18
1 ✽ఇది యెహోవానుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు:2 “లేచి కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు. అక్కడ నీకు నా మాటలు వినిపిస్తాను.” 3 నేను కుమ్మరివాడి ఇంటికి చేరినప్పుడు అతడు తన సారెమీద పని చేస్తూ ఉన్నాడు. 4 అతడు బంకమట్టితో చేస్తూ ఉన్న కుండ అతడి చేతుల్లో పాడైపోయింది. కుమ్మరి తనకిష్టం వచ్చినట్టు ఆ మట్టితోనే ఇంకో కుండ చేశాడు.
5 అప్పుడు యెహోవానుంచి వాక్కు నాకు వచ్చింది: 6 “ఇస్రాయేల్‌ప్రజలారా! యెహోవా చెప్పేదేమిటంటే, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మిమ్ములను చేయ లేననుకొంటున్నారా? ఇది యెహోవా వాక్కు. ఇస్రాయేల్ ప్రజలారా! కుమ్మరి చేతిలో బంకమట్టిలాగా మీరు నా చేతిలో ఉన్నారు. 7 ✽నేను ఏదైనా జనాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ‘దానిని పెరికివేస్తాను, పడద్రోసి నాశనం చేస్తాను’ అంటాను అనుకోండి. 8 ఒకవేళ, నేను హెచ్చరించిన ఆ జనం చెడుగు చేయడం మానుకొంటే, దానిమీదికి రప్పిస్తానని నేను అనుకొన్న విపత్తు విషయం నేను జాలిపడి దానిని రప్పించను. 9 నేను ఇంకో జనాన్ని గురించి, రాజ్యాన్ని గురించి ‘దానిని వృద్ధి పొందిస్తాను, సుస్థిరం చేస్తాను’ అంటాననుకోండి. 10 ఆ జనం నా మాట వినకుండా, నా దృష్టిలో చెడుగు చేస్తే, నేను దానికి చేస్తాననుకొన్న మేలు విషయం సంతాపపడుతాను.
11 ✽“యిర్మీయా! యూదావారితో, జెరుసలం నివాసులతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నేను మీకు వ్యతిరేకంగా కీడును కల్పిస్తున్నాను, ఉపాయం పన్నుతున్నాను. మీరు – ఒక్కొక్కరు – మీ చెడ్డ త్రోవలను విడిచి, మీ విధానాలను, ప్రవర్తనను సరిదిద్దుకోండి. 12 ✽అందుకు వాళ్ళు ‘అది లాభం లేదు. మేము మా ఆలోచనలప్రకారం ప్రవర్తిస్తాం. ఒక్కొక్కరం మా చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తాం’ అంటారు.
13 ✽ “అందుచేత యెహోవా చెప్పేదేమిటంటే,
ఇలాంటిది ఎప్పుడైనా ఎవరికైనా వినబడిందా?
జనాలమధ్య అడిగి తెలుసుకోండి.
ఇస్రాయేల్ కన్య చేసినది చాలా ఘోరం.
14 ✽లెబానోను పర్వతంమీద బండలపై
మంచు లేకుండా పోతుందా?
దూరంనుంచి పారే దాని చల్లని వాగులు ఇంకిపోతాయా?
15 నా ప్రజలైతే నన్ను మరచిపోయారు.
వాళ్ళు పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తారు.
వారి త్రోవలలో, పురాతన మార్గాలలో✽ తొట్రుపడ్డారు.
రహదారిన కాదు, డొంక బాటలో✽ నడుస్తూ ఉన్నారు.
16 ✝దానికి ఫలితంగా వాళ్ళ దేశం పాడైపోతుంది.
అది ఎప్పటికీ ఎగతాళికి గురి అవుతుంది.
ఆ దారిన వెళ్ళేవారంతా నిర్ఘాంతపోయి తలలు ఊపుతారు.
17 తూర్పుగాలిలాగా నేను వారిని శత్రువుల ఎదుట
చెదరగొట్టివేస్తాను. వారి ఆపద రోజున వారికి
నా ముఖం చూపించే బదులు నా వీపు చూపిస్తాను.”
18 ✽అప్పుడు వాళ్ళు ఇలా చెప్పుకొన్నారు: “యిర్మీయామీద కుట్ర పన్నుదాం పట్టండి. అయినా యాజులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు, జ్ఞానులు ఆలోచన చెప్పడం మానరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడి మాటలు ఏమీ వినకుండా, మన మాటలతో అతణ్ణి నిందిద్దాం రండి.”
19 ✽యెహోవా! నా మొర ఆలకించు. నా విరోధులు చెప్పేది విను. 20 చేసిన మేలుకు కీడు చేయడం యుక్తమా? వాళ్ళపైనుంచి నీ కోపం తొలగించడానికి నీ ఎదుట నేను నిలబడి మంచిగా వాళ్ళను గురించి మాట్లాడిన సంగతి నీవు తలచుకో. అయినా వాళ్ళు నా ప్రాణం తీయాలని గొయ్యి త్రవ్వారు. 21 గనుక వాళ్ళ పిల్లలను కరవుపాలు చెయ్యి. వాళ్ళను ఖడ్గానికి గురి చెయ్యి. వాళ్ళ భార్యలు సంతానాన్ని కోల్పోయి విధవరాండ్రు అయ్యేలా చెయ్యి. వాళ్ళలో పురుషులు హతమై చనిపోతారు గాక! 22 అకస్మాత్తుగా నీవు వాళ్ళమీదికి దండెత్తేవాళ్ళను రప్పించడంచేత వాళ్ళ ఇండ్లలోనుంచి కేకలు వినబడుతాయి గాక! నన్ను పట్టుకోవడానికి వాళ్ళు గుంట తవ్వారు. నా కాళ్ళను చిక్కించుకోవాలని వలలు దాచారు. 23 యెహోవా! నన్ను చంపడానికి వాళ్ళు చేసిన కుట్ర అంతా నీకు తెలుసు. వాళ్ళ అపరాధాలను కప్పివేయకు. వాళ్ళ పాపాలు నీ ఎదుటనుంచి తుడిచివేయవద్దు. వాళ్ళు నీ సన్నిధానంలో కూలుతారు గాక! నీవు కోపగించే కాలంలో వాళ్ళపట్ల యుక్తంగా వ్యవహరించు.