23
1 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “నా మంద గొర్రెలను నాశనం చేస్తూ, చెదరగొట్టివేస్తూ ఉన్న కాపరులకు బాధ తప్పదు. 2 నా ప్రజను పోషించవలసిన కాపరులకు ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా ఇలా చెపుతున్నాడు: మీరు నా మందను చెదరగొట్టారు, వెళ్ళగొట్టారు. వాళ్ళ సంగతి పట్టించుకోకుండా ఉన్నారు. మీరు చేసిన చెడ్డ పనుల కారణంగా నేను మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు. 3 ✽నేను నా మందలో ఉన్న మిగతావారిని పారదోలిన అన్ని దేశాలనుంచి సమకూరుస్తాను. వారి పచ్చిక మైదానాలకు వారిని తిరిగి తీసుకువస్తాను. వారు వృద్ధి చెందుతారు. వారి సంఖ్య పెరుగుతుంది. 4 వారిని సంరక్షించే కాపరులను వారిమీద నియమిస్తాను. అప్పటినుంచి వారు భయపడరు, హడలిపోరు. వారిలో ఒక్కరు కూడా లేకుండా పోరు. ఇది యెహోవా వాక్కు.5 యెహోవా చెప్పేదేమిటంటే,
“రాబోయే కాలంలో నేను దావీదు వంశంలో
న్యాయవంతుడైన ‘కొమ్మ✽’ను పుట్టిస్తాను.
ఆయన రాజై తెలివిగా పరిపాలన చేస్తాడు.
లోకంలో నీతిన్యాయాలను జరిగిస్తాడు.
6 ✽ఆయన రోజులలో యూదావారికి రక్షణ కలుగుతుంది,
ఇస్రాయేల్‌వారు నిర్భయంగా నివాసం చేస్తారు.
ఆయనను ఈ పేరుతో పిలుస్తారు,
‘యెహోవాయే మనకు నీతిన్యాయాలు✽’.”
7 ✝యెహోవా చెప్పేదేమిటంటే, “గనుక ఒక కాలం వస్తుంది. ఆ కాలంలో ‘ఇస్రాయేల్‌ప్రజను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అంటూ శపథం చేయరు 8 గాని, ‘ఉత్తర దేశంనుంచి, తాను ఇస్రాయేల్ వంశంవారిని చెదరగొట్టిన అన్ని దేశాలనుంచి తీసుకువచ్చిన యెహోవాతోడు’ అంటూ శపథం చేస్తారు. ఆ కాలంలో ఇస్రాయేల్‌వారు సొంత దేశంలో నివాసం చేస్తారు.”
9 ✽ఇది ప్రవక్తల విషయం –
యెహోవా కారణంగా ఆయన పవిత్ర వాక్కుల కారణంగా
నా గుండె పగిలిపోయింది,
నాలో ఉన్న ఎముకలన్నీ కదులుతున్నాయి.
నేను మత్తుగా త్రాగిన మనిషిలాగా,
ద్రాక్షమద్యం వశమైనవాడులాగా ఉన్నాను.
10 దేశం నిండా వ్యభిచారులు ఉన్నారు.
శాపంక్రింద ఉండి దేశం దుఃఖిస్తూ ఉంది.
ఎడారిలో పచ్చిక మైదానాలు ఎండిపోయాయి.
ప్రవక్తలు చెడ్డగా ప్రవర్తిస్తున్నారు.
తమ బలం అక్రమానికి దుర్వినియోగిస్తూ ఉన్నారు.
11 ✽“ప్రవక్తలూ యాజులూ భక్తిలేనివాళ్ళు.
నా ఆలయంలో కూడా వాళ్ళు చెడుగు చేస్తూ ఉంటే
నేను చూశాను. ఇది యెహోవా వాక్కు.
12 ✝అందుచేత వాళ్ళది జారుడు త్రోవ అవుతుంది.
వాళ్ళు చీకటిలోకి గెంటివేయబడి దానిలో పడిపోతారు.
వాళ్ళకు వచ్చే దండన సంవత్సరం✽లో నేను
వాళ్ళమీదికి విపత్తు రప్పిస్తాను. ఇది యెహోవా వాక్కు.
13 ✽షోమ్రోనులో ఉన్న ప్రవక్తల మధ్య తెలివితక్కువ
పని జరగడం నేను చూశాను –
వాళ్ళు బయల్✽దేవుడి మూలంగా పలికి,
నా ప్రజలైన ఇస్రాయేల్‌వారిని తప్పుదారిలోకి నడిపించారు.
14 ✽జెరుసలంలో ఉన్న ప్రవక్తలమధ్య ఘోరమైనది
జరగడం నేను చూశాను.
వాళ్ళు యథార్థంగా ప్రవర్తించక, వ్యభిచారం చేస్తున్నారు.
ప్రతి ఒక్కడూ తన చెడుగును విడిచిపెట్టకుండా
దుర్మార్గులను బలపరుస్తున్నారు.
జెరుసలం కాపురస్థులు గొమొర్రావాళ్ళలాగే ఉన్నారు.”
15 గనుక సేనలప్రభువు యెహోవా✽ ఆ ప్రవక్తలను గురించి
ఇలా చెపుతున్నాడు:
“వాళ్ళకు తినడానికి చేదుకూరలు ఇస్తాను,
త్రాగడానికి విష జలం ఇస్తాను.
ఎందుకంటే, జెరుసలంలో ఉన్న ప్రవక్తల
భక్తిహీనత దేశమంతటా వ్యాపించింది.”
16 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే,
“మీతో పలికే ప్రవక్తల మాటలు వినవద్దు.
వాళ్ళు మిమ్మల్ని వట్టి ఆశాభావం✽తో నింపుతారు.
వాళ్ళు పలుకుతున్నది నా నోటినుంచి
వచ్చినది కాదు గాని, తమ మానసిక✽ దర్శనాలే.
17 నన్ను తృణీకరించేవాళ్ళతో వారు
‘మీకు క్షేమంగానే ఉంటుందని యెహోవా
చెపుతున్నాడు’ అంటారు.
తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించి
ప్రవర్తించేవాళ్ళతో ‘మీమీదికి ఏమీ కీడు రాదు’ అంటారు.
18 ✽అయితే యెహోవా సందేశం విని గ్రహించడానికి
వాళ్ళలో ఎవరు యెహోవా ఆలోచనసభలో నిలబడ్డారు?
ఎవరు ఆయన వాక్కులు విని పట్టించుకొన్నారు?
19 ఇదిగో, వినండి! యెహోవా ఆగ్రహం
తుఫానులాగా బయలుదేరింది.
అది తీవ్రమైన సుడిగాలిలాగా దుర్మార్గుల నెత్తిన
విరుచుకు పడుతుంది.
20 యెహోవా తన మనసులో ఉన్న ఆలోచనలను
నెరవేర్చి సాధించేవరకూ,
ఆయన కోపం వెనక్కు మళ్ళదు.
చివరి రోజుల్లో మీరు ఈ విషయం బాగా తెలుసుకొంటారు.
21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు.
అయినా వాళ్ళు పరుగెత్తారు.
నేను వాళ్ళతో మాట్లాడలేదు.
అయినా వాళ్ళు ప్రవక్తలలాగా పలికారు.
22 ✽ఒకవేళ వాళ్ళు నా ఆలోచనసభలో నిలబడి ఉంటే,
నా వాక్కులు నా ప్రజకు ప్రకటించి ఉంటే నా ప్రజ పట్టిన
చెడ్డ త్రోవనుంచీ వాళ్ళు చేస్తున్న చెడుగునుంచీ
వారిని మళ్ళించి ఉండేవారే.
23 ✽“నేను దగ్గరలో మాత్రమే ఉన్న దేవుణ్ణా?
దూరంగా ఉన్న దేవుణ్ణి కానా?
24 నాకు కనబడకుండా ఎవరైనా చాటున దాగుకోగలరా?
అని యెహోవా అడుగుతున్నాడు.
నేను భూమిమీద, ఆకాశంలో అంతటా ఉన్నవాణ్ణి కానా?
అని యెహోవా అడుగుతున్నాడు.
25 ✽నా పేర పలికే ఆ ప్రవక్తలు ఏమేమి చెపుతున్నారో అది విన్నాను. ‘నాకు కల వచ్చింది! నాకు కల వచ్చింది!’ అంటున్నారు. 26 ఈ ప్రవక్తలు అబద్ధాలు పలుకుతున్నారు, తమ మనసుల్లో ఉన్న భ్రమను అనుసరించి పలుకుతున్నారు. వాళ్ళ మనసుల్లో ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది? 27 వారి పూర్వీకులు బయల్ దేవుడి పూజలో నిమగ్నులై నా పేరును మరచిపోయారు. అలాగే నా ప్రజ నా పేరును మరచిపోవాలని దురాలోచన చేస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు చెప్పే కలలమూలంగా అలా జరుగుతుందనుకొంటూ ఉన్నారు. 28 ✽కలగన్న ప్రవక్త తన కలను చెప్పవచ్చు. అయితే నా వాక్కు ఎవరికి ఉందో అతడు దానిని నమ్మకంగా చెప్పవచ్చు. ధాన్యంతో పొట్టుకు ఏమి పోలిక? ఇది యెహోవా వాక్కు.”
29 యెహోవా చెప్పేదేమిటంటే, “నా వాక్కు మంటలాంటిది కాదా? బండను ముక్కలు చేసే సుత్తెలాంటిది కాదా?”
30 ✽గనుక యెహోవా చెపుతున్నాడు, “ఒకడి దగ్గరనుంచి ఇంకొకడు నా వాక్కులు దొంగలించుకొన్న ప్రవక్తలకు నేను విరోధిని.” 31 ✽యెహోవా అంటున్నాడు, “సొంత మాటలు పలికి, ‘ఇది యెహోవా వాక్కు’ అని చెప్పే ప్రవక్తలకు నేను విరోధిని.” 32 ✽యెహోవా అంటున్నాడు, “ప్రవక్తగా వట్టి కలలు పలికేవాళ్ళకు నేను విరోధిని. అవి చెపుతూ, వాళ్ళ అబద్ధాలమూలంగా, గొప్పలు చెప్పడం మూలంగా నా ప్రజను తప్పుదారి పట్టిస్తున్నారు.” యెహోవా అంటున్నాడు, “నేను వాళ్ళను పంపలేదు, ఆదేశించనూ లేదు. వాళ్ళవల్ల ఈ ప్రజకు ఏమీ ప్రయోజనం కలగదు.”
33 ✽“ఈ ప్రజ గానీ, ప్రవక్త గానీ, యాజి గానీ ‘యెహోవా సందేశమేమిటి?’ అని నిన్ను అడిగితే, నీవు “ఏం సందేశం? మిమ్ములను చెదరగొట్టివేస్తానని యెహోవా చెపుతున్నాడు” అని వాళ్ళతో చెప్పు. 34 ప్రవక్త గానీ, యాజి గానీ, ప్రజలలో ఎవడైనా గానీ, ‘యెహోవా సందేశమ’ని చెపితే, నేను వాణ్ణి, వాడి కుటుంబాన్ని దండిస్తాను. 35 ‘యెహోవా ఇచ్చిన జవాబేమిటి?’ ‘యెహోవా ఏం చెప్పాడు?’ అని మీలో ఒక్కొక్కరు పొరుగువాళ్ళతో గానీ బంధువులతో గానీ చెపుతారు. 36 అయితే మీరు ‘యెహోవా సందేశం’ అనే మాటలు ఇకమీదట పలకవద్దు. ఎందుకంటే, ఎవడి మాట వాడికి సందేశం అవుతుంది. మీరు మీ దేవుని వాక్కులు – సజీవుడైన సేనలప్రభువు యెహోవాదేవుని వాక్కులు తారుమారు✽ చేశారు. 37 ‘యెహోవా నీకిచ్చిన జవాబేమిటి?’, ‘యెహోవా ఏం చెప్పాడు?’ అని మీరు ప్రవక్తను అడుగుతారు. 38 అయితే మీరు ‘ఇది యెహోవా సందేశం’ అని చెపితే, యెహోవా ఇలా చెప్పాడని తెలుసుకోండి: ‘యెహోవా సందేశం’ అని మీరు చెప్పకూడదని నేను మీకు చెప్పినా మీరు ‘యెహోవా సందేశం’ అంటున్నారు, 39 గనుక నేను మిమ్ములను విసర్జించి, మీకూ మీ పూర్వీకులకూ నేను ఇచ్చిన నగరాన్నీ మిమ్ములనూ నా ఎదుటనుంచి పారవేసితీరుతాను. 40 ఎప్పటికీ నిలిచి ఉండే నిందను, ఎన్నడూ మరపురాని శాశ్వతమైన అవమానాన్ని మీమీదికి రప్పిస్తాను.”