9
1  నా తల బావిగా, నా కండ్లు
కన్నీళ్ళ ఊటగా ఉంటే ఎంత బాగుండేది!
అలాంటప్పుడు నా ప్రజలో హతమైన వారికోసం
రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉంటాను.
2 ఎడారిలో నాకు సత్రం దొరికితే ఎంత బాగుండేది!
అలాంటప్పుడు నా ప్రజను విడిచిపెట్టి వెళ్ళి
అక్కడ ఉండేవాణ్ణి. ఎందుకంటే,
వాళ్ళంతా వ్యభిచారులు, ద్రోహుల గుంపు.
3 యెహోవా చెప్పేదేమిటంటే,
“అబద్ధాలు ఆడడానికి విల్లులాగా
తమ నాలుక వంచుతూ ఉంటారు.
సత్యంకోసం వాళ్ళు బలవంతులు కాలేదు.
ఒక చెడుగు వెంట ఇంకో చెడుగుకు
పరుగెత్తుతూ ఉంటారు. వాళ్ళు నన్ను ఎరగరు.
4  ప్రతి ఒక్కడూ పొరుగువాడి విషయం
జాగ్రత్తగా ఉండాలి.
సోదరులలో ఎవ్వరినీ నమ్ముకోవద్దు.
ప్రతి సోదరుడూ కుట్ర చేస్తాడు.
ప్రతి పొరుగువాడూ చాడీలు చెపుతూ
తిరుగులాడుతాడు.
5 ప్రతివాడూ పొరుగువాణ్ణి మోసం చేస్తున్నాడు.
ఎవ్వడూ నిజం పలకడం లేదు.
అబద్ధం ఆడడానికి తమ నాలుకలకు నేర్పించారు.
చెడుగు చేసీ చేసీ అలసిపోతున్నారు.
6 మోసంమధ్యనే కాపురముంటున్నావు.
వాళ్ళు మోసం చేస్తూ నన్ను గురించిన జ్ఞానాన్ని
తిరస్కరిస్తున్నారు. ఇది యెహోవా వాక్కు.”
7  అందుచేత సేనలప్రభువు యెహోవా చెప్పేది ఏమిటంటే,
“విను. నా ప్రజను లోహంలాగా కరిగించి,
శుద్ధి చేసి, పరీక్షిస్తాను. వాళ్ళకు ఇంకేమి చెయ్యగలను?
8 వాళ్ళ నాలుక ప్రాణాంతక బాణంలాంటిది.
అది మోసం పలుకుతుంది.
ప్రతి ఒక్కరూ పొరుగువాళ్ళతో స్నేహంగా మాట్లాడుతారు గాని,
మనసులో మాత్రం వంచన ఉంటుంది.
9 వీటికారణంగా వాళ్ళను నేను దండించకూడదా?
ఇలాంటి ప్రజమీద ప్రతీకారం చేయకూడదా?
ఇది యెహోవా వాక్కు.”
10  కొండలను గురించి నేను ఏడుస్తాను, రోదనం చేస్తాను.
అరణ్యంలో ఉన్న పచ్చిక మైదానాలను
గురించి విలపిస్తాను. అవి పాడైపొయ్యాయి.
వాటిమీదుగా ఎవ్వరూ వెళ్ళడం లేదు.
పశువుల అరుపులు వినబడడం లేదు.
గాలిలో ఎగిరే పక్షులు అంతర్ధానమయ్యాయి.
జంతువులు లేకుండా పొయ్యాయి.
11 “నేను జెరుసలం పాడుదిబ్బగా చేస్తాను,
నక్కలకు ఉనికిపట్టుగా చేస్తాను.
యూదా పట్టణాలలో ఎవ్వరూ కాపురముండకుండా
వాటిని పాడు చేస్తాను.”
12 ఈ విషయం గ్రహించడానికి చాలినంత జ్ఞానం ఎవరికి ఉంది? ఈ విషయం అతడు వివరించేలా ఎవడితో యెహోవా నోటి మాట పలికాడు? ఈ దేశం ఎందుకు నాశనమైంది? ఎవ్వరూ ప్రయాణం చేయకుండా అది ఎందుకు పాడుపడి ఎడారిలాగా అయిపోయింది?
13 యెహోవా ఇలా అంటున్నాడు: “దానికి కారణం ఏమిటంటే, నేను వారికిచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించారు, నా మాట వినలేదు, దానిని అనుసరించనే లేదు. 14 తమ హృదయంలో ఉన్న మూర్ఖత్వాన్నే అనుసరించారు, తమ పూర్వీకులు నేర్పించినట్టు బయల్ దేవుళ్ళను అనుసరించారు. 15 గనుకనే ఇస్రాయేల్‌ప్రజల దేవుడూ సేనలప్రభువూ అయిన యెహోవా చెప్పేదేమిటంటే, నేను ఈ ప్రజకు చేదు కూరను తినిపించి విష జలం త్రాగిస్తాను. 16 వారికి గానీ, వారి పూర్వీకులకు గానీ తెలియని జనాలమధ్య వారిని చెదరగొట్టివేస్తాను, వారు నాశనమయ్యేవరకు వారిమీదికి ఖడ్గం పంపుతాను.”
17 సేనలప్రభువు యెహోవా ఇలా చెపుతున్నాడు:
“ఆలోచించండి! రోదనం చేసే స్త్రీలను పిలవనంపించండి!
18 మన కండ్లు కన్నీళ్ళు విడిచేలా,
మన కంటి రెప్పల నుంచి నీళ్ళు పారేలా వారు
త్వరగా వచ్చి మనకోసం రోదనం చేస్తారు గాక!
19 సీయోనులోనుంచి రోదన ధ్వని
వినబడుతూ ఉంది:
‘మనం నాశనమయ్యాం! చాలా అవమానానికి
గురి అయ్యాం! వాళ్ళు మన ఇండ్లను పడగొట్టారు.
మనం దేశం విడిచిపెట్టాలి.”
20 స్త్రీలారా! యెహోవా చెప్పేది వినండి.
ఆయన నోటి మాట ఆలకించండి.
మీ కూతుళ్ళకు రోదనం చేయడం నేర్పండి.
దుఃఖ సూచకమైన పాటను ఒకరికొకరు నేర్పండి.
21 ఎందుకంటే, చావు మన కిటికీలగుండా చొరబడింది,
మన నగరులలో అడుగు పెట్టింది.
వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గాలలో
యువకులు లేకుండా అది చేస్తూ ఉంది.
22 ఇలా చెప్పు – “యెహోవా చెప్పేదేమిటంటే,
పొలాలలో పెంటలాగా మనుషుల మృతదేహాలు కూలుతాయి.
కోత కోసేవారి వెనుక పనలు పడ్డట్టు అవి పడుతాయి.
వాటిని పోగు చేయడానికి ఎవ్వరూ ఉండరు.”
23 యెహోవా చెప్పేదేమిటంటే,
“తెలివైనవాడు తెలివి ఉందని అతిశయపడకూడదు.
బలవంతుడు బలం ఉందని అతిశయపడకూడదు.
ధనవంతుడు ధనం ఉందని అతిశయ పడకూడదు.
24 ఎవరైనా అతిశయించాలంటే నేనే యెహోవాననీ,
భూమిమీద దయ చూపుతూ న్యాయాన్నీ ధర్మాన్నీ
జరిగిస్తూ ఉండేవాణ్ణి అనీ గ్రహించి,
నన్ను తెలుసుకొని అతిశయించాలి.
అలాంటి విషయాలంటే నాకు ఎంతో ఇష్టం.
ఇది యెహోవా వాక్కు.”
25 యెహోవా చెప్పేదేమిటంటే:
“ఇతర జనాలు సున్నతి పొందలేదు.
ఇస్రాయేల్‌ప్రజ హృదయంలో సున్నతి పొందలేదు.
26 సున్నతి పొందని వాళ్ళతోపాటు సున్నతి పొందిన
వాళ్ళను రాబోయే కాలంలో దండిస్తాను.
ఈజిప్ట్‌వాళ్ళనూ, యూదావాళ్ళనూ, ఎదోందేశస్తులనూ,
అమ్మోనువాళ్ళనూ, మోయాబుదేశస్తులనూ
ఎడారిలో ఉంటూ తమ తలప్రక్కలను కత్తిరించుకొన్న
వాళ్ళనూ శిక్షిస్తాను.”