
ఏర్పరచేవాడి పేరు,
సముద్రాన్ని అలలతో ఘోషించేలా రేపేవాడి పేరు
సేనల ప్రభువు యెహోవా.
36 నేను నిర్ణయించిన ఈ క్రమం నా ఎదుటనుంచి
తప్పిపోతేనే ఇస్రాయేల్‌వంశంవారు నా ఎదుట
ప్రజగా ఉండకుండా పోతారు.
ఇది యెహోవా వాక్కు.”
37 యెహోవా చెప్పేదేమిటంటే,
“పైగా ఉన్న ఆకాశాలకు ఎవరైనా కొలత తీసుకోగలిగితే,
భూమి పునాదులను వెదకి కనిపెట్టగలిగితే
ఇస్రాయేల్ వంశంవారిని,
వారు చేసినదానినంతటి కారణంగా
నేను తిరస్కరిస్తాను. ఇది యెహోవా వాక్కు.”
38 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “రాబోయే రోజుల్లో ఈ నగరాన్ని హనన్యేల్ గోపురంనుంచి ‘మూల ద్వారం’ వరకు యెహోవా కోసం మళ్ళీ కట్టడం జరుగుతుంది. 39 అక్కడనుంచి కొలత తాడు గారేబు కొండవరకు పోతుంది, అక్కడ గోయా వైపు మళ్ళుతుంది. 40 శవాలను, బూడిదను వేసే లోయ అంతా, తూర్పు దిక్కుగా కిద్రోనువాగు వరకు, ‘గుర్రాల ద్వారం’ వరకు ఉన్న పొలాలన్నీ యెహోవాకు పవిత్రంగా ఉంటాయి. నగరాన్ని ఇంకెన్నడూ పెరికివేయడం, పడగొట్టడం జరగదు.”