30
1 యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు:
2 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను నీకు చెప్పే మాటలన్నీ పుస్తకంలో వ్రాసి ఉంచు. 3  ఎందుకంటే, రాబోయే రోజుల్లో నేను నా ప్రజలైన ఇస్రాయేల్‌నూ యూదానూ చెరలోనుంచి విడిపిస్తాను. వారి పూర్వీకులకు నేను ఇచ్చిన దేశానికి వారిని తీసుకువస్తాను. వారు దానిని స్వాధీనం చేసుకొంటారు. ఇది యెహోవా వాక్కు.
4 ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ విషయం యెహోవా చెప్పిన మాటలు: 5 “యెహోవా ఇలా చెపుతున్నాడు:
శాంతిని కాదు – కలవరాన్ని, భయాన్ని సూచించే
కేకలు వినబడుతూ ఉన్నాయి.
6 ఈ విషయం అడిగి చూడండి.
మగవాళ్ళు పిల్లలను కంటారా?
మరి, ప్రతి మనిషి ప్రసవవేదనలు పడే స్త్రీలాగా
తన నడుంమీద చేతులు ఉంచుకోవడం
నాకు కనిపిస్తూ ఉందే. ఎందుకని?
ప్రతి ఒక్కడి ముఖం తెల్లబోయిందేమిటి?
7 అయ్యో! ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది!
అలాంటిది ఇంకొకటి ఉండదు.
అది యాకోబుకు ఆపద కాలంగా ఉంటుంది.
అయినా అందులోనుంచి ఆ జనాన్ని
విడిపించడం జరుగుతుంది.
8 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
ఆ రోజున వారి మెడమీదనుంచి కాడిని తీసి
విరగగొట్టివేస్తాను.
వారిని బంధించిన కట్లు తెంపివేస్తాను.
అప్పటినుంచి విదేశీయులు వారిచేత ఊడిగం
చేయించుకోరు.
9 వారు తమ దేవుడైన యెహోవాకు సేవ చేస్తారు.
వాళ్ళకోసం నేను లేపేవారి రాజైన దావీదుకు
కూడా సేవ చేస్తారు.
10  “నా సేవకుడైన యాకోబూ! నిర్భయంగా ఉండు.
ఇస్రాయేలూ! ధైర్యంగా ఉండు. ఇది యెహోవా వాక్కు.
దూరంగా ఉన్న మిమ్ములను అక్కడనుంచి విడిపిస్తాను,
మీ సంతానాన్ని వారు బందీలుగా వెళ్ళిపోయిన
దేశంనుంచి విడిపిస్తాను.
యాకోబు ప్రజలు ఇక్కడికి తిరిగి వచ్చి నిమ్మళంగా,
భద్రంగా ఉంటారు. వారిని ఎవ్వరూ బెదిరించరు.
11 నేను మీకు తోడుగా ఉన్నాను.
మిమ్ములను రక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.
మిమ్ములను ఏ జనాలమధ్యకు చెదరగొట్టానో
ఆ జనాలన్నిటినీ పూర్తిగా అంతం చేసినా,
మిమ్ములను పూర్తిగా అంతం చేయను.
మిమ్ములను శిక్షించకుండా ఉండను గాని,
చాలినంతగానే శిక్షిస్తాను.
12  “యెహోవా చెప్పేదేమిటంటే, మీ దెబ్బ నయం కాదు.
మీ గాయం మాననిది.
13 మీ పక్షం వాదించేవారెవ్వరూ లేరు.
మీ గాయానికి మందే లేదు.
మీకు నివారణ అంటూ లేదు.
14 మీ ప్రేమికులంతా మిమ్ములను మరచిపోయారు.
వాళ్ళు మీదగ్గరికి రావడం లేదు.
ఎందుకంటే, మీ అపరాధం ఘోరం కావడంచేత,
మీ పాపాలు అనేకం కావడం చేత,
నేను శత్రువులాగా మిమ్ములను కొట్టాను,
క్రూరుడులాగా శిక్షించాను.
15 మీ బాధకు నివారణ ఉండదు.
మరి మీ దెబ్బకు సహాయంకోసం మీరెందుకు
కేకలు వేస్తున్నారు?
మీ అపరాధం ఘోరం కావడం చేత,
మీ పాపాలు అనేకం కావడంచేత
నేను మిమ్ములను ఈ విధంగా చేశాను.
16 “అయితే మిమ్ములను ఎవరు దిగమ్రింగుతారో
వాళ్ళనే దిగమ్రింగడం జరుగుతుంది.
మీ శత్రువులు అందరూ బందీలుగా పోతారు.
మిమ్నులను దోచుకొనే వాళ్ళను దోచుకోవడం
జరుగుతుంది.
మిమ్ములను కొల్లగొట్టేవాళ్ళు కొల్లగొట్టబడేలా నేనే చేస్తాను.
17 మీకైతే ఆరోగ్యం మళ్ళీ చేకూరుస్తాను,
మీ గాయాలను పూర్తిగా నయం చేస్తాను.
ఎందుకంటే, వాళ్ళు మిమ్ములను
‘వెలి వేయబడ్డవాళ్ళు’ అన్నారు.
‘సీయోను విషయాన్ని ఎవ్వరూ
పట్టించుకోవడం లేదు’ అన్నారు. ఇది యెహోవా వాక్కు.
18 యెహోవా చెప్పేదేమిటంటే,
యాకోబు ప్రజల నివాసాలను జాలితో చూచి,
వారి డేరాలను క్షేమస్థితికి మళ్ళీ తెస్తాను.
నగరాన్ని దాని శిథిలాలమీద
మళ్ళీ కట్టడం జరుగుతుంది.
రాజు నగరు దాని స్థానంలో మళ్ళీ ఉంటుంది.
19 వారి నివాసాలలోనుంచి కృతజ్ఞత పాటలూ,
సంబరపడేవారి స్వరాలూ వినబడుతాయి.
వారు తక్కువమంది కాబోరు.
నేను వారిని వృద్ధి చేస్తాను, నేను వారికి
గౌరవం చేకూరుస్తాను.
వారు తృణీకారానికి గురి కాబోరు.
20 వారి సంతానం వెనుకటిలాగే ఉంటారు.
వారి సమాజం నా ఎదుట సుస్థిరం అవుతుంది.
వారిని బాధించేవాళ్ళందరినీ నేను శిక్షిస్తాను.
21 వారిలో ఉన్నవాడే వారికి నాయకుడుగా ఉంటాడు.
వారి పరిపాలకుడు వారి మధ్యనుంచే వస్తాడు.
అతడు నన్ను సమీపించేలా నేను అతణ్ణి దగ్గర చేరుస్తాను.
అలా చేయకపోతే నా ఎదుటికి రావడానికి
ధైర్యం తెచ్చుకొంటారా? ఇది యెహోవా వాక్కు.
22 అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు.
నేను మీకు దేవుడనై ఉంటాను.
23  “ఇదిగో, యెహోవా ఆగ్రహం తుఫానులాగా
బయలుదేరుతున్నది.
అది గిరగిర తిరిగే తుఫానులాగా దుర్మార్గుల నెత్తిన
విరుచుకు పడుతుంది.
24 యెహోవా తన మనసులో ఉన్న ఉద్దేశాలు
పూర్తిగా నెరవేర్చేవరకు ఆయన తీవ్ర కోపం చల్లారదు.
చివరి రోజుల్లో మీరు ఈ విషయం గ్రహిస్తారు.”