24
1 బబులోను రాజు నెబుకద్‌నెజరు వచ్చి యూదా రాజూ, యెహోయాకీం కొడుకూ అయిన యెకొన్యానూ, యూదా అధిపతులనూ, శిల్పకారులనూ, స్వర్ణకారులనూ బందీలుగా బబులోనుకు తీసుకుపోయిన తరువాత జరిగినదేమంటే, యెహోవా ఆలయం ముందు ఉన్న రెండు గంపలను యెహోవా నాకు చూపించాడు. వాటిలో అంజూరుపండ్లు ఉన్నాయి. 2 ఒక గంపలో ముందు మగ్గిన మంచి అంజూరుపండ్లు ఉన్నాయి. రెండో గంపలో తినడానికి వీలు కాని, చాలా చెడిపోయిన అంజూరుపండ్లు ఉన్నాయి.
3 “యిర్మీయా! నీకేమి కనిపిస్తున్నది?” అని యెహోవా నన్ను అడిగాడు.
అందుకు నేను “అంజూరుపండ్లు కనిపిస్తున్నాయి. మంచివైతే చాలా మంచిగా ఉన్నాయి. చెడ్డవైతే చాలా చెడిపోయినవి – అవి నోట పెట్టడానికి వీలు కాదు” అని జవాబిచ్చాడు.
4 అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 5 “ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, వారికి మేలు కలగాలని యూదావారిలో కొంతమందిని బందీలుగా ఈ స్థలంనుంచి కల్దీయదేశానికి పంపించాను. వారిని ఈ మంచి అంజూరు పండ్లక్రింద పరిగణిస్తాను. 6 వారికి మేలు కలిగిద్దామని చూస్తూ ఉంటాను. వారిని ఈ దేశానికి మళ్ళీ తీసుకువస్తాను. వారికి అభివృద్ధి కలిగిస్తాను గాని, వారిని పెరికివేయను. 7 నేనే యెహోవానని నన్ను తెలుసుకొనే మనసు వారిలో పుట్టిస్తాను. వారు హృదయ పూర్వకంగా నావైపు తిరుగుతారు, గనుక వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.
8 “అయితే తినడానికి వీలు కాకుండా చెడిపోయిన అంజూరుపండ్ల విషయం యెహోవా చెప్పేదేమిటంటే, యూదా రాజైన సిద్కియానూ, అతడి అధికారులనూ, జెరుసలం కాపురస్థులలో మిగిలిపోయి ఈ దేశంలో గానీ ఈజిప్ట్‌లో గానీ ఉన్నవాళ్ళనూ వాటిలాగా భావించుకొంటాను. 9 నేను వాళ్ళను వెళ్ళగొట్టబోయే లోకరాజ్యాలన్నిటిలోనూ అన్ని స్థలాలలోనూ ప్రజలకు భయకారణంగా అసహ్య కారణంగా చేస్తాను. వాళ్ళను నిందకూ, ఎగతాళికీ, శాపానికీ గురి చేస్తాను. వాళ్ళను లోకోక్తిగా అయ్యేలా చేస్తాను. 10 నేను వాళ్ళకూ వాళ్ళ పూర్వీకులకూ ఇచ్చిన ఈ దేశంలో వాళ్ళు ఉండకుండా పోయేవరకూ వాళ్ళమీదికి ఖడ్గాన్ని, కరవును, ఘోరమైన అంటురోగాన్ని రప్పిస్తాను.”