26
1 ✽యూదా రాజైన యోషీయా కొడుకు యెహోయాకీం పరిపాలన ఆరంభంలో యెహోవానుంచి ఈ వాక్కు వచ్చింది: 2 “యెహోవా చెప్పేదేమిటంటే, నీవు యెహోవా ఆలయం ఆవరణంలో నిలబడివుండు; యెహోవా ఆలయంలో ఆరాధించడానికి యూదా పట్టణాలన్నిటినుంచీ ప్రజలు వస్తూ ఉంటే, చెప్పమని నేను నీకిచ్చిన మాటలన్నీ✽ వారికి ప్రకటించు. వాటిలో ఒక్క మాట కూడా విడిచిపెట్టకు. 3 ఒకవేళ వారు విని, ఒక్కొక్కరు తమ చెడ్డ త్రోవలనుంచి మళ్ళితే, వాళ్ళ చెడ్డ పనులకారణంగా నేను వాళ్ళమీదికి రప్పిస్తాననుకొన్న విపత్తు విషయం జాలిపడతాను, దానిని రప్పించకుండా ఉంటాను. 4 నీవు వాళ్ళతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నా మాటలు వినకపోతే, నేను మీకు నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించకపోతే, 5 నేను పొద్దున్నే లేచి మీదగ్గరికి పంపిన నా సేవకులైన ప్రవక్తల మాటలు మీరు వినకపోతే (ఇదివరకు మీరు పెడచెవిని పెట్టారు), 6 నేను ఈ ఆలయాన్ని షిలోహు✽లాగా చేస్తాను. భూమిమీద ఉన్న అన్ని దేశాలవారికీ ఈ నగరాన్ని శాపంగా చేస్తాను.”7 యిర్మీయా యెహోవా ఆలయంలో ఈ మాటలు పలుకుతూ ఉండగా యాజులు, ప్రవక్తలు, ప్రజలంతా విన్నారు. 8 ✽అయితే యిర్మీయా యెహోవా చెప్పమని తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ ప్రజలందరికీ చెప్పడం ముగించాక, యాజులు, ప్రవక్తలు, ప్రజలంతా అతణ్ణి పట్టుకొన్నారు, “నీవు చావాలి! 9 ఈ ఆలయం షిలోహులాగా అవుతుందనీ ఈ నగరం నిర్జనమై పాడైపోతుందనీ నీవెందుకు యెహోవా పేర పలుకుతున్నావు?” అన్నారు. యెహోవా ఆలయంలో ప్రజలంతా యిర్మీయా చుట్టూ గుమికూడారు.
10 ✽యూదా అధికారులు ఈ విషయం విన్నారు. వెంటనే వాళ్ళు రాజు నగరునుంచి యెహోవా ఆలయానికి వచ్చి, యెహోవా ఆలయం “క్రొత్త ద్వారం” ప్రవేశంలో ఆసీనులు అయ్యారు. 11 ✽అప్పుడు యాజులూ ప్రవక్తలూ అధికారులతో, ప్రజలందరితో “ఈ మనిషి ఈ నగరానికి వ్యతిరేకంగా ప్రవక్తగా ప్రకటించాడు. మీరు చెవులారా విన్నారు గదా. వాడికి మరణశిక్ష విధించాలి” అన్నారు.
12 ✽అందుకు యిర్మీయా అధికారులందరితో, ప్రజలతో ఇలా చెప్పాడు: “మీరు విన్న మాటలన్నీ యెహోవా నన్ను ఈ ఆలయానికీ నగరానికీ వ్యతిరేకంగా దైవావేశపూర్వకంగా ప్రకటించుమని నన్ను పంపాడు. 13 గనుక ఇప్పుడైనా మీ త్రోవలనూ ప్రవర్తననూ సరిదిద్దుకోండి. మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అలా చేస్తే, యెహోవా మీమీదికి తేవాలనుకొన్న ఆపద రాకుండా చేస్తాడు. జాలిపడుతాడు. 14 నా సంగతి అంటారా? నేనైతే ఇదిగో, మీ చేతుల్లో ఉన్నాను. మీకు ఏది మంచిదీ న్యాయమైనదీ అని తోస్తే అది చేయండి. 15 అయితే ఒక విషయం బాగా తెలుసుకోండి – ఈ మాటలన్నీ మీరు వినేలా చెప్పడానికి నిజంగా యెహోవా నన్ను పంపాడు గనుక మీరు నన్ను చంపితే నిర్దోషి రక్తాపరాధం మీమీదికీ ఈ నగరంమీదికీ ఇక్కడి కాపురస్థులమీదికీ తెచ్చుకొన్న వారవుతారు.”
16 ✽అప్పుడు అధికారులు, ప్రజలందరూ యాజులతో, ప్రవక్తలతో ఇలా అన్నారు: “ఈ మనిషి మన దేవుడైన యెహోవా పేర మనతో మాట్లాడాడు గనుక ఇతడు మరణశిక్షకు తగినవాడు కాడు.”
17 ✽దేశంలో పెద్దల్లో కొంతమంది లేచి అక్కడ సమకూడిన ప్రజలందరితో ఇలా చెప్పారు: 18 “యూదా రాజైన హిజ్కియా రోజుల్లో మోరషతు గ్రామంవాడైన మీకా ప్రవక్తగా పలికాడు, సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
సీయోనును పొలంలాగా దున్నడం జరుగుతుంది.
జెరుసలం పాడు దిబ్బలు అవుతుంది.
ఆలయమున్న పర్వతం అడవి కొండలాగా అవుతుంది”
అని యూదా ప్రజలందరితో చెప్పాడు.
19 యూదా రాజు హిజ్కియా గానీ, యూదాప్రజలు గానీ అతణ్ణి చంపారా? హిజ్కియా యెహోవాకు భయపడి, దయ చూపమని యెహోవాను ప్రాధేయపడ్డాడు గదా. వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పిన ఆపద విషయం యెహోవా జాలిపడి ఆ ఆపదను రప్పించలేదు గదా. అయితే మనకు మనమే గొప్ప కీడు కొనితెచ్చుకుంటున్నాం!”
20 ✽(కిర్యత్‌యారీం పురవాసి షెమయా కొడుకు ఊరియా కూడా ప్రవక్తగా యెహోవా పేర పలికేవాడు. అతడు ఈ నగరానికీ ఈ దేశానికీ వ్యతిరేకంగా పలికినది యిర్మీయా మాటలలాంటివే. 21 యెహోయాకీం రాజు, అతడి యుద్ధ వీరులందరూ, అధికారులందరూ ఆ విషయం విన్నప్పుడు రాజు అతణ్ణి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఊరియా దానిని గురించి విని, భయంతో ఈజిప్ట్‌కు పారిపోయాడు. 22 అయితే యెహోయాకీంరాజు, అక్బోరు కొడుకైన ఎల్‌నాతానునూ అతడితోకూడా మరి కొంతమందినీ ఈజిప్ట్‌కు పంపాడు. 23 వాళ్ళు అతణ్ణి ఈజిప్ట్‌నుంచి యెహోయాకీంరాజు దగ్గరికి పట్టుకువచ్చారు. రాజు అతణ్ణి ఖడ్గంతో హతం చేయించాడు. అతడి మృతదేహాన్ని సామాన్య ప్రజల సమాధుల మధ్య పారవేయించాడు.)
24 ✽అయినా షాఫాను కొడుకు అహీకాం యిర్మీయాకు సహాయపడ్డాడు, గనుక వాళ్ళు అతణ్ణి చంపడానికి ప్రజలకు అప్పగించలేదు.