17
1 “యూదావారి అపరాధం ఇనుప కలంతో వ్రాసి ఉంది.
వారి హృదయమనే పలకమీద, వారి బలిపీఠాల
కొమ్ములమీద వజ్రం కొనతో చెక్కి ఉంది.
2 వారి సంతానం కూడా పచ్చని చెట్లక్రింద,
ఎత్తయిన కొండలమీద ఉన్న వారి బలిపీఠాలనూ
అషేరాదేవతా స్తంభాలనూ జ్ఞాపకం ఉంచుకొంటారు.
3 మీ దేశమంతటా మీరు చేసిన పాపాలకారణంగా
నేను ఈ సరిహద్దులలో ఉన్న నా పర్వతాన్నీ
మీ సంపదనూ విలువైన వస్తువులన్నిటినీ
మీ ఎత్తయిన పూజాస్థలాలనూ దోపిడీగా
ఇతరులకు ఇచ్చివేస్తాను.
4 నేను మీకిచ్చిన వారసత్వాన్ని మీకారణంగానే
మీరు పోగొట్టుకొంటారు.
మీరు నా కోపాగ్ని రగులబెట్టారు.
అది ఎప్పటికీ మండుతూ ఉంటుంది.
మీకు తెలియని దేశంలో మీ విరోధులకు
మిమ్ములను దాసులుగా చేస్తాను.”
5  యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే,
“మనిషిమీద నమ్మకం పెట్టి, శరీరులను
తనకు బలంగా చేసుకొని,
యెహోవానుంచి మనసు మళ్ళుకొన్నవారు శాపగ్రస్తులు.
6 అలాంటివారు ఎండిన ప్రదేశంలో ఉన్న
పొదలాగా ఉంటారు.
క్షేమం కలిగితే అది వారికి కనిపించదు.
ఎడారిలో బాగా ఎండిపోయిన స్థలంలో,
నిర్జనమై చవిటి ప్రదేశంలో ఉండిపోతారు.
7 ఎవరైతే యెహోవామీద నమ్మకం ఉంచుతారో,
ఎవరికైతే యెహోవా ఆశ్రయంగా ఉన్నాడో వారు ధన్యులు.
8 వారు నీళ్ళదగ్గర నాటబడి, కాలువ ఓరను
వేళ్ళు తన్నిన చెట్టులాగా ఉంటారు.
ఎండ వచ్చినా ఆ చెట్టు భయపడదు.
దాని ఆకులు పచ్చగా ఉంటాయి.
వాన లేని సంవత్సరంలో కూడా అది ఏమీ
కంగారుపడదు, కాయడం మానదు.
9 “హృదయం అన్నిటికంటే మోసకరం.
దానికి ఘోరమైన రోగం ఉంది.
దానిని ఎవరు గ్రహించగలరు?
10 నేను – యెహోవాను – హృదయాన్ని
పరిశోధిస్తాను, మనసును పరీక్షిస్తాను.
ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం,
వారి క్రియలకు తగినట్టుగా ఇస్తాను.”
11 కౌజుపిట్ట తాను పెట్టని గుడ్లను పొదుగుతుంది.
అక్రమంగా ధనం సంపాదించుకొనేవాడు
ఆ పిట్టలాంటివాడే,
నడిమి వయసులో ఆ ధనం వాణ్ణి వదలివేస్తుంది.
చివరగా వాడు తెలివితక్కువవాడని తేలుతుంది.
12 ఆరంభంనుంచి మా పవిత్రాలయం ఉన్నస్థలం
ఘనమైన, గంబీరమైన సింహాసనంలాంటిది.
13 యెహోవా! ఇస్రాయేల్ ప్రజకు ఆశాభావం నీవే.
నిన్ను విడిచి పెట్టినవాళ్ళందరూ సిగ్గుపాలవుతారు.
నీనుంచి వైదొలగిన వాళ్ళు జీవప్రదమైన
నీటి ఊట అయి ఉన్న యెహోవాను విడిచిపెట్టారు,
గనుక వాళ్ళు ఇసుకమీద వ్రాతలాగా ఉంటారు.
14 యెహోవా! నన్ను బాగు చెయ్యి.
అప్పుడు నేను బాగుపడుతాను.
నన్ను విముక్తుణ్ణి చెయ్యి. అప్పుడు విముక్తుణ్ణి అవుతాను.
నేను కీర్తించేది నిన్నే.
15 ఇదిగో వారు నాతో “యెహోవా వాక్కు ఎక్కడుంది?
ఇప్పుడు అది నెరవేరుతుంది గాక!” అంటున్నారు.
16 నేను నిన్ను అనుసరిస్తూ, కాపరిగా ఉండడం
మానుకోలేదు.
నిరాశ కాలం రావాలని నేను ఆశించలేదు.
నీకు తెలుసు.
నా పెదవులు దాటి వచ్చిన మాటలు
నీ ఎదుటే ఉన్నాయి గదా.
17 నీవు నాకు భయకారణంగా ఉండబోకు.
దుర్దినంలో నాకు ఆశ్రయం నీవే.
18 నాకు ఆశాభంగం కలగనియ్యకు.
నన్ను హింసించేవాళ్ళకే ఆశాభంగం కలిగించు.
నాకు కాదు వాళ్ళకే భయం వేసేలా చెయ్యి.
దుర్దినం వాళ్ళమీదికి రప్పించి రెండంతల
నాశనం వారిమీదికి రప్పించు!”
19 యెహోవా నాతో ఇలా చెప్పాడు: “యూదా రాజులు నగరంలోకి ప్రవేశిస్తూ, బయటికి వెళ్ళిపోతూ ఉండే ప్రజాద్వారంలో నీవు వెళ్ళి నిలబడు. తరువాత జెరుసలం ద్వారాలన్నిటిలో నిలబడాలి. 20 నీవు ఇలా ప్రకటన చెయ్యి: యూదా రాజులారా! యూదా ప్రజలారా! జెరుసలం నివాసులారా! ఈ ద్వారాలగుండా ప్రవేశించేవారలారా! మీరందరూ యెహోవా వాక్కు వినండి! 21 యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి, విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. జెరుసలం ద్వారాలగుండా వాటిని తీసుకురావద్దు. 22 విశ్రాంతి దినాన మీ ఇండ్లలోనుంచి బరువులు మోసుకుపోవద్దు, మరే పనీ చేయకూడదు. నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినం పవిత్ర దినంగా పరిగణించండి. 23  మీ పూర్వీకులు పెడచెవిని పెట్టి నా మాట వినలేదు. తలబిరుసుగా ఉండి, వాళ్ళు విని హెచ్చరిక పాటించలేదు.
24 “మీరైనా నా మాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినాన నగరద్వారాల గుండా ఏ బరువూ తీసుకురాకుండా, విశ్రాంతి దినం పవిత్ర దినంగా ఎంచి, ఆ రోజున ఏ పనీ చేయకుండా ఉంటే, అప్పుడు ఇలా జరుగుతుంది – 25 దావీదు సింహాసనమెక్కే రాజులు అధిపతులతోపాటు ఈ నగర ద్వారాలగుండా ప్రవేశిస్తారు; వారూ వారి అధిపతులూ రథాలమీద, గుర్రాలమీద వస్తూ పోతూ ఉంటారు; వారివెంట యూదావారూ జెరుసలం నివాసులూ వస్తారు, ఈ నగరం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. 26 ప్రజలు యూదా పట్టణాలనుంచి, జెరుసలం పరిసరాలనుంచి, బెన్యామీను ప్రదేశంనుంచి, పడమటి మైదానాలనుంచి, కొండసీమనుంచి, దక్షిణప్రదేశంనుంచి వస్తారు. వారు యెహోవా ఆలయానికి హోమాలు, బలులు, నైవేద్యాలు ధూపద్రవ్యం, కృతజ్ఞతార్పణలు తెస్తారు. 27 అయితే విశ్రాంతిదినం జెరుసలం ద్వారాలగుండా బరువులు మోసుకురాకుండా, విశ్రాంతిదినం పవిత్ర దినంగా ఎంచాలని నేను చెప్పిన మాట మీరు వినకపోతే, నేను జెరుసలం ద్వారాలలో మంట రాజబెట్టిస్తాను. అది దాని నగరులను కాల్చివేస్తుంది. దానిని ఆర్పడానికి ఎవరి తరం కాదు.”