11
1 ఇది యెహోవానుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు.
2 ఈ ఒడంబడిక మాటలు విని, యూదాప్రజలకు, జెరుసలం నివాసులకు చెప్పాలి. 3 వారితో ఇలా అను: “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నేను మీ పూర్వీకులను ఇనుప కొలిమిలాంటి ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చి వారితో ఒడంబడిక చేశాను. ఈ ఒడంబడిక మాటలకు లోబడనివాడు శాపానికి గురి అవుతాడు. 4 ఆ కాలంలో మీ పూర్వీకులను ఇలా ఆదేశించాను: ‘నా మాట వినండి. నేను మీకు ఆజ్ఞాపించినదంతటి ప్రకారం ప్రవర్తించండి. అప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడనై ఉంటాను, 5 మీ పూర్వీకులకు పాలుతేనెలు నదులై పారే దేశాన్ని ఇస్తానని నేను చేసిన ప్రమాణం నెరవేరుస్తాను.’ ఇప్పుడు మీరు వాగ్దత్త దేశంలో ఉన్నారు.”
అందుకు నేను “నిజమే, యెహోవా” అని జవాబిచ్చాను.
6 యెహోవా నాతో అన్నాడు, “యూదా పట్టణాలలో, జెరుసలం వీధులలో ఈ మాటలన్నీ ప్రకటించు: ఈ ఒడంబడిక మాటలు విని, వాటిప్రకారం ప్రవర్తించండి. 7 నేను మీ పూర్వీకులను ఈజిప్ట్‌నుంచి తీసుకువచ్చిన కాలం మొదలుకొని ఈ రోజువరకు ప్రొద్దున్నే లేచి నా మాట వినండని ఖచ్చితంగా హెచ్చరిస్తూ వచ్చాను. 8 అయినా వారు వినలేదు. పెడచెవిని పెట్టి ప్రతి ఒక్కరూ తమ చెడ్డ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్ని అనుసరించారు. ఆచరించండని నేను ఆజ్ఞాపించిన ఈ ఒడంబడికను వారు ఆచరించలేదు. అందుచేతే ఒడంబడికలో ఉన్న శాపనార్థాలు వారిమీదికి రప్పించాను.”
9 అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “యూదావారిమధ్య, జెరుసలం నివాసులమధ్య కుట్ర జరుగుతూ ఉంది. 10 నా మాటలు వినని తమ పూర్వీకుల అపరాధాలను వాళ్ళు అనుసరించారు. ఇతర దేవుళ్ళను అనుసరించి పూజించారు. వారి పూర్వీకులతో నేను చేసిన ఒడంబడికను ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ భంగం చేశారు. 11 గనుక యెహోవా చెప్పేదేమిటంటే, నేను వారిమీదికి తప్పించుకోలేని విపత్తు రప్పిస్తాను. వారు నాకు మొరపెట్టినా నేను వినను. 12  అప్పుడు యూదా పట్టణాలలో, జెరుసలంలో ఉండేవారు వెళ్ళి, తాము ధూపం వేసిన దేవతలకు మొర పెట్టుకొంటారు. అయితే వారిమీదికి వచ్చే ఆ విపత్తు కాలంలో వారిని అవి ఎంతమాత్రమూ కాపాడలేవు. 13 యూదా! నీ పట్టణాలెన్నో అన్ని దేవతలు నీకు ఉన్నాయి. జెరుసలం వీధులెన్నో ధూపం వేయడానికి అన్ని బలిపీఠాలను బయల్‌దేవుడి నీచమైన విగ్రహాలకు నిలిపారు. 14 యిర్మీయా! ఈ ప్రజకోసం ప్రార్థించకు. వారికోసం ఏమీ విన్నపం, ప్రార్థన చేయవద్దు. వారి విపత్తు కాలంలో వారు నాకు మొరపెట్టుకొన్నప్పుడు నేను వినను.
15 “అనేక చెడు కార్యాలు జరిగించిన
నా ప్రియప్రజకు నా ఆలయంలో ఏమి పని?
మీరు సంతోషించేలా, బలి మాంసం అర్పించడం
అనేది మీమీదికి విపత్తు రాకుండా చేస్తుందా?”
16 ఒకసారి యెహోవా మిమ్మల్ని
“మంచి పండ్లు కాసే అందమైన పచ్చని చెట్టు” అన్నాడు.
ఇప్పుడైతే గొప్ప తుఫాను ధ్వని వినబడుతూ ఉంటే
ఆయన జ్వాల అంటిస్తాడు.
ఈ చెట్టు కొమ్మలు విరిగిపోతాయి.
17 సేనలప్రభువు యెహోవా మిమ్మల్ని నాటాడు గాని ఇప్పుడు మీమీదికి విపత్తు రప్పిస్తాను అన్నాడు. దీనికి కారణం ఆయన మాటలలో ఉంది – “ఇస్రాయేల్‌ప్రజ, యూదాప్రజ చెడుగు చేస్తూ, బయల్‌దేవుడికి ధూపం వేస్తూ, నాకు కోపం రేపారు.”
18 వాళ్ళు పన్నిన కుట్ర యెహోవా నాకు వెల్లడి చేసినందుచేత నాకు తెలిసింది. వాళ్ళ క్రియలు ఆయన నాకు చూపించాడు. 19 అంతకుముందు నేను వధకు తేబడ్డ సాధువైన గొర్రెలాంటివాణ్ణి; వాళ్ళు నాకు వ్యతిరేకంగా కుట్ర చేసి, ఇలా చెప్పిన సంగతి నాకు తెలియదు –
“చెట్టును దాని కాయలతో కూడా నరికివేద్దాం పట్టండి.
ఇకమీదట వాడి పేరే గుర్తు రాకుండా
సజీవుల లోకంలో నుంచి వాణ్ణి కొట్టివేద్దాం.”
20 సేనలప్రభువు యెహోవా!
నీవు న్యాయంగా తీర్పు తీర్చేవాడివి.
హృదయాన్నీ మనసునూ పరిశోధించేవాడివి.
నా వ్యాజ్యెం నీకు అప్పచెప్పాను.
నీవు వాళ్ళమీద ప్రతీకారం చేయడం
నన్ను చూడనియ్యి.
21 అందుకు “అనాతోతువాళ్ళు నీ ప్రాణం తీయడానికి చూస్తూ, ‘యెహోవామూలంగా పలకవద్దు. పలికితే మాచేత నీవు చస్తావు’ అంటున్నారు, వాళ్ళ విషయం సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, 22 నేను వాళ్ళను దండిస్తాను. వాళ్ళలో యువకులు కత్తిపాలవుతారు. వారి కొడుకులు, కూతుళ్ళు కరవుకు గురి అయి చస్తారు. 23 దండన సంవత్సరంలో అనాతోతువారిమీదికి నేను విపత్తు రప్పిస్తాను. వారిలో ఎవ్వరూ మిగలరు.”