29
1 ✽యెకొన్యారాజు, రాజమాత, అతడి పరివారం, యూదాలో, జెరుసలంలో ఉన్న అధికారులు, శిల్పకారులు, స్వర్ణకారులు జెరుసలంనుంచి బందీలుగా వెళ్ళిపోయిన తరువాత ఇలా జరిగింది: 2 యిర్మీయాప్రవక్త లేఖ వ్రాసి, నెబుకద్‌నెజరు జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా తీసుకుపోయిన వారిలో మిగిలిన పెద్దలకూ, యాజులకూ, ప్రవక్తలకూ ప్రజలందరికీ దానిని పంపించాడు. 3 యూదా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్‌నెజరుదగ్గరికి బబులోనుకు షాఫాను కొడుకు ఎల్యాషానూ హిల్కీయా కొడుకు గెమర్యానూ పంపినప్పుడు, యిర్మీయా ఈ లేఖ వాళ్ళచేత పంపించాడు. అందులో వ్రాసిన మాటలు ఇవి:4 ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా, తాను జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా పంపినవారందరికీ ఇలా చెపుతున్నాడు: 5 “ఇండ్లు కట్టుకోండి, వాటిలో కాపురముండండి. తోటలు నాటి, వాటి కాపు అనుభవించండి. 6 పెండ్లి చేసుకొని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీ సంఖ్య తగ్గిపోకుండా ఎక్కువ కావాలి. గనుక మీ కొడుకులకూ కూతుళ్ళకూ సంతానం కలిగేలా మీ కొడుకులకు పెళ్ళిళ్ళు చేయండి, మీ కూతుళ్ళకు భర్తలను సంపాదించండి. 7 నేను మిమ్ములను బందీలుగా పంపిన నగరానికి క్షేమం చేకూరేలా ప్రయత్నం చేయండి. దానికి క్షేమం చేకూరితే మీకూ క్షేమం చేకూరుతుంది, గనుక ఆ నగరంకోసం యెహోవాకు ప్రార్థన చేయండి. 8 ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీ మధ్య ఉన్న ప్రవక్తలచేత, సోదె చెప్పేవాళ్ళవల్ల మోసపోకండి. వాళ్ళు కలల భావం చెపితే వినవద్దు. 9 వాళ్ళు నా పేర అబద్ధాలు మీకు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. ఇది యెహోవా వాక్కు.”
10 యెహోవా చెప్పేదేమిటంటే, “బబులోనురాజ్యానికి డెబ్భై సంవత్సరాలు గడిచినతరువాత, నేను మిమ్ములను సందర్శించి ఈ స్థలానికి తిరిగి తీసుకువస్తాను. నేను మీకు ఇచ్చిన ఆ మాట నెరవేరుస్తాను. 11 మీ విషయం నేను చేసిన ఆలోచనలు నాకు తెలుసు. మీకు క్షేమమే చేకూరాలని నా ఉద్దేశం గాని, హాని కాదు. మీకు ఆశాభావంతో నిండిన భవిష్యత్తును కలిగిద్దామని నా ఆశయం. ఇది యెహోవా వాక్కు.
12 “అప్పుడు మీరు నాకు మనవి చేసుకొంటారు. వచ్చి నాకు ప్రార్థన చేస్తారు. నేను మీ ప్రార్థన వింటాను. 13 ✽మీరు నన్ను వెదకుతారు. హృదయపూర్వకంగా నన్ను వెదకేటప్పుడు నన్ను కనుగొంటారు కూడా. 14 నేను మీకు దొరుకుతాను. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్ములను చెరలోనుంచి ఇక్కడికి తీసుకువస్తాను. నేను ఈ స్థలంలోనుంచి మిమ్ములను బందీలుగా పంపించాను. నేను మిమ్ములను పారదోలిన అన్ని జనాల మధ్యనుంచి, అన్ని స్థలాలనుంచి ఈ స్థలానికీ మిమ్ములను తిరిగి సమకూరుస్తాను. ఇది యెహోవా వాక్కు.
15 ✽మీరు అన్నారు, ‘బబులోనులో మాకోసం యెహోవా ప్రవక్తలను నియమించాడు.’ 16 ✝అయితే యెహోవా ఇలా చెపుతున్నాడు: “దావీదు సింహాసనమెక్కి పరిపాలించే రాజు విషయం, మీతోకూడా బందీలుగా వెళ్ళకుండా ఈ నగరంలో ఉంటున్న మీ ప్రజలందరి విషయం సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, 17 వాళ్ళమీదికి నేను ఖడ్గాన్ని, కరవును, ఘోరమైన అంటురోగాన్ని రప్పించబోతున్నాను. కుళ్ళిపోయి, తినడానికి వీలు కాకుండా ఉన్న అంజూరుపండ్లలాగా వాళ్ళను చేస్తాను. 18 వాళ్ళను ఖడ్గంచేత, కరవుచేత, ఘోరమైన అంటురోగంచేత బాధించి చెదరగొట్టివేస్తాను. లోక రాజ్యాలన్నిటికీ వాళ్ళను అసహ్య కారణంగా చేస్తాను, నేను వాళ్ళను పారదోలే జనాలన్నిటిమధ్య వాళ్ళను శాపానికీ తృణీకారానికీ ఎగతాళికీ నిందకూ గురి చేస్తాను. 19 ఎందుకంటే, వాళ్ళు నా మాటలు వినలేదు. ఇది యెహోవా వాక్కు. నేను పొద్దున్నే లేచి నా సేవకులైన ప్రవక్తలచేత వాళ్ళదగ్గరికి నా మాటలు పంపించాను గాని, వాళ్ళు వాటిని చెవిని పెట్టలేదు. మీరు కూడా చెవినిపెట్టలేదు. ఇది యెహోవా వాక్కు.
20 ✽“ఇప్పుడు యెహోవా చెప్పేమాట వినండి. నేను జెరుసలంనుంచి బబులోనుకు బందీలుగా పంపినవారంతా వినాలి. 21 ఇస్రాయేల్‌యొక్క దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా, కోలాయా కొడుకైన అహాబు విషయం, మయశేయా కొడుకైన సిద్కియా విషయం ఇలా చెపుతున్నాడు: వాళ్ళు ప్రవక్తలుగా నా పేర అబద్ధాలు మీతో పలుకుతున్నారు. నేను వాళ్ళను బబులోనురాజు నెబుకద్‌నెజరు చేతికి అప్పగిస్తాను. మీరు చూస్తుండగానే అతడు వాళ్ళను హతం చేయిస్తాడు. 22 తరువాత, ‘బబులోను రాజు మంటల్లో మాడ్చిన సిద్కియా, అహాబులలాగే మిమ్మల్ని యెహోవా చేస్తాడు గాక’ అంటూ బబులోనులో ఉన్న యూదా బందీలందరూ వాళ్ళ పేర్లను శాపంగా వినియోగిస్తారు. 23 ఎందుకని? వాళ్ళు ఇస్రాయేల్‌ప్రజల మధ్య సిగ్గుమాలిన రీతిగా ప్రవర్తించారు. పొరుగువారి భార్యలతో వ్యభిచారం చేశారు. నా పేర అబద్ధాలు పలికారు. అలా చెప్పమని నేను వాళ్ళను ఆదేశించలేదు. ఇదంతా నాకు తెలిసే ఉంది. నేను దానికి సాక్షిని. ఇది యెహోవా వాక్కు.
24 నెహలాంవాడైన షెమయాతో మాట్లాడి ఇలా చెప్పు: 25 ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, “నీవు జెరుసలంలో ఉన్న ప్రజలందరికీ, మయశేయా కొడుకైన జెఫన్యాయాజికి, యాజులందరికీ నీ పేరటే లేఖలు వ్రాసి పంపించావు. వాటిలో నీవు అన్నావు గదా, 26 ‘యెహోవా నిన్ను యెహోయాదాయాజికి బదులు యాజిగా, యెహోవా ఆలయంమీద అధికారిగా నియమించాడు. ప్రవక్తలాగా నటించే ప్రతి వెర్రివాణ్ణి నీవు మెడకు సంకెళ్ళు ఉంచి బొండ వేయించవలసినవాడివి గదా. 27 మరి నీవెందుకు అనతోతు గ్రామంవాడైన యిర్మీయాను గద్దించలేదు? వాడు ప్రవక్తలాగా నటిస్తున్నాడు. 28 వాడు బబులోనులో ఉన్న మాకు ఈ కబురు పంపించాడు: మీకింకా దీర్ఘకాలం చెర ఉంటుంది. ఇండ్లు కట్టుకొని, వాటిలో కాపురముండండి. తోటలు నాటి వాటి కాపు అనుభవించండి.’”
29 అయితే జెఫన్యాయాజి ఆ లేఖ యిర్మీయాప్రవక్తకు చదివి వినిపించాడు. 30 అప్పుడు యెహోవానుంచి వాక్కు యిర్మీయాకు వచ్చింది: 31 “బందీలుగా వెళ్ళిపోయిన వారందరికీ ఈ మాట పంపించు – నెహలాంవాడైన శమయాను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, నేను వాణ్ణి పంపకపోయినా వాడు ప్రవక్తగా పలికి మీరు అబద్ధాన్ని నమ్మేలా చేశాడు. 32 అందుచేత యెహోవా ఇలా చెపుతున్నాడు: నేను నెహలాంవాడైన శమయానూ, వాడి సంతానాన్నీ దండిస్తాను. వాడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాటలు పలికాడు, గనుక ఈ ప్రజలలో వాడికి ఎవ్వరూ మిగిలి ఉండరు. నా ప్రజకు నేను చేయబోయే మేలును వాడు చూడడు. ఇది యెహోవా వాక్కు.