20
1 ✽ఇమ్మేరు కొడుకైన పషూరుయాజి యెహోవా ఆలయంలో ప్రముఖ నాయకుడు. యిర్మీయా ఆ విషయాలు దేవునిమూలంగా పలకడం అతడు విన్నాడు. 2 వెంటనే అతడు యిర్మీయాప్రవక్తను కొట్టి, యెహోవా ఆలయందగ్గర ఉన్న ‘బెన్యామీను పైద్వారం’లో బొండలో వేయించాడు. 3 ✽మరుసటిరోజు పషూరు యిర్మీయాను బొండనుంచి విడిపించినప్పుడు యిర్మీయా అతడితో ఇలా అన్నాడు: “ఇకనుంచి యెహోవా నిన్ను పషూర్ అని పిలవడు గాని, ‘మాగోర్ మిస్సాబీబ్’ అని పిలుస్తాడు. 4 యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో విను! నీకూ నీ మిత్రులందరికీ నిన్ను భయకారణంగా చేస్తాను. నీ కళ్ళముందే వాళ్ళు శత్రువుల ఖడ్గానికి గురి అయి కూలుతారు. యూదావాళ్ళందరినీ బబులోను రాజు వశం చేస్తాను. అతడు వాళ్ళను బందీలుగా బబులోనుకు తీసుకుపోతాడు. లేదా, ఖడ్గంతో వాళ్ళను హతం చేస్తాడు. 5 ఈ నగరం ధనమంతా – దాని కష్టార్జితమంతా, విలువైన వస్తువులన్నీ, యూదా రాజుల సంపద అంతా – వాళ్ల శత్రువులకు నేను ఇచ్చివేస్తాను. శత్రువులు దానిని దోపిడీగా పట్టుకొని బబులోనుకు తీసుకుపోతారు. 6 పషూరు! నీవు, నీ ఇంట్లో నివాసం చేస్తున్న వాళ్ళందరూ బందీలుగా పోతారు. నీవు ప్రవక్తగా ఎవరితో అబద్ధాలు పలికావో ఆ నీ మిత్రులందరూ నీతోకూడా బబులోనుకు చేరుతారు. అక్కడే నీవు, వాళ్ళు చస్తారు. నిన్ను, వాళ్ళను అక్కడే పాతిపెట్టడం జరుగుతుంది.”7 ✽యెహోవా! నీవు నన్ను ప్రేరేపించావు.
నీ ప్రేరణకు నేను లొంగిపోయాను.
నీవు నన్ను అణచి, నాపై గెలుపొందావు.
రోజంతా నేను నవ్వులపాలయ్యాను.
అందరూ నన్ను వేళాకోళం చేస్తూ ఉన్నారు.
8 ✝ఎందుకంటే, నేను మాట్లాడే ప్రతి సారి
కేకలు వేస్తాను. బలాత్కారం,
నాశనం వస్తాయని చాటిస్తాను.
రోజంతా యెహోవా వాక్కు నామీదికి నిందను,
హేళనను తెచ్చింది.
9 ✽“ఇకనుంచి ఆయనను గురించి ఆలోచించను,
ఆయన పేర మాట్లాడను”
అని నేను అనుకొన్నాను గాని,
నాకు ఎముకల్లో నిప్పు మూసిపెట్టినట్టుంది.
అది నా హృదయంలో మండుతూ ఉన్నట్టు ఉంది.
ఓర్చుకొని, ఓర్చుకొని అలిసిపోయాను.
అసలు ఇంకా ఓర్చుకోలేకపోయాను.
10 ✽చాలామంది “చుట్టూరా భయం తాండవిస్తుంది!
బహిరంగంగా అతణ్ణి నిందించండి!
అతణ్ణి నిందించుదాం!” అని గుసగుసలాడడం
నాకు వినబడుతూ ఉంది.
నా మిత్రులందరూ నా పతనంకోసం చూస్తూ,
“ఒకవేళ అతడు దుర్బోధకు లొంగిపోతాడు.
అప్పుడు మనం అతణ్ణి గెలిచి పగతీర్చుకోవచ్చు”
అని చెప్పుకొంటున్నారు.
11 అయితే యెహోవా బలంగల యుద్ధవీరుడులాగా
నా ప్రక్కనే✽ ఉన్నాడు.
గనుక నన్ను హింసించేవాళ్ళు తొట్రుపడిపోయి
నన్ను గెలవలేకపోతారు.
భంగపడి, చాలా సిగ్గుపాలవుతారు.
వాళ్ళ అవమానం ఎన్నడూ మరవబడదు.
12 ✝సేనలప్రభువు యెహోవా✽!
నీవు న్యాయవంతులను పరిశోధించేవాడివి.
హృదయాన్నీ మనసునూ చూచేవాడివి.
నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను గనుక నీవు
వాళ్ళకు చేసే ప్రతీకారం నన్ను చూడనియ్యి.
13 ✽యెహోవాకు సంకీర్తనం పాడండి!
యెహోవాను స్తుతించండి! ఆయన అక్కరలో
ఉన్నవాని ప్రాణాన్ని దుర్మార్గుల బారినుంచి
తప్పించేవాడు.
14 ✽నేను పుట్టినరోజు శపించబడుతుంది గాక!
నా తల్లి నన్ను కన్నరోజు శుభ దినమని
ఎవ్వరూ అనకూడదు.
15 “నీకు మగపిల్లాడు పుట్టాడు” అని వార్త తెచ్చి
నా తండ్రిని సంతోషభరితుణ్ణి చేసినవాడు
శాపానికి గురి అవుతాడు గాక!
16 వాడు నన్ను గర్భంలోనే చంపలేదు,
ఆ విధంగా నా తల్లి నాకు సమాధిలాంటిదై ఎప్పటికీ
నన్ను గర్భాన మోసేలా చేయలేదు,
గనుక, ఏమీ జాలి లేకుండా యెహోవా నాశనం
చేసిన పట్టణంగా వాడు ఉంటాడు గాక!
17 ప్రొద్దున వాడికి రోదనం వినబడుతుంది గాక!
మధ్యాహ్నం యుద్ధధ్వని వినిపిస్తుంది గాక!
18 కష్టం, దుఃఖం అనుభవిస్తూ,
నేను అవమానంతో నా రోజులు గడుపుతూ ఉన్నాను.
నేను గర్భంలోనుంచి బయటికి రావడం ఇందుకేనా?