19
1 ✽యెహోవా నాతో ఇలా చెప్పాడు: “వెళ్ళి, ఒక మట్టి కూజాను కుమ్మరివాడి దగ్గర కొను. అప్పుడు ప్రజల పెద్దలలో కొంతమందిని, యాజుల్లో పెద్దవారిని వెంటబెట్టుకొని, 2 ✝‘హర్సీతు’ ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోం లోయకు వెళ్ళు. నేను ఇప్పుడు నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు: 3 యూదా రాజులారా! జెరుసలం నివాసులారా! యెహోవా వాక్కు వినండి! ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ, సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో వినండి! నేను ఈ స్థలంమీదికి విపత్తు రప్పిస్తున్నాను. దానిని గురించి విన్నవారందరి చెవులు గింగురు మనేటంత భయంకరంగా ఉంటుంది. 4 ఎందుకంటే, ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని మనసు విరిచివేసే స్థలంగా చేశారు. తమకు గానీ తమ పూర్వీకులకు గానీ యూదా రాజులకు గానీ తెలియని దేవుళ్ళకూ దేవతలకూ ధూపం వేశారు. ఈ స్థలాన్ని నిరపరాధుల రక్తంతో నింపారు. 5 అంతేగాక, వారు బయల్‌దేవుడికి ఎత్తు పూజాస్థలాలను కట్టి, వాళ్ళ సంతానాన్ని బయల్‌దేవుడికి హోమాలుగా కాల్చారు, అలా చేయమని నేను ఆజ్ఞ జారీ చేయలేదు, ఆదేశించలేదు. అది నా మనసుకు ఎన్నడూ తట్టలేదు.”6 గనుక యెహోవా చెప్పేదేమిటంటే, “రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘తోఫెతు’ అనరు, ‘బెన్‌హిన్నోంలోయ’ అనరు గాని, ‘వధ లోయ’ అంటారు. 7 ఈ స్థలంలో నేను యూదావారికీ జెరుసలంవారికీ ఉన్న ఆలోచనలను వమ్ము చేస్తాను. వారి శత్రువుల ఎదుట, వారి ప్రాణం తీయజూచేవాళ్ళచేత, వారు కత్తిపాలై కూలేట్టు చేస్తాను. వారి శవాలను గాలిలో ఎగిరే పక్షులకూ భూమిమీద తిరిగే మృగాలకూ ఆహారంగా ఇస్తాను. 8 ఈ నగరాన్ని పాడు చేసి, ఎగతాళికి గురి చేస్తాను. ఈ దారిన వచ్చేవారంతా దాని దెబ్బలన్నీ చూచి నిర్ఘాంతపోయి హేళన చేస్తారు. 9 ✽ వారి ప్రాణం తీయజూచే శత్రువులు ముట్టడివేసి బాధించే కాలంలో ఒకరి శరీరాన్ని ఒకరు తింటారు. సొంత కొడుకుల, కూతుళ్ళ శరీరాలను తినేలా చేస్తాను.”
10 ✽“అప్పుడు నీవు నీతో వచ్చిన మనుషుల కళ్ళెదుటే ఆ కూజాను పగలగొట్టి వాళ్ళతో ఇలా చెప్పాలి: 11 సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, కుమ్మరివాడి కూజాను బాగు చేయడానికి వీలులేకుండా పగలగొట్టినట్టు, నేను ఈ ప్రజనూ ఈ నగరాన్నీ పగలగొట్టివేస్తాను. పాతిపెట్టేచోటు దొరకనంతగా తోఫెతులో శవాలను పాతిపెట్టడం జరుగుతుంది. 12 ✽అలాగే నేను ఈ స్థలానికీ ఇక్కడి నివాసులకూ చేస్తాను. ఈ నగరాన్ని తోఫెతులాగా చేస్తాను. ఇది యెహోవా వాక్కు. 13 జెరుసలంలో ఉన్న ఇండ్లు, యూదా రాజుల ఇండ్లు తోఫెతులాగా అశుద్ధం అవుతాయి. ఏ ఇండ్ల కప్పులమీద వాళ్ళు సూర్యచంద్ర నక్షత్ర సమూహానికి✽ ధూపం వేశారో, ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇండ్లకు అన్నిటికీ అలాగే జరుగుతుంది.”
14 ✽యెహోవా తనమూలంగా పలకడానికి యిర్మీయాను పంపిన తోఫెతునుంచి అతడు తిరిగివచ్చి, యెహోవా ఆలయ ఆవరణంలో నిలబడి, ప్రజలందరితో ఇలా అన్నాడు: 15 “ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, ఇదిగో వినండి! ఈ ప్రజ తలబిరుసుగా ఉండి నా మాట వినలేదు గనుక నేను ఈ నగరంమీదికి, దీనికి చెందిన ఊళ్ళన్నిటిమీదికీ నేను చెప్పిన విపత్తంతా రప్పిస్తాను.”