12
1  యెహోవా! నీవు నిజాయితీపరుడవు.
గనుక నేను నీ ఎదుట ఫిర్యాదు చేసుకొంటున్నాను.
నేను నీ నిర్ణయాలను గురించి నీతో
మాట్లాడాలని ఉంది.
దుర్మార్గుల బ్రతుకు తీరు ఎందుకు వర్ధిల్లుతుంది?
వంచకులంతా ఎందుకు సురక్షితంగా ఉంటున్నారు?
2 నీవు వాళ్ళను నాటావు. వాళ్ళు వేరుపారి
పెరిగి ఫలిస్తున్నారు.
వాళ్ళ నోటి మాట వింటే నీవు దగ్గరగా
ఉన్నట్టున్నావు గాని,
వాళ్ళ అంతరంగానికి నీవు దూరంగా ఉన్నావు.
3 యెహోవా, నీవు నన్ను ఎరుగుదువు.
నన్ను చూస్తూవున్నావు.
నీపట్ల నా హృదయాలోచనలను పరిశోధిస్తూ ఉన్నావు.
వధకు సిద్ధమైన గొర్రెలలాగా వాళ్ళను ఈడ్చుకుపో!
వధ జరిగే రోజుకోసం వాళ్ళను ప్రత్యేకించు!
4 ఎన్నాళ్ళు దేశం నీరసించి ఉంటుంది?
ఎన్నాళ్ళు ప్రతి పొలంలో గడ్డి ఎండిపోయి ఉంటుంది?
దేశంలో కాపురముంటున్నవాళ్ళ చెడుగు కారణంగా
జంతువులు, పక్షులు నాశనమయ్యాయి.
‘మనకు ఏం జరుగబోతుందో ఆయన చూడడు’
అని వాళ్ళు చెప్పుకొంటున్నారు.
5 “నీవు పదాతులతో పరుగెత్తినప్పుడు
వాళ్ళు నిన్ను అలసిపోయేలా చేస్తే,
నీవు గుర్రాలతో ఎలా పోటీపడుతావు?
నెమ్మదియైన ప్రాంతంలోనే నీవు నిర్భయంగా ఉంటే,
యొర్దాను వరదలలో చిక్కితే ఎలా చేస్తావు?
6 నీ సోదరులు, నీ తండ్రి ఇంటివాళ్ళే
నీకు ద్రోహం చేశారు.
నీ విషయం పెద్ద అలజడి కలిగించారు వాళ్ళు.
నీతో మంచి మాటలు చెప్పినా వాళ్ళనూ నమ్మవద్దు.
7 “నేను నా ఆలయాన్ని విడుస్తున్నాను.
నా సొత్తును వదలివేస్తున్నాను.
నా ప్రియ ప్రజను వారి శత్రువుల వశం చేస్తున్నాను.
8 నా సొత్తు నాకు అడవిలో ఉన్న సింహంలాగా అయింది.
అది నామీద గర్జిస్తూ ఉంది, గనుక దానిని
అసహ్యించుకొన్నాను.
9 నా సొత్తు నాకు పొడలు గల డేగలాగా అయింది.
దానిచుట్టు ఉన్న డేగలు దానిపైబడుతాయి.
వెళ్ళి, అడవి మృగాలన్నిటినీ పోగు చేయండి.
అవి తినడానికి వాటిని తీసుకురండి.
10 కాపరులు అనేకులు. వాళ్ళు నా ద్రాక్షతోటను
పాడు చేశారు. నా భూభాగాన్ని పాడైపోయిన
ఎడారిగా మారుస్తున్నారు.
11 వాళ్ళు దానిని పాడు చేశారు.
అది పాడుపడి నా ఎదుట దుఃఖిస్తూ ఉంది.
దాని గురించి అందరూ నిర్లక్ష్యంగా ఉన్నారు
గనుక దేశమంతా పాడైపోతుంది.
12 ఎడారిలో చెట్లులేని ఎత్తు స్థలాలన్నిటిమీదికి
వినాశకారులు వస్తారు.
దేశంలో ఈ కొననుంచి ఆ కొనవరకు యెహోవా ఖడ్గం
హతం చేస్తుంది. ఎవ్వరూ భద్రంగా ఉండరు.
13 వాళ్ళు గోధుమలు చల్లుతారు గాని,
ముండ్లు కోస్తారు. ఏమీ ప్రయోజనం లేకుండా
అలసిపోతారు.
యెహోవా కోపాగ్ని కారణంగా వాళ్ళ
పంటవల్ల సిగ్గుపడుతారు.”
14 యెహోవా ఇంకా చెప్పేదేమిటంటే, “నేను నా ప్రజలైన ఇస్రాయేల్‌వారికి ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొన్న నా చెడ్డ పొరుగువాళ్ళకు ఇలా చేస్తాను – వాళ్ళ దేశంలోనుంచి వాళ్ళను పెళ్ళగిస్తాను. వాళ్ళ మధ్యనుంచి యూదాప్రజను పెళ్ళగిస్తాను. 15 వాళ్ళను అలా పెళ్ళగించిన తరువాత నేను వాళ్ళను మళ్ళీ కరుణించి ఒక్కొక్క జనాన్ని వాళ్ళ దేశానికి, వారసత్వం భూమికి వచ్చేలా చేస్తాను. 16 మునుపు వాళ్ళు నా ప్రజకు బయల్‌దేవుడి పేర ప్రమాణం చేయడానికి నేర్పించారు. వాళ్ళు నా ప్రజల జీవిత విధానాలను బాగా నేర్చుకొని ‘యెహోవా జీవంతోడు’ అని ప్రమాణం చేయడం అభ్యసిస్తే అప్పుడు వాళ్ళు నా ప్రజలమధ్య అభివృద్ధి పొందుతారు. 17 ఏ జనమైనా లోబడకపోతే నేను ఆ జనాన్ని పూర్తిగా పెళ్ళగించి నాశనం చేస్తాను. ఇది యెహోవా వాక్కు.