13
1 ✽యెహోవా నాతో ఇలా చెప్పాడు: “వెళ్ళి నీ నడుముకు ఒక అవిసెనార తుండు గుడ్డ కొనుక్కో. దానిని నడికట్టుగా కట్టుకో. దానిని నీళ్ళలో పెట్టవద్దు.” 2 అలాగే, యెహోవా మాట ప్రకారం ఆ గుడ్డ కొని నా నడుముకు కట్టుకొన్నాను.3 రెండోసారి యెహోవా నాతో మాట్లాడాడు – 4 ✽“నీవు కొని నడుముకు కట్టుకొన్న నడికట్టును చేతపట్టుకొని యూఫ్రటీసు దగ్గరికి వెళ్ళు. అక్కడ ఒక రాతి సందులో దానిని దాచిపెట్టు.” 5 యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేను వెళ్ళి యూఫ్రటీసు ఒడ్డున దానిని దాచాను.
6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “నేను నీకు యూఫ్రటీసు దగ్గర దాచిపెట్టమని చెప్పిన నడికట్టు వెళ్ళి తీసుకురా.” 7 అలాగే నేను యూఫ్రటీసు వెళ్ళి, నడికట్టు దాచిన చోటును త్రవ్వి తీసుకొన్నాను. అది పాడైపోయి, ఎందుకూ పనికిరానిదిగా ఉంది.
8 అప్పుడు యెహోవా వాక్కు నాకు వచ్చింది: 9 ✝“యెహోవా చెప్పేదేమిటంటే, అలాగే నేను యూదావారి గర్వాన్ని, జెరుసలంవారి గర్వాన్ని భంగం చేస్తాను. 10 ఈ నడికట్టు ఎందుకూ పనికిరానిదిగా ఉంది గదా. అలాగే నా మాటలు వినడం తిరస్కరించిన ఈ చెడ్డ ప్రజ ఉంటారు. వాళ్ళు తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరిస్తూ, ఇతర దేవుళ్ళను పూజించడానికి, సేవించడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. 11 ✽ఒక మనిషి నడుముకు నడికట్టు కట్టుకొన్నట్టు నేను ఇస్రాయేల్ వంశమంతటినీ యూదా వంశమంతటినీ నా చుట్టూ కట్టుకొన్నాను. వారు నాకు ప్రజలై ఉండి నాకు పేరుప్రతిష్టలు, ఘనత తేవాలని నా ఆశయం. అయితే వారు వినలేదు. ఇది యెహోవా వాక్కు.
12 ✝“నీవు వాళ్ళతో ఈ మాట చెప్పు: ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, ప్రతి ద్రాక్షమద్యం తిత్తినిండా ద్రాక్షమద్యం ఉండాలి. వాళ్ళు ‘ప్రతి ద్రాక్ష తిత్తినిండా ద్రాక్షమద్యం ఉండాలని మాకు బాగా తెలుసు గదా’ అని నీతో అంటారు. 13 అప్పుడు నీవు వాళ్ళతో ఇలా చెప్పు: ఈ దేశంలో ఉంటున్న వాళ్ళందరినీ – దావీదు సింహాసనంమీద కూర్చుని ఉన్న రాజును, యాజులను, ప్రవక్తలను, జెరుసలం నివాసులందరినీ – మత్తుతో నింపుతాను. 14 ✽ఒకడిమీద ఒకడు, తండ్రులతోపాటు కొడుకులు కూలేట్టు చేస్తాను. జాలి, కరుణ, కనికరం వాళ్ళను నాశనం చేయకుండా నన్ను ఆపవు.” ఇది యెహోవా వాక్కు.
15 ✽యెహోవా మాట్లాడాడు. విర్రవీగకుండా,
చెవిపెట్టి వినండి.
16 ✽మీ దేవుడు యెహోవా చీకటి కలిగించకముందే,
చీకటి కమ్ముతూ ఉన్న కొండలపైన మీ కాళ్ళు
తొట్రుపడకముందే ఆయనను గౌరవించండి.
మీరు వెలుగుకోసం చూస్తూ ఉంటే,
ఆయన దానిని చావు నీడగా,
గాఢాంధకారంగా మారుస్తాడు.
17 ✽ మీరు వినకపోతే నేను రహస్యంగా
మీ గర్వానికి విలపిస్తాను.
యెహోవా మందను చెరపట్టడం జరుగుతుందని
కన్నీరు మున్నీరుగా ఏడుస్తాను.
18 ✽రాజుతో, రాజమాతతో “క్రిందికి దిగి వేరే చోట కూర్చోండి.
మీ ఘనమైన కిరీటం మీ తలమీదనుంచి పడుతుంది” అను.
19 ✝దక్షిణ ప్రదేశం పట్టణాలు మూయబడి ఉంటాయి.
వాటిని తెరిచేవాడు ఎవ్వడూ ఉండడు.
యూదావాళ్ళందరినీ బందీలుగా తీసుకుపోవడం
జరుగుతుంది.
20 మీ తలెత్తి, ఉత్తర దిక్కు✽నుంచి వస్తూ ఉన్న
వాళ్ళను చూడండి.
నీకిచ్చిన అందమైన మంద✽ ఎక్కడ ఉంది?
21 నీకు నీవే వాళ్ళను మిత్రులు✽గా చేసుకొన్నావు.
యెహోవా వాళ్ళనే నీపై అధికారులుగా
నియమించేటప్పుడు నీవేం చెపుతావు?
ప్రసవిస్తూవున్న స్త్రీ✽లాగా నీవు వేదనపాలవుతావు గదా.
22 ✽“నాకెందుకు ఇలా సంభవించింది?”
అని నీవు మనసులో అనుకొంటే అనేకమైన
నీ అపరాధాలే దానికి కారణమని తెలుసుకో,
అందుకే నీ బట్టలు తీసివేయడం,
నీ కాళ్ళు కనుపరచడం జరుగుతుంది.
23 ✽“కూషు దేశస్తుడు తన చర్మం మార్చుకోగలడా?
చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా?
అది సాధ్యమైతే చెడుగు చేయడం అలవాటుపడ్డ
మీరు మంచి చేయడం కూడా వీలవుతుంది.
24 ✝ఎడారి గాలి ఎగరగొట్టే పొట్టులాగా మిమ్మల్ని
నేను చెదరగొట్టివేస్తాను.
25 మీరు నన్ను మరచిపోయి అబద్ధాలను నమ్ముకొన్నారు,
గనుక అదే మీ వంతు, నేను మీకు కొలిచిన భాగం.
ఇది యెహోవా వాక్కు.
26 ✽నేనే మీ బట్టల అంచులను మీ ముఖంమీద
పడేలా చేస్తాను. అప్పుడు మీ సిగ్గు కనిపిస్తుంది.
27 నీ వ్యభిచారం, కామాతురత వెల్లడి చేసే మీ సకిలింపులు,
కొండలపై, పొలాలలో మీ నీచమైన✽ పడుపు పనులు
నాకు కనిపించాయి.
నీ అసహ్యమైన కార్యాలన్నీ నేను చూశాను.
అయ్యో, జెరుసలం! నీకు బాధ తప్పదు.
ఎన్నాళ్ళు నీవు శుద్ధి కాకుండా ఉంటావు?”