21
1 సిద్కియారాజు మల్కీయా కొడుకైన పషూరునూ మయశేయా కొడుకైన జెఫన్యాయాజినీ ఈ మనవితో యిర్మీయాదగ్గరికి పంపాడు: 2 “బబులోను రాజైన నెబుకద్‌నెజరు మనమీద యుద్ధం చేస్తున్నాడు. యెహోవా అద్భుతాలు చేసేవాడు. నెబుకద్‌నెజరు మనదగ్గరనుంచి వెళ్ళిపోయేలా ఒకవేళ యెహోవా తన అద్భుత క్రియలన్నిటి ప్రకారం మనకోసం జరిగిస్తాడేమో. దయచేసి, మాకోసం యెహోవాదగ్గర విచారణ చేయండి.”
3 అప్పుడు యెహోవానుంచి వచ్చిన వాక్కు యిర్మీయా వాళ్ళతో చెప్పాడు: “మీరు ఈ విధంగా సిద్కియాతో చెప్పాలి: 4 ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ప్రాకారం వెలుపల మిమ్ములను ముట్టడి వేస్తూ ఉన్న బబులోను రాజుతో, కల్దీయవాళ్ళతో యుద్ధంలో మీరు ప్రయోగిస్తున్న ఆయుధాలను వెనక్కు మళ్ళేట్టు చేస్తాను. వాటిని ఈ నగరం మధ్యలో పోగు చేయిస్తాను. 5 నేనే చేయి చాపి, బలంగల నా హస్తంతో, కోపంతో, తీవ్రమైన ఆగ్రహంతో, ప్రచండమైన ఉగ్రతతో మీమీద యుద్ధం చేస్తాను. 6 ఈ నగరంలో ఉంటున్న మనుషులనూ పశువులనూ మొత్తుతాను. వాళ్ళు భయంకరమైన అంటురోగానికి గురి అయి చస్తారు. 7 యెహోవా చెప్పేదేమిటంటే, ఆ తరువాత రోగంచేత, ఖడ్గంచేత కరవుచేత చావకుండా, నగరంలో మిగిలిన ప్రజలనూ, యూదా రాజు సిద్కియానూ, అతడి సిబ్బందినీ బబులోను రాజు నెబుకద్‌నెజరు వశం, వాళ్ళ ప్రాణం తీయజూచేవాళ్ళ శత్రువుల వశం చేస్తాను. అతడు ఈ ప్రజమీద ఏమీ కనికరం, కరుణ, జాలి చూపడు. వాళ్ళను ఖడ్గంతో హతం చేయిస్తాడు.
8 “ఈ ప్రజతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో, జీవ మార్గం, మరణ మార్గం రెండూ మీ ఎదుట ఉంచుతున్నాను. 9 ఈ నగరంలో ఉండబోయేవాళ్ళు ఖడ్గానికీ కరవుకూ అంటురోగానికీ గురియై చస్తారు. నగరం బయటికి వెళ్ళి, మిమ్ములను ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయవాళ్ళకు లోబడిపోయేవాళ్ళు బ్రతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది. 10 నేను ఈ నగరాన్ని దయ చూడను. విపత్తు కలిగిస్తాను. ఇది బబులోను రాజు వశమవుతుంది. అతడు దానిని మంటలతో నాశనం చేస్తాడు. ఇది యెహోవా వాక్కు.
11 “తరువాత యూదా రాజ వంశీయులకు ఇలా చెప్పు:
యెహోవా వాక్కు వినండి!
12  దావీదు వంశీయులారా!
యెహోవా చెప్పేదేమిటంటే ఉదయకాలం
న్యాయం జరిగించండి.
దోచుకోబడ్డవారిని దౌర్జన్యపరుల చేతిలోనుంచి
విడిపించండి.
లేకపోతే, మీరు చేసిన చెడుగుకారణంగా నా కోపం
మంటలాగా బయలుదేరుతుంది.
ఎవ్వరూ ఆర్పడానికి వీలులేకుండా
అది మండుతూనే ఉంటుంది.
13 ఈ కొండల సందులో, శిలామయమైన ఈ ఎత్తయిన
మైదానంలో కూర్చుని ఉన్న జెరుసలమా!
నీవు అంటున్నావు గదా ‘మామీదికి ఎవరు రాగలరు?
మా ఇండ్లలో ఎవరు అడుగు పెట్టగలరు?’
నేను నీకు విరోధినయ్యాను.
ఇది యెహోవా వాక్కు.
14 నీ పనులకు అనుగుణంగా నిన్ను దండిస్తాను.
నీ అడవులకు జ్వాలలంటిస్తాను.
అవి చుట్టూ ఉన్నదంతా కాల్చివేస్తుంది.
ఇది యెహోవా వాక్కు.”