22
1 ✽ యెహోవా చెప్పేదేమిటంటే, “యూదా రాజు నగరుకు వెళ్ళి అక్కడ ఈ సందేశం ప్రకటించు: 2 దావీదు సింహాసనంమీద కూర్చుని ఉన్న యూదా రాజా! యెహోవా సందేశం విను. నీవు, నీ సిబ్బంది, ఈ ద్వారాలగుండా ప్రవేశించే నీ ప్రజలు వినాలి. 3 ✽ యెహోవా ఇలా అంటున్నాడు: నీతిన్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోచుకోబడ్డ వారిని దౌర్జన్యపరుల చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులను, తండ్రిలేని వారిని, వితంతువులను✽ బాధపెట్టకండి. వారిమీద దౌర్జన్యం చేయకండి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం ఒలికించకండి. 4 ✽మీరు ఈ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తే, అప్పుడు ఇలా జరుగుతుంది – దావీదు సింహాసనమెక్కే రాజులు ఈ నగరు ద్వారాలగుండా ప్రవేశిస్తారు. రథాలమీద, గుర్రాలమీద వస్తూ పోతూ ఉంటారు. వారివెంట వారి సిబ్బంది, వారి జనం వస్తారు. 5 కాని, మీరు ఈ ఆజ్ఞలను శిరసావహించకపోతే ఈ నగరు పాడైపోతుంది. నామీదే ఆనబెట్టి చెపుతున్నాను. ఇది యెహోవా వాక్కు.”6 ✽యూదా రాజు నగరును గురించి యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నాకు నీవు గిలాదు ప్రదేశం లాగా,
లెబానోను పర్వత శిఖరంలాగా ఉన్నావు.
అయినా నిన్ను ఎడారిలాగా,
ఎవ్వరూ కాపురం లేని పట్టణంలాగా చేసితీరుతాను.
7 నేను నీమీదికి రావడానికి వినాశకారులను
ప్రత్యేకిస్తాను. ఒక్కొక్కరు ఆయుధాలు
పట్టుకొని వస్తారు.
నీ మంచి దేవదారు మ్రానులను నరికివేసి
అగ్నిలో వేస్తారు.
8 ✝అనేక దేశాలవాళ్ళు ఈ నగరం ప్రక్కగా ప్రయాణం చేస్తూ, ఒకరితో ఒకరు ‘యెహోవా ఈ గొప్ప నగరాన్ని ఇలా చేయడం ఎందుకని?’ అని అడుగుతారు. 9 ‘ఎందుకంటే, వాళ్ళు తమ దేవుడు యెహోవా చేసిన ఒడంబడికను విసర్జించి ఇతర దేవుళ్ళను పూజించి సేవించారు’ అని జవాబిస్తారు.”
10 ✽చనిపోయినవాణ్ణి గురించి ఏడ్వవద్దు,
విలపించవద్దు.
వెళ్ళిపోయేవాణ్ణి గురించే బాగా ఏడ్వండి.
ఎందుకంటే అతడు మరెప్పుడూ తిరిగి రాడు,
తాను పుట్టిన దేశాన్ని చూడడు.
11 యూదా రాజైన యోషీయా కొడుకు షల్లూం తన తండ్రి స్థానంలో పరిపాలన చేసి, ఈ స్థలంనుంచి వెళ్ళిపోయిన తరువాత అతణ్ణి గురించి యెహోవా ఇలా చెప్పాడు: “అతడు ఇక్కడికి ఎన్నడూ తిరిగి రాడు. 12 అతణ్ణి బందీగా తీసుకుపోయిన స్థలంలోనే చనిపోతాడు. అతడు ఇంకెప్పుడూ ఈ దేశం చూడడు.
13 ✽“అక్రమంగా తన నగరును, అన్యాయంగా
తన మేడ గదులను కట్టించుకొనేవాడికి
బాధ తప్పదు.
ఇరుగు పొరుగువాళ్ళచేత ఊరికే పని చేయించుకొని
వాళ్ళ కూలీ వాళ్ళకు ఇవ్వకుండా ఉండేవాడికి
బాధ తప్పదు.
14 అతడు ‘నేను పెద్ద నగరును కట్టించుకొంటాను.
దానికి విశాలమైన మేడ గదులుంటాయి’
అనుకొంటాడు.
దానికి పెద్ద కిటికీలు చేయించుకొని,
దేవదారు పలకలతో పొదుగుతాడు,
ఎర్ర రంగుతో అలంకరిస్తాడు.
15 దేవదారు విషయం ఇతరులతో
నీవు పోటీ చేసినంతమాత్రాన నీవు రాజువు కావచ్చావా?
నీ తండ్రికి తినడానికీ త్రాగడానికీ ఉంది గదా.
అప్పుడు అతడికి క్షేమంగానే ఉంది కూడా.
16 అతడు బీదవారిపట్ల, అక్కరలో ఉన్న
వారిపట్ల న్యాయం జరిగించాడు.
అప్పుడు అంతా క్షేమంగానే ఉంది.
అలా చేయడమే నన్ను తెలుసుకోవడం గదా.
ఇది యెహోవా వాక్కు.
17 కాని, నీ నేత్రాశ, నీ హృదయాభిలాష
అక్రమ సంపాదనమీద,
నిర్దోషుల రక్తం ఒలికించడంమీద, ప్రజలమీద దౌర్జన్యం,
బలత్కారం చూపడంమీద మాత్రమే ఉంది.”
18 కనుక యూదా రాజూ, యోషీయా కొడుకూ అయిన యెహోయాకీం విషయం యెహోవా చెప్పేదేమిటంటే,
“ప్రజలు ‘అయ్యో, సోదరా! అయ్యో, సోదరీ!’
అంటూ విలపించరు.
‘అయ్యో, నా యజమానీ! అయ్యో, ఆయన ఘనత!’
అంటూ రోదనం చేయరు.
19 ✽“అతణ్ణి జెరుసలం ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి,
అక్కడ పారవేసి, గాడిదను పాతిపెట్టినట్లు
పాతిపెట్టడం జరుగుతుంది.
20 ✽“లెబానోను పర్వతమెక్కి అక్కడ కేకలు వేయి.
బాషానులో గొంతెత్తి అరవు!
అబారీంనుంచి నీ కేకలు వినిపించు!
ఎందుకంటే నీ ప్రేమికులు అందరూ నాశనమయ్యారు.
21 నీవు నిర్భయంగా ఉన్నప్పుడు నేను
నీతో మాట్లాడాను గాని, నీవు ‘నేను వినను’ అన్నావు.
చిన్నప్పటి నుంచి నీవు అలాగే ప్రవర్తించావు
– నా మాట వినకుండా ఉన్నావు.
22 నీ నాయకులంతా గాలికి కొట్టుకుపోతారు.
నీ ప్రేమికులు బందీలుగా తప్పక వెళ్ళిపోతారు.
అప్పుడు నీ చెడుగు అంతటినిబట్టి నీవు సిగ్గుకు,
అవమానానికి గురి అవుతావు.
23 ‘నీవు లెబానోనుమీద ఉన్న దేవదారు వృక్షాలలో
గూడు కట్టుకొన్నా,
ప్రసవిస్తూవున్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి వేదనలు
నీకు కలుగుతాయి.
నీవు ఎంత మూలుగుతావు!”
24 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “యూదా రాజైన యెహోయాకీం కొడుకు కొన్యా! నా కుడి చేతికి రాజముద్రికలాగా ఉన్నా నేను నిన్ను అక్కడనుంచి పెరికివేస్తాను. నా జీవంతోడని శపథం చేస్తున్నాను. 25 నీవు బబులోను రాజైన నెబుకద్‌నెజరుకూ కల్దీయవాళ్ళకూ భయపడుతూ ఉన్నావు గదా. వాళ్ళు నీ ప్రాణం తీయడానికి చూస్తున్నారు గదా. నేను నిన్ను వాళ్ళ వశం చేస్తాను. 26 నిన్ను కన్న తల్లినీ, నిన్నూ వేరే దేశంలోకి విసరివేస్తాను. మీరు అక్కడ పుట్టలేదు గాని, అక్కడే చస్తారు. 27 వాళ్ళు తిరిగి రావాలని మనసారా ఆశపడే ఈ దేశానికి మరెన్నడూ రారు. 28 ఈ మనిషి కొన్యా, అందరి తృణీకారానికి గురి అయిన ఓటికుండలాంటివాడా? ఎవరికీ ఇష్టం లేని పాత్రవంటివాడా? అతణ్ణి, అతడి సంతానాన్ని వాళ్ళకు తెలియని దేశంలోకి విసరివేయడం ఎందుకని? 29 ✽దేశమా! దేశమా! దేశమా! యెహోవా వాక్కు విను! 30 యెహోవా చెప్పేదేమిటంటే, ఈ మనిషి సంతానం లేనివాడనీ బ్రతికినన్నాళ్ళలో అభివృద్ధి పొందనివాడనీ వ్రాయండి. ఎందుకంటే, అతడి సంతానంలో ఎవడూ అభివృద్ధి పొందడు, ఎవడూ దావీదు సింహాసన మెక్కడు, ఎవడూ ఎన్నడూ యూదాలో పరిపాలించడు.”