25
1 ✽యోషీయా కొడుకూ, యూదా రాజూ అయిన యెహోయాకీం పరిపాలించిన నాలుగో సంవత్సరంలో (బబులోను రాజైన నెబుకద్‌నెజరు పరిపాలనలో మొదటి సంవత్సరం), యూదా ప్రజలందరిని గురించిన వాక్కు యిర్మీయాకు వచ్చింది. 2 ఆ వాక్కు యిర్మీయాప్రవక్త యూదాప్రజలందరికీ జెరుసలం కాపురస్థులందరికీ ప్రకటించాడు. అదేమిటంటే, 3 ఆమోను కొడుకూ, యూదా రాజూ అయిన యోషీయా పరిపాలించిన పదమూడో సంవత్సరంనుంచి ఈ రోజువరకు – ఇరవై మూడేళ్ళు – యెహోవానుంచి వాక్కులు నాకు వస్తూ ఉన్నాయి. నేను వాటిని ప్రొద్దున్నే లేచి మీకు ప్రకటిస్తూ వచ్చాను గాని, మీరు పెడచెవిని పెట్టారు. 4 అంతేగాక యెహోవా తనకు సేవ చేసే తన ప్రవక్తలందరినీ పొద్దున్నే లేచి పంపిస్తూ వచ్చాడు. అయినా మీరు వినలేదు, చెవిని పెట్టలేదు. 5 వారు అన్నారు గదా, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడ్డ త్రోవలనుంచి, మీ దురాచారాలనుంచి మళ్ళండి. యెహోవా మీకూ మీ పూర్వీకులకూ శాశ్వతమైన ఈవిగా ప్రసాదించిన ఈ దేశంలో మీరు ఉండేలా చేయండి. 6 ✽ఇతర దేవుళ్ళను, దేవతలను అనుసరించవద్దు, పూజించవద్దు, సేవించవద్దు. మీరు చేతులతో చేసినవాటిచేత నన్ను విసికించవద్దు. అప్పుడు నేను మీకు ఏమీ హాని చేయను.7 “అయితే మీరు నా మాట✽ వినలేదు. మీరు చేతులతో చేసిన✽ వాటిమూలంగా నన్ను విసికించి, మీకు మీరే హాని✽ కొనితెచ్చుకొన్నారు” అని యెహోవా అంటున్నాడు. 8 అందుచేత✽ సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు నా మాటలు వినలేదు, 9 గనుక నేను ఉత్తర దిక్కున✽ ఉన్న జాతులన్నిటినీ నా సేవకుడూ✽ బబులోను రాజూ నెబుకద్‌నెజరునూ పిలవనంపిస్తాను. ఈ దేశంమీదికీ ఇక్కడివాళ్ళమీదికీ దీని చుట్టూరా ఉన్న జనాలమీదికీ వారిని రప్పిస్తాను. నేను ఇక్కడివారిని పూర్తిగా నాశనం చేస్తాను. వారిని అసహ్యకారణంగా చేస్తాను. తిరస్కారానికీ శాశ్వత నాశనానికీ గురి చేస్తాను.
10 “సంతోషానందాల ధ్వనులూ, పెండ్లికొడుకుల, పెండ్లికూతుళ్ళ స్వరమూ, తిరగటిరాళ్ళు చేసే చప్పుడూ, దీపాల వెలుగూ వారి మధ్య లేకుండా చేస్తాను. 11 ఈ దేశమంతా పాడైపోతుంది, శిథిలాలవుతుంది✽. ఈ జనాలు✽ బబులోను రాజుకు డెబ్భై ఏళ్ళు✽ సేవ చేస్తారు.”
12 ✽ యెహోవా ఇంకా అన్నాడు: “ఆ డెబ్భై ఏళ్ళు గడిచిన తరువాత, నేను బబులోను రాజునూ, ఆ జనాన్నీ, కల్దీయదేశాన్నీ వాళ్ళ అపరాధాలకారణంగా దండిస్తాను. ఆ దేశాన్ని ఎప్పటికీ పాడుగా ఉండేలా చేస్తాను. 13 ✝నేను ఆ దేశానికి వ్యతిరేకంగా చెప్పిన మాటలన్నిటి ప్రకారం దానిపట్ల నెరవేరుస్తాను. ఆ సంగతులన్నీ ఈ గ్రంథంలో వ్రాసివున్నాయి. వాటిని యిర్మీయా జాతులన్నిటికీ వ్యతిరేకంగా దైవావేశ పూర్వకంగా పలికాడు. 14 బబులోనువాళ్ళ పనులకూ, వాళ్ళు చేతులతో చేసినవాటికీ అనుగుణంగా వాళ్ళకు ప్రతీకారం✽ చేస్తాను. అనేక దేశాలవాళ్ళు✽, గొప్ప రాజులు వాళ్ళను తమకు దాసులుగా చేస్తారు.”
15 ✽ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా చేతిలోని ఈ ద్రాక్షరసం పాత్ర కోపంతో నిండి ఉంది. నీవు దానిని చేతపట్టుకో. నేను నిన్ను పంపిన జనాలన్నిటిచేతా అది త్రాగించు. 16 దానిని త్రాగి వాళ్ళు తూలుతూ పిచ్చివారిలాగా అయిపోతారు. దానికి కారణం నేను వాళ్ళమధ్యకు పంపిన ఖడ్గం.”
17 ✽ అలాగే యెహోవా చేతిలో ఉన్న ఆ పాత్రను నేను చేతపట్టుకొన్నాను, యెహోవా నన్ను పంపిన జనాలన్నిటిచేతా అది త్రాగించాను. 18 జెరుసలంనూ, యూదా పట్టణాలనూ, వాటి రాజులనూ, అధికారులనూ, త్రాగేలా చేశాను. వారూ అవీ నాశనమై, అసహ్యకారణంగా ఉండి, తిరస్కారానికీ శాపానికీ గురి కావాలని యెహోవా సంకల్పించాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది.
19 నేను త్రాగేలా చేసిన ఇతరులెవరంటే, ఈజిప్ట్‌రాజు ఫరో, అతడి పరివారం, అధికారులు, అతడి ప్రజలంతా, అక్కడ ఉన్న విదేశీయులంతా; 20 ✝ఊజు దేశం రాజులందరూ; ఫిలిష్తీయ దేశం రాజులందరూ (అష్కెలోను రాజు, గాజా రాజు, ఎక్రోను రాజు, అష్డోదులో మిగిలినవాళ్ళ రాజు); 21 ఎదోంవాళ్ళు, మోయాబువాళ్ళు, అమ్మోను సంతతివాళ్ళు; 22 తూరుదేశం రాజులంతా; సీదోనునగర రాజులంతా; సముద్రం అవతలి తీరాల రాజులు; 23 దదానువాళ్ళు, తేమావాళ్ళు, బూజువాళ్ళు, గడ్డం ప్రక్కలు గొరిగించుకొన్న వారంతా; 24 అరేబియా రాజులంతా, ఎడారిలో ఉంటున్న విదేశీ రాజులంతా; 25 జిమ్రీ, ఏలాం, మాదీయ రాజులందరూ; 26 ✽ఉత్తర దిక్కున దగ్గరగా, దూరంగా ఉన్న రాజులందరూ – ఒకడి తరువాత ఒకడు, భూమిమీద ఉన్న లోక రాజ్యాలన్నీ ఆ పాత్రలోది త్రాగేలా చేశాను. వాళ్ళ తరువాత త్రాగవలసినది షీషక్✽ రాజు.
27 “అప్పుడు నీవు వాళ్ళకు ఇలా చెప్పాలి: ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, త్రాగండి✽! మత్తెక్కేవరకు త్రాగి కక్కండి! నేను మీమధ్యకు పంపించే ఖడ్గంవల్ల పడి, ఇక ఎప్పటికీ లేవకుండా ఉండండి! 28 ✽వాళ్ళు నీ చేతిలో ఉన్న పాత్రను చూచి ‘త్రాగము’ అంటే, నీవు వాళ్ళతో ఇలా చెప్పు: సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీరు త్రాగితీరాలి. 29 ఇదిగో, నా పేరు ఉన్న నగరం✽ మీదికి విపత్తు రప్పించడం ఆరంభం చేస్తున్నాను. మీరు దండన తప్పించుకొంటాం అనుకొంటున్నారా? మీరు తప్పించుకోరు. ఎందుకంటే భూమిమీద ఉంటున్న వాళ్ళందరిమీదికీ నేను ఖడ్గం రప్పిస్తున్నాను. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.
30 ✽“గనుక నీవు వాళ్ళకు వ్యతిరేకంగా ఈ మాటలన్నీ ప్రకటించి చెప్పాలి:
యెహోవా పైనుంచి గర్జిస్తాడు.
తన పవిత్ర నివాసంనుంచి స్వరమెత్తి పలుకుతాడు.
తన దేశానికి వ్యతిరేకంగా ఆయన బిగ్గరగా గర్జిస్తాడు.
ద్రాక్షగానుగ తొట్టి త్రొక్కేవాళ్ళలాగా కేకలు వేస్తాడు.
భూమిమీద నివాసముంటున్న వాళ్ళందరికీ
వ్యతిరేకంగా కేకలు వేస్తాడు.
31 ఆ ఘోష భూమి కొనలవరకూ చేరుతుంది.
ఎందుకంటే, యెహోవా జనాలమీద నేరారోపణ చేస్తాడు,
మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు,
దుర్మార్గులను ఖడ్గానికి గురి చేస్తాడు.
ఇది యెహోవా వాక్కు.”
32 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“ఇదిగో! ఒక జనం దగ్గరనుంచి ఇంకో జనందగ్గరికి
కీడు వ్యాపిస్తూ ఉంది.
భూమి అంచులనుంచి గొప్ప తుఫాను చెలరేగుతుంది.
33 ఆ రోజు యెహోవాచేత హతం అయినవాళ్ళు
భూమి ఆ కొననుంచి ఈ కొనవరకు ఉంటారు.
వాళ్ళకోసం ఎవరూ ఏడవరు. వాళ్ళను పోగు చేయరు,
పాతిపెట్టరు. భూతలంమీద పెంటలాగా
వాళ్ళు పడి ఉంటారు.”
34 కాపరులారా! ఏడ్వండి! కేకలు పెట్టండి!
మందలో నాయకులారా! బూడిదలో పొర్లాడండి!
ఎందుకంటే, మీరు హతమయ్యే రోజులు వచ్చాయి.
మీరు చెదరిపోయే రోజులు వచ్చాయి.
ప్రశస్త పాత్రలాగా మీరు పడుతారు.
35 ఈ కాపరులకు దాక్కోవడానికి చోటు ఉండదు.
36 కాపరుల కేకలు, మంద నాయకుల ఏడుపు
వినబడుతూ ఉన్నాయి!
యెహోవా వాళ్ళ పచ్చిక మైదానాల్ని
నాశనం చేస్తున్నాడు.
37 ప్రశాంతంగా ఉన్న మైదానాలు యెహోవా
కోపాగ్నికి పాడైపోతున్నాయి.
38 గుహలోనుంచి సింహం వచ్చినట్టు
ఆయన బయలుదేరాడు.
దౌర్జన్యపరుల ఖడ్గం చేత, యెహోవా కోపాగ్నికి,
వాళ్ళ దేశం పాడైపోతుంది.