15
1 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “ఒకవేళ మోషే, సమూయేలు నా ముందు నిలబడినా ఈ ప్రజను కరుణించే మనసు నాకు కలగదు. ఈ ప్రజను నా ఎదుటనుంచి పంపివెయ్యి! వాళ్ళు వెళ్ళనియ్యి! 2 వాళ్ళు ‘మేము ఎక్కడికి వెళ్ళాలి?’ అని నిన్ను అడిగితే నీవు వాళ్ళతో ఇలా చెప్పాలి: ‘యెహోవా చెప్పేదేమిటంటే, చావుకు నియమించ బడ్డవాళ్ళు చావుకు, ఖడ్గానికి నియమించబడ్డవాళ్ళు ఖడ్గానికి, కరవుకు నియమించబడ్డవాళ్ళు కరవుకు, ఖైదుకు నియమించబడ్డవాళ్ళు ఖైదుకు.
3 “వాళ్ళను నాశనం చేసే విపత్తులను నాలుగు రకాలను నేను పంపిస్తాను. హతం చేయడానికి ఖడ్గాన్ని, శవాలను ఈడ్చుకుపోవడానికి కుక్కలను, మ్రింగివేయడానికీ నాశనం చేయడానికీ గాలిలో ఎగిరే పక్షులనూ భూమిమీద తిరిగే మృగాలనూ పంపిస్తాను. ఇది యెహోవా వాక్కు. 4 యూదా రాజూ హిజ్కియా కొడుకూ అయిన మనష్షే జెరుసలంలో చేసినవాటి కారణంగా ఈ ప్రజను చూచి లోక రాజ్యాలన్నీ అసహ్యించుకొనేలా నేను చేస్తాను.
5 “జెరుసలెమా! నిన్ను ఎవరు కనికరిస్తారు?
ఎవరు ఓదారుస్తారు? కుశల ప్రశ్నలు అడగడానికి
ఎవరు నీవైపు మళ్ళుతారు?
6 ఇది యెహోవా వాక్కు. నీవు నన్ను విసర్జించి
వెనక్కు వెళ్ళిపోతూ ఉన్నావు.
గనుక నా చేయి నీమీదికి చాపి నిన్ను నాశనం చేస్తాను.
నిన్ను కనికరించీ కనికరించీ నాకు విసుగు పుట్టింది.
7 దేశం గుమ్మాలలో చేటతో నీవాళ్ళను తూర్పారపడతాను.
నా ప్రజ తమ మార్గాలనుంచి నావైపు తిరగలేదు,
గనుక నేను వాళ్ళను నాశనం చేస్తాను,
వాళ్ళ సంతానాన్ని చంపిస్తాను.
8 సముద్రం ఇసుక రేణువులకంటే
వారిమధ్య విధవరాండ్రు ఎక్కువమంది అయ్యేలా చేస్తాను.
మధ్యాహ్న కాలంలో వారి యువకుల తల్లులమీదికి
వినాశకారిని రప్పిస్తాను.
అకస్మాత్తుగా భయం, బాధ వారిపై పడేలా చేస్తాను.
9 ఏడుగురిని కన్న తల్లి నీరసించి ప్రాణం విడుస్తుంది.
పగలింకా ఉండగానే దాని ప్రొద్దు క్రుంకుతుంది.
అది సిగ్గుతో అవమానం పాలవుతుంది.
మిగిలినవారిని వారి శత్రువుల ఎదుటే
ఖడ్గానికి గురి చేస్తాను.
ఇది యెహోవా వాక్కు.”
10 అయ్యో, నాకెంత బాధ!
తల్లీ, నన్నెందుకు కన్నావు?
దేశంలో ఉన్నవాళ్ళంతా నాతో జగడమాడుతారు,
వాదిస్తారు. నేనెవరికీ అప్పివ్వలేదు,
అప్పు తీసుకోలేదు.
అయినా అందరూ నన్ను దూషిస్తూ ఉన్నారు.
11 అందుకు యెహోవా అన్నాడు,
“మంచి కోసమే నేను నిన్ను తప్పించితీరుతాను.
నీ శత్రువులు ఆపదలో బాధలో ఉన్నప్పుడు
నిన్ను ప్రాధేయపడుతారు. నేనే అలా జరిగిస్తాను.
12 ఎవడైనా ఇనుమును –
ఉత్తర దిక్కునుంచి వచ్చే ఇనుమును,
కంచును విరవగలడా?
13 మీ దేశమంతటా మీరు చేసిన అన్ని అపరాధాల
కారణంగా మీ సంపదను, మీ విలువైన వస్తువులను
వెల లేకుండా దోపిడీగాళ్ళకు ఇస్తాను.
14  మీకు తెలియని దేశంలో మీ విరోధులకు
మిమ్ములను దాసులుగా చేస్తాను.
నా కోపం మంటల్లాగా రగులుకొంది.
అది మీమీద మండుతూ ఉంటుంది.”
15 యెహోవా! నీవు నన్ను ఎరుగుదువు.
నన్ను తలచుకొని నన్ను సందర్శించు.
నన్ను బాధించేవాళ్ళమీద నాకోసం ప్రతీకారం చెయ్యి.
నీవు చాలా ఓర్పు గలవాడివి –
నన్ను తీసుకుపోవద్దు.
నేను నీకోసమే నింద భరిస్తూ ఉన్నానని
జ్ఞాపకం ఉంచుకో.
16 సేనలప్రభువు యెహోవాదేవా!
నేను నీ పేరు భరిస్తున్నాను.
నీ వాక్కులు నాకు దొరికితే వాటిని తిన్నాను.
అవి నాకు సంతోషంగా హృదయానందంగా ఉన్నాయి.
17 వేడుక చేసుకొనేవారి గుంపు మధ్య
నేను కూర్చుని సంబరపడలేదు.
నీ చేయి నామీద ఉంది, నీవు నన్ను కోపంతో
నింపావు గనుక నేను ఒంటరిగా కూర్చున్నాను.
18 నా బాధకు అంతం ఎందుకు లేనట్టు?
నా గాయం ఎందుకు ఘోరమై నయం కాకుండా ఉంది?
నీవు నాకు నమ్మరాని ఊటలాగా,
ఇంకిపోయే నీళ్ళలాగా ఉంటావా?
19 అందుకు యెహోవా చెప్పాడు,
“నీవు నావైపు మళ్ళీ తిరుగాలని ఉంటే
నిన్ను తిరిగేలా చేస్తాను.
నా సన్నిధానంలో నీవు నిలుస్తావు.
పనికిమాలిన మాటలేవో యోగ్యమైన మాటలేవో
నీవు గుర్తించి పలికితే,
నీవు నాకు బదులు మాట్లాడేవాడుగా ఉంటావు.
ఈ ప్రజ నీవైపు తిరగాలి. నీవు వారివైపు
తిరగకూడదు.
20 నేను నిన్ను ఈ ప్రజకు కోటలున్న
కంచు గోడగా చేస్తాను.
వాళ్ళు నీమీద పోరాడుతారు గాని గెలవలేకపోతారు.
నిన్ను కాపాడి రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను.
ఇది యెహోవా వాక్కు.
21 నేను నిన్ను దుర్మార్గుల చేతిలోనుంచి తప్పిస్తాను,
దౌర్జన్యపరుల బారినుంచి విడిపిస్తాను.”