27
1 యూదా రాజు యోషీయా కొడుకు సిద్కియా పరిపాలన ఆరంభంలో యెహోవానుంచి యిర్మీయాకు వాక్కు వచ్చింది. 2 యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నీకోసం కాడిమ్రాను, పలుపులు తయారు చేసుకొని నీ మెడమీద పెట్టుకో. 3 ఎదోం, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను దేశాల రాజులదగ్గరనుంచి రాయబారులు యూదా రాజు సిద్కియాదగ్గరికి వచ్చారు. ఈ రాయబారులచేత ఆ రాజులకు మాట చెప్పి పంపించు. 4 వాళ్ళ యజమానులకు తెలియజేయుమని ఇలా ఆదేశించు:
“ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, మీ యజమానులకు ఇలా తెలియజేయండి: 5 నేను చాచిన చేతితో, నా గొప్ప బలంచేత భూమినీ భూమిమీద ఉన్న మానవకోటినీ జంతురాశినీ సృజించాను. భూమిని ఎవరికివ్వడం యుక్తమని నాకు తోస్తే వారికిస్తాను. 6 ఇప్పుడు ఈ దేశాలన్నిటినీ నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్‌నెజరుకు ఇస్తున్నాను. భూమిమీద తిరిగే జంతువులను కూడా అతడి వశం చేస్తున్నాను. 7 ఈ జనాలన్నీ అతడికీ, అతడి కొడుకుకూ అతడి మనుమడికీ సేవ చేస్తాయి. అతడి దేశానికి శిక్ష కాలం వచ్చేవరకూ అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అనేక జనాలు, గొప్ప రాజులు ఆ దేశాన్ని లోపరచుకొంటారు.
8 “ఒకవేళ ఒక జనం, ఒక రాజ్యం బబులోను రాజైన నెబుకద్‌నెజరుకు సేవ చేయకపోతే, ఆ రాజు ఉంచిన కాడిక్రింద మెడ వంచకపోతే, నేను ఆ జనాన్ని దండిస్తాను. అతడిచేత నాశనం చేయించేవరకు ఆ జనాన్ని ఖడ్గానికీ కరవుకూ ఘోరమైన అంటురోగానికీ గురి చేస్తాను. ఇది యెహోవా వాక్కు. 9 గనుక ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అంటూ మీ ప్రవక్తలు, సోదెగాండ్రు, కలల భావం చెప్పేవాళ్ళు, శకునాలు చూచేవాళ్ళు, మాంత్రికులు చెప్పిన మాట మీరు వినకూడదు. 10 వాళ్ళు పరవశులై పలికేదంతా అబద్ధం. తత్‌ఫలితంగా మీరు మీ దేశాలనుంచి దూరంగా తొలగించబడతారు. నేను మిమ్ములను పారదోలుతాను. మీరు నాశనమవుతారు. 11 అయితే ఏ జనమైనా బబులోను రాజు ఉంచే కాడిక్రింద మెడ వంచి అతడికి సేవ చేస్తే, ఆ జనాన్ని నేను దాని సొంత భూమిలో ఉండనిస్తాను. వాళ్ళు దానిని సాగు చేస్తూ దానిలోనే కాపురముంటారు. ఇది యెహోవా వాక్కు.”
12 నేను యూదా రాజైన సిద్కియాకు అదే సందేశం చెప్పాను, “బబులోను రాజు ఉంచిన కాడిక్రింద మెడ వంచి అతడికి, అతడి ప్రజలకు సేవ చేయండి. మీరు అలా చేస్తే బ్రతుకుతారు. 13 బబులోను రాజుకు సేవ చేయని జనం ఖడ్గానికీ కరవుకూ అంటురోగానికీ గురి అవుతుందని యెహోవా హెచ్చరించాడు. నీవు, నీ ప్రజలు వాటికి గురి అయి చావడం ఎందుకని? 14 ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని ప్రవక్తలు మీతో చెప్పిన మాటలు వినవద్దు. ఎందుకంటే వాళ్ళు పరవశులై పలికేదంతా అబద్ధం. 15 యెహోవా చెప్పేదేమిటంటే, నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళు నా పేర అబద్ధాలు పలుకుతూ ఉన్నారు. అందుచేత నేను మిమ్ములను వెళ్ళగొట్టివేస్తాను. మీరు, మీతో పలుకుతున్న ప్రవక్తలు నాశనం అవుతారు” అన్నాను.
16 తరువాత నేను యాజులతో, ఈ ప్రజలందరితో ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా ఆలయం పాత్రలను బబులోనునుంచి తిరిగి తేవడం త్వరలోనే జరుగుతుంది’ అని మీతో మీ ప్రవక్తలు పలుకుతున్నారు. వాళ్ళ మాటలు వినవద్దు. వాళ్ళు పరవశులై పలికేది అబద్ధం. 17 వాళ్ళ మాటలు వినవద్దు. మీరు బబులోను రాజుకు సేవ చేస్తే బ్రతుకుతారు. అలా చేయండి. ఈ నగరం ఎందుకు పాడైపోవాలి? 18 వాళ్ళు ప్రవక్తలైతే, యెహోవా వాక్కు వాళ్ళతో ఉంటే, యెహోవా ఆలయంలో, యూదా రాజు నగరులో, జెరుసలంలో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలిపోకుండా వాళ్ళు సేనలప్రభువు యెహోవాను ప్రాధేయపడి అడగాలి. 19 బబులోను రాజు, యూదా రాజైన యెహోయాకీం కొడుకు యెకొన్యానూ యూదాలో, జెరుసలంలో ఉన్న అధికారులందరినీ జెరుసలంనుంచి బబులోనుకు పట్టుకుపోయినప్పుడు, 20 అతడు ఈ నగరంలో విడిచిపోయిన స్తంభాలు, కంచుసరస్సు, పీఠాలు, ఇతర పాత్రలను గురించి సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు: 21 ఇస్రాయేల్‌యొక్క దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, యెహోవా ఆలయంలో, యూదా రాజు నగరులో, జెరుసలంలో మిగిలిన పాత్రలను బబులోనుకు తీసుకుపోవడం జరుగుతుంది. 22 నేను వాటికోసం అక్కడికి వెళ్ళే రోజువరకు అవి అక్కడే ఉంటాయి. అప్పుడు నేను వాటిని మళ్ళీ తెప్పించి ఈ స్థలంలో ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.”