14
1  వర్షం లేని కాలాన్ని గురించి యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు –
2 “యూదా దుఃఖిస్తూ ఉంది. దాని ద్వారాలు
నీరసించిపొయ్యాయి. ప్రజలు నేలమీద
విలపిస్తూ ఉన్నారు.
జెరుసలం చేసే రోదనం పైకి పోతూ ఉంది.
3 వాళ్ళ నాయకులు నీళ్ళకోసం పనివాళ్ళను పంపుతారు.
వాళ్ళు బావులదగ్గరికి పోతే నీళ్ళుండవు.
వాళ్ళు ఖాళీ కడవలతో తిరిగి వస్తారు.
నిరాశ చెంది, నొచ్చుకుంటూ, తమ తలలు కప్పుకొంటారు.
4 దేశంలో వర్షం రాకపోవడంచేత నేల బీటలు వారింది.
కర్షకులు ఆశాభంగం పొంది తమ తలలు కప్పుకొంటారు.
5 లేడి మైదానంలో ఈని పిల్లను వదలివేస్తుంది.
ఎందుకంటే అక్కడ గడ్డి లేదు.
6 అడవి గాడిదలు చెట్లులేని ఎత్తు స్థలాలమీద
నిలబడి ఉండి నక్కలలాగా రొప్పుతూ ఉన్నాయి.
మేత లేక వాటి కండ్లు పీక్కుపోతున్నాయి.”
7 యెహోవా! మేము చాలా సార్లు
త్రోవ తప్పిపోయాం, నీకు వ్యతిరేకంగా అపరాధం చేశాం.
మా అపరాధాలు మాకు విరుద్ధంగా సాక్ష్యం
ఇస్తూ ఉన్నాయి.
అయినా నీ పేరు ప్రతిష్ఠలకోసం ఏదైనా చెయ్యి.
8 ఇస్రాయేల్ ప్రజకు ఆశ్రయంగా ఉన్నవాడా!
కష్టకాలంలో వారికి రక్షకా! ఈ దేశంలో
నీవెందుకు పరాయివాడుగా ఉన్నావు?
ఒక్క రాత్రే బస చేసే బాటసారిలాగా ఉన్నావు?
9 నీవెందుకు నిర్ఘాంతపోయిన మనిషిలాగా,
కాపాడలేని బలాఢ్యుడిలాగా ఉన్నావు?
యెహోవా! నీవు మామధ్య ఉన్నావు.
నీ పేరు మా మీద నిలిచి ఉంది.
మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
10 ఈ ప్రజను గురించి యెహోవా చెప్పేదేమిటంటే,
“తిరుగులాడడం అంటే ఈ ప్రజకు చాలా ఇష్టం.
తమ అడుగులు హద్దులో ఉంచేవారు కారు.
అందుచేత యెహోవా వారిని స్వీకరించడం లేదు.
ఇప్పుడు ఆయన వాళ్ళ దురాచారాలను తలచుకొని,
వాళ్ళ అపరాధాల కారణంగా వాళ్ళను శిక్షిస్తాడు.”
11 అప్పుడు యెహోవా నాతో అన్నాడు, “ఈ ప్రజల క్షేమంకోసం ప్రార్థన చేయకు. 12 వాళ్ళు ఉపవాసం ఉన్నా వాళ్ళ మొర నేను వినను. వాళ్ళు హోమాలు, నైవేద్యాలు అర్పించినా నేను వాళ్ళను స్వీకరించను. దానికి బదులుగా వాళ్ళను ఖడ్గానికీ, కరవుకూ ఘోరవ్యాధికీ గురిచేసి నాశనం చేస్తాను.”
13 అందుకు నేను అన్నాను, “అయ్యో. యెహోవా ప్రభూ! ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెపుతున్నారు: మీరు ఖడ్గం చూడరు, కరవు రాదు, ఇక్కడ స్థిరమైన శాంతి మీకు ప్రసాదిస్తాను.”
14  అప్పుడు యెహోవా నాతో అన్నాడు, “ప్రవక్తలు నా పేర అబద్ధాలు పలుకుతున్నారు. నేను వాళ్ళను పంపలేదు, వాళ్ళను నియమించలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళు పలుకుతూ ఉండేది మాయాదర్శనాలు, పనికిమాలిన శకునాలు, వాళ్ళ మనసులో పుట్టే మోసాలు. 15 అందుచేత యెహోవా అనే నేను నా పేర పలికే ఆ ప్రవక్తలను గురించి చెప్పేదేమిటంటే, నేను వాళ్ళను పంపకపోయినా, వాళ్ళు ‘ఈ దేశంమీదికి ఖడ్గం గానీ, కరవుగానీ రాదు’ అంటున్నారు – ఆ ప్రవక్తలు ఖడ్గంచేత, కరవుచేత నాశనమవుతారు. 16 అంతేగాక, వాళ్ళు ఎవరితో నా పేరు పలుకుతున్నారో ఆ ప్రజలను కరవు, ఖడ్గం కారణంగా జెరుసలం వీధుల్లో పడవేయడం జరుగుతుంది. వాళ్ళను, వాళ్ళ భార్యలను వాళ్ళ కొడుకులను, కూతుళ్ళను పాతిపెట్టడానికి ఎవ్వరూ ఉండరు. వాళ్ళకు తగిన కీడు వాళ్ళమీద కుమ్మరిస్తాను.
17  “నీవు వాళ్ళతో ఈ మాటలు చెప్పాలి –
‘కన్యకుమార్తె – నా ప్రజ – పెద్ద దెబ్బకు గురి అయి
నలిగిపోయింది, ఘోరమైన గాయం పొందింది,
గనుక రాత్రింబగళ్ళు, ఎడతెరిపి లేకుండా
నేను కన్నీరు మున్నీరుగా విలపిస్తాను.
18 నగరంనుంచి బయటి ప్రాంతానికి నేను వెళ్ళి చూస్తే
ఖడ్గంచేత హతమైనవారు కనిపిస్తున్నారు.
నగరంలోకి వెళ్ళి చూస్తే కరవుచేత బాధపడేవాళ్ళు
కనిపిస్తున్నారు.
ప్రవక్తలూ యాజులూ తమకు తెలియని దేశంలో
తిరుగులాడుతున్నారు.”
19 నీవు యూదాను పూర్తిగా విసర్జించావా?
సీయోను అంటే నీకు అసహ్యంగా ఉందా?
మేము బాగుపడలేనంతగా మమ్మల్ని
నీవెందుకు కొట్టావు?
మేము శాంతికోసం చూశాం గాని,
మంచి ఏమీ జరగలేదు.
క్షేమంకోసం చూశాం గాని, భయమే ప్రాప్తించింది.
20 యెహోవా! మేము నీకు వ్యతిరేకంగా
పాపం చేశాం. మేము చేసిన చెడుగు,
మా పూర్వీకులు చేసిన అపరాధాలు ఒప్పుకొంటున్నాం.
21 మమ్మల్ని త్రోసివేయవద్దు –
నీ పేరుప్రతిష్ఠలను గురించి ఆలోచించు.
గౌరవప్రదమైన నీ సింహాసనాన్ని అవమానపరచకు.
నీవు మాతో చేసిన ఒడంబడికను తలచుకొని
దానిని భంగం చేయకు.
22 ఇతర జనాలు పెట్టుకొన్న వ్యర్థమైన విగ్రహాలలో
ఏదైనా వర్షం కురిపించగలదా?
ఆకాశం దానంతట అదే వాన ఇస్తుందా?
మా దేవుడవైన యెహోవా! వాన కురిపించేది నీవే.
ఇలాంటి వాటన్నిటినీ నీవే చేస్తున్నావు.
గనుక నీకోసమే మేము ఆశాభావంతో చూస్తున్నాం.