16
1 మరోసారి యెహోవానుంచి నాకు వాక్కు వచ్చింది:
2 “నీవు పెండ్లి చేసుకోకూడదు. ఎందుకంటే నీకు ఈ స్థలంలో కొడుకులు, కూతుళ్ళు ఉండకూడదు. 3 ఈ దేశంలో పుట్టిన కొడుకులు, కూతుళ్ళను గురించి వారిని కన్న తల్లిదండ్రులను గురించి యెహోవా చెప్పేదేమిటంటే, 4 వారు ప్రాణాంతక రోగాలకు గురి అయి చనిపోతారు. వారికోసం ఎవ్వరూ విలపించరు. వారిని ఎవ్వరూ పాతిపెట్టరు. వారు భూమిమీద పెంటలాగా పడి ఉంటారు. ఖడ్గంచేత, కరవుచేత నాశనమవుతారు. వారి శవాలు గాలిలో ఎగిరే పక్షులకు, భూమిమీద తిరిగే మృగాలకు ఆహారమవుతాయి.”
5  యెహోవా చెప్పేదేమిటంటే, “నా శాంతి, నా దయ, నా వాత్సల్యం ఈ ప్రజమీద ఉండకుండా తీసివేశాను. గనుక నీవు రోదనం చేసేవాళ్ళ ఇంట్లోకి వెళ్ళవద్దు. విలపించడానికి, వారిని ఓదార్చడానికి వెళ్ళవద్దు. ఇది యెహోవా వాక్కు. 6 దేశంలో గొప్పవారేమీ తగ్గువారేమీ అందరూ చస్తారు. వారిని ఎవ్వరూ పాతిపెట్టరు, వారికోసం ఎవ్వరూ రోదనం చేయరు, తమను కోసుకోరు, బోడిగా చేసుకోరు. 7 చచ్చినవారి విషయం ఏడ్చేవారిని ఓదార్చడానికి వారితో కలిసి తినేవాళ్ళెవ్వరూ ఉండరు. తండ్రి, లేక తల్లి చనిపోతే కూడా పానీయం ఇచ్చి ఊరడించేవాళ్ళెవ్వరూ ఉండరు.
8 “విందు జరిగే ఇంట్లోకి నీవు వెళ్ళకు. వారితో కూర్చుని, తిని, త్రాగకు. 9 ఇస్రాయేల్ ప్రజల దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, నీ కళ్ళముందే, నీ రోజుల్లోనే సంతోషానందాల ధ్వనులను ఈ స్థలంలో వినబడకుండా చేస్తాను. పెండ్లికొడుకు, పెండ్లికూతురు చేసే శబ్దాన్ని మాన్పిస్తాను.
10 “నీవు ఈ ప్రజతో ఈ మాటలన్నీ చెప్పేటప్పుడు వారు నీతో అంటారు: ‘యెహోవా ఎందుకు ఇంత గొప్ప విపత్తును మాకు నిర్ణయించాడు? మేమేం అపరాధం చేశాం? మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’ 11 అందుకు నీవు ఇలా జవాబివ్వాలి: యెహోవా చెప్పేదేమిటంటే, నేను అలా నిర్ణయించిన కారణమిదే: మీ పూర్వీకులు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, సేవిస్తూ, పూజిస్తూ ఉన్నారు. నన్ను విడిచిపెట్టి నా ఉపదేశాన్ని పాటించలేదు. 12 మీ పూర్వీకులకంటే మీరు మరి ఎక్కువగా చెడుగు జరిగించారు. నా మాట వినకుండా మీలో ప్రతి ఒక్కరూ తన చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ ఉన్నారు. 13 అందుచేత నేను మిమ్ములను ఏమీ దయ చూడను; ఈ దేశం నుంచి మీకు గానీ మీ పూర్వీకులకు గానీ తెలియని దేశంలోకి మిమ్ములను విసరివేస్తాను. అక్కడ మీరు ఇతర దేవుళ్ళకు రాత్రింబగళ్ళు సేవ చేయవలసివస్తుంది.”
14 యెహోవా ఇంకా అన్నాడు, “అయినా, నేను వారి పూర్వీకులకు ఇచ్చిన వారి దేశానికి తిరిగి వచ్చేలా చేస్తాను. గనుక రాబోయే రోజుల్లో ‘ఈజిప్ట్‌దేశంనుంచి, ఇస్రాయేల్‌ప్రజను తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అని ప్రమాణం చేయడం జరగదు 15 గాని, ‘ఉత్తర దేశంనుంచి, ఆయన వాళ్ళను చెదరగొట్టిన అన్ని దేశాలనుంచి తీసుకువచ్చిన యెహోవా జీవంతోడు’ అంటారు.”
16 యెహోవా ఇంకా అన్నాడు, “ఇప్పుడు నేను చాలామంది జాలరులను రప్పిస్తాను. వాళ్ళు వచ్చి ఈ ప్రజలను పట్టుకొంటారు. ఆ తరువాత చాలామంది వేటగాళ్ళను రప్పిస్తాను. వాళ్ళు వచ్చి ప్రతి పర్వతంమీదా, ప్రతి కొండమీదా, బండల సందులలో వారిని వేటాడుతారు. 17 వారి త్రోవలన్నిటిమీద నా కనుచూపు ఉంది. అవి నాకు మరుగుగా లేవు. వారి అపరాధాలు నా కండ్లుకు దాగలేవు. 18 వారు తమ నీచమైన విగ్రహాలతో నా సొత్తును నింపారు, ప్రాణం లేని అసహ్యమైన రూపాలచేత నా దేశాన్ని అపవిత్రం చేశారు. గనుక వారి దుర్మార్గానికీ అపరాధానికీ రెండంతలుగా నేను వారిని దండిస్తాను.”
19 యెహోవా! నీవే నా బలం,
నాకు కోటలాంటివాడివి.
కష్టకాలంలో ఆశ్రయంగా ఉన్నావు.
నీదగ్గరికి భూమి కొనలనుంచి జనాలు వచ్చి
ఇలా అంటారు:
“మా పూర్వీకులకు అబద్ధ దేవుళ్ళు,
పనికిమాలిన వ్యర్థమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి.
20 మనుషులు తమకోసం దేవుళ్ళను చేసుకొంటారా?
అవును గాని, అలాంటి దేవుళ్ళు దేవుళ్ళే కాదు.”
21 “అందుచేత నా పేరు యెహోవా అని
వారు తెలుసుకొనేలా నేను వారికి నేర్పిస్తాను,
నా బలప్రభావాలను తెలియజేస్తాను.