10
1 ఇస్రాయేల్ వంశీయులారా, మీకు యెహోవా చెప్పే మాట వినండి. 2 యెహోవా చెప్పేదేమిటంటే,
“ఇతర జనాల బ్రతుకు తీరును నేర్చుకొని
అవలంబించవద్దు.
వాళ్ళు ఆకాశంలో కనిపించే సూచనలకు
భయపడే విధంగా మీరు భయపడవద్దు.
3 ఆ జనాల ఆచారాలు నిష్‌ప్రయోజనం.
అడవిలో చెట్టును నరికివేస్తారు.
పనివాడు దానిని గొడ్డలితో చెక్కుతాడు.
4 అప్పుడు వాళ్ళు వెండి బంగారాలతో
దానిని అలంకరిస్తారు.
అది కదలకుండా సుత్తెతో మేకులు దిగగొట్టివేస్తారు.
5 వాళ్ళ విగ్రహాలు దోసతోటలో దిష్టిబొమ్మల్లాగా ఉన్నాయి.
అవి మాట్లాడలేవు, నడవలేవు కూడా.
వాటిని మోసుకుపోవాలి.
వాటికి భయపడవద్దు. అవి ఏమీ హాని చేయలేవు,
ఏమీ మంచి చేయలేవు.”
6 యెహోవా! నీలాంటివాడెవ్వడూ లేడు.
నీవు గొప్పవాడివి. బలప్రభావాలలో నీ పేరు గొప్పది.
7 నీవు జనాలకు రాజువు.
నీవంటే అందరికీ భయభక్తులు కలగాలి.
అది తగినదే. జనాలన్నిటిలో, వాళ్ళ రాజ్యాలన్నిటిలో
ఉన్న జ్ఞానులందరిలో నీలాంటివాడెవ్వడూ లేడు.
8 వాళ్ళంతా బుద్ధిలేనివాళ్ళు, మూర్ఖులు.
వాళ్ళు పొందే ఉపదేశం వ్యర్థం –
దానిని ఇచ్చినది చెక్క విగ్రహం!
9 తర్షీషునుంచి సాగగొట్టిన వెండి రేకులను,
ఉపాజునుంచి బంగారాన్ని తెస్తారు.
అది పనివాళ్ళు, కంసాలులు చేసిన పని.
ఆ విగ్రహాలకు నీలి, ఊదా రంగులున్న బట్టలు తొడిగిస్తారు.
అదంతా నేర్పరులైన పనివాళ్ళు చేసిన పని.
10 గాని, యెహోవాయే నిజమైన దేవుడు.
ఆయనే జీవంగలదేవుడు, శాశ్వతంగా ఉండేరాజు.
ఆయన కోపగిస్తే భూమి కంపిస్తుంది.
ఆయన ఆగ్రహాన్ని జనాలు భరించలేరు.
11 “మీరు వాళ్ళతో ఇలా చెప్పాలి:
భూమిని, ఆకాశాన్ని కలిగించని దేవుళ్ళు,
దేవతలు భూమిమీద, ఆకాశంక్రింద ఉండకుండా
నాశనం అవుతారు.”
12 ఆయన తన బలంచేత భూమిని కలుగజేశాడు.
జ్ఞానపూర్వకంగా ప్రపంచాన్ని సృజించాడు.
తన తెలివితో ఆకాశాలను పరిచాడు.
13 ఆయన ఆజ్ఞ జారీ చేస్తే ఆకాశంలో నీళ్ళ ధ్వని
వినబడుతుంది.
భూమి కొనలనుంచి మబ్బులు పైకి వచ్చేలా
ఆయన చేస్తాడు.
వానతోపాటు మెరుపు పుట్టిస్తాడు.
తన గిడ్డంగులలో నుంచి గాలి రప్పిస్తాడు.
14 ప్రతి మనిషీ మూఢుడు, తెలివితక్కువవాడు.
విగ్రహాలు చేసే ప్రతివాడూ వాటివల్ల
అవమానం పాలవుతాడు.
వాడు పోత పోసిన విగ్రహాలు అబద్ధం.
వాటిలో ఊపిరి కూడా లేదు.
15 అవి పనికిమాలినవి. హేళనకు తగినవి.
అవి తీర్పుకు గురి అయ్యేటప్పుడు,
అవి నిర్మూలమవుతాయి.
16 యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు
వాటిలాంటివాడు కాడు.
ఆయన సమస్తాన్ని కలగజేసినవాడు.
ఇస్రాయేల్‌ప్రజ ఆయన సొత్తు.
ఆయన పేరు సేనలప్రభువు యెహోవా.
17 ముట్టడి వేసిన స్థలంలో కాపురమున్నవారలారా!
దేశం విడిచి వెళ్ళడానికి సామాను కూర్చుకోండి.
18 యెహోవా చెప్పేదేమిటంటే, “ఇప్పుడు
ఈ దేశనివాసులను బయటికి విసరివేస్తాను.
వారు పట్టబడాలని వారిమీదికి చేటు రప్పిస్తాను.”
19 అయ్యో! నాకు దెబ్బ తగిలింది.
నా గాయం మానేది కాదు. అయితే నేను “ఇది నా బాధ.
నేను సహించాలి” అనుకొన్నాను.
20 నా డేరా పాడైపోయింది. తాళ్ళన్నీ తెగిపొయ్యాయి.
నా సంతానం నాదగ్గరనుంచి పోయారు.
వారు ఇక లేరు. నా డేరా మళ్ళీ వేయడానికి,
నా అడ్డతెరలు పెట్టడానికి ఎవ్వరూ లేరు.
21 కాపరులు మందమతులు.
ఉపదేశంకోసం యెహోవాను అడగరు.
గనుకనే వాళ్ళు వర్ధిల్లడం లేదు.
వాళ్ళ మంద చెదరిపోయి ఉంది.
22 వినండి! ఉత్తర దేశంలో మహా చలనం ఉన్నట్టు
వార్త వినబడుతూ ఉంది.
దానివల్ల యూదా పట్టణాలు పాడైపోతాయి,
నక్కలకు ఉనికిపట్టుగా మారిపోతాయి.
23  యెహోవా! మనిషి త్రోవ తన వశంలో
లేదని నాకు తెలుసు.
తన అడుగులు సరిగా వేయడం మనిషి తరం కాదు.
24 యెహోవా! నన్ను న్యాయంగా శిక్షించి
సరిదిద్దు గాని, కోపంగా వద్దు.
అలా చేస్తే నేను బొత్తిగా లేకుండా పోతాను.
25 నీ విషయం నిర్లక్ష్యంగా ఉన్న జనాలమీద,
నీ పేర ప్రార్థన చేయని జాతులమీద
నీ కోపాగ్ని కుమ్మరించు.
వాళ్ళు యాకోబు వంశాన్ని దిగమ్రింగివేశారు.
నిర్మూలం చేయాలని దిగమ్రింగివేశారు.
దాని నివాస స్థలాలను పాడు చేశారు.