28
1 ✽ఆ సంవత్సరంలోనే (యూదా రాజు సిద్కియా పరిపాలన ప్రారంభంలో ఉన్న నాలుగో సంవత్సరం అయిదో నెల) గిబియోన్‌పురవాసి అజ్జూరు కొడుకు హనన్యాప్రవక్త యెహోవా ఆలయంలో నాతో మాట్లాడాడు. యాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట, అతడు ఇలా చెప్పాడు: 2 ✽“ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, బబులోను రాజు ఉంచినకాడిని విరగగొట్టివేస్తాను. 3 ✝బబులోను రాజు నెబుకద్‌నెజరు ఇక్కడనుంచి బబులోనుకు తీసుకుపోయిన యెహోవా ఆలయ పాత్రలను రెండేళ్ళలోపల ఇక్కడికి మళ్ళీ తెప్పిస్తాను. 4 ✽అంతే గాక, బబులోను రాజు ఉంచినకాడిని విరగగొట్టివేసి, యూదా రాజూ, యెహోయాకీం కొడుకూ అయిన యెకొన్యారాజు తిరిగి ఈ స్థలానికి వచ్చేలా చేస్తాను. యూదానుంచి బబులోనుకు బందీలుగా పోయిన వాళ్ళందరినీ అతడితోపాటు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.”5 ✽అప్పుడు, యెహోవా ఆలయంలో నిలబడి ఉన్న యాజుల ఎదుట, ప్రజలందరి ఎదుట యిర్మీయాప్రవక్త హనన్యాప్రవక్తకు జవాబిచ్చాడు. 6 యిర్మీయాప్రవక్త అన్నాడు, “తథాస్తు! యెహోవా అలాగే చేస్తాడు గాక! బబులోనునుంచి ఈ స్థలానికి యెహోవా ఆలయ పాత్రలనూ బందీలుగా పోయినవాళ్ళందరినీ ఆయన రప్పించి, నీవు ప్రవక్తగా పలికిన మాటలు నెరవేరుస్తాడు గాక! 7 అయినా, నేను నీ ఎదుట, ఈ ప్రజలందరి ఎదుట ఒక మాట చెప్పబోతున్నాను. ఈ మాట వినండి. 8 నాకూ నీకూ ముందుగా వచ్చిన ప్రవక్తలు అనేక దేశాలమీదికీ, గొప్ప రాజ్యాలమీదికీ యుద్ధం, విపత్తు, ఘోరమైన అంటురోగాలు వస్తాయని పూర్వకాలంనుంచి పరవశులై పలుకుతూ వచ్చారు. 9 ✽శాంతి సిద్ధిస్తుందని ఒక ప్రవక్త ప్రకటిస్తాడనుకోండి. ఆ ప్రవక్త పలికిన మాట నెరవేరితేనే✽ నిజంగా యెహోవా ఆ ప్రవక్తను పంపాడని తెలుస్తుంది.”
10 ✽యిర్మీయాప్రవక్త మెడకు ఆ కాడిమ్రాను ఇంకా ఉంది. హనన్యాప్రవక్త దానిని అతడి మెడమీదనుంచి తీసి, విరగగొట్టాడు. 11 అప్పుడు ప్రజలందరి ఎదుట హనన్యా ఇలా అన్నాడు: “యెహోవా చెప్పేదేమిటంటే, బబులోను రాజు నెబుకద్‌నెజరు ఉంచిన కాడిని నేను రెండేళ్ళలోగా అన్ని జనాల మెడలపైనుంచి ఈవిధంగా తీసి విరగగొట్టివేస్తాను.” అది విని యిర్మీయాప్రవక్త తన దారిన వెళ్ళాడు.
12 హనన్యాప్రవక్త యిర్మీయాప్రవక్త మెడమీదనుంచి కాడిమ్రానును తీసి విరగగొట్టిన కొద్దికాలానికి యెహోవానుంచి ఈ వాక్కు యిర్మీయాకు వచ్చింది: 13 “వెళ్ళి హనన్యాతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నీవు కొయ్య కాడిని విరగగొట్టావు. ఆ విధంగా దానికి బదులు నీవు ఇనుప కాడిని చేయించావు. 14 ఇస్రాయేల్‌యొక్క దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: ఈ జనాలన్నీ బబులోను రాజు నెబుకద్‌నెజరుకు సేవ చేయాలని నేను వాటి మెడమీద ఇనుప కాడిని ఉంచుతాను. అవి అతడికి సేవ చేసి తీరుతాయి. భూమిమీద తిరిగే జంతువులను కూడా అతడి వశం చేస్తాను.”
15 అప్పుడు యిర్మీయాప్రవక్త హనన్యాప్రవక్తతో “హనన్యా, విను! యెహోవా నిన్ను పంపలేదు. నీవు ఈ ప్రజచేత అబద్ధాన్ని నమ్మించావు. 16 గనుక యెహోవా చెప్పేదేమిటంటే, నేను నిన్ను భూతలంమీద లేకుండా చేయబోతున్నాను. నీవు యెహోవాకు వ్యతిరేకంగా తిరుగుబాటు మాటలు పలికావు గనుక ఈ సంవత్సరమే నీవు చచ్చిపోతావు.” 17 ఆ సంవత్సరమే ఏడో నెలలో హనన్యాప్రవక్త మృతి చెందాడు.