8
1 ✽యెహోవా చెప్పేదేమిటంటే, “ఆ కాలంలో యూదా రాజుల ఎముకలను, అధికారుల ఎముకలను, యాజుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, జెరుసలం కాపురస్థుల ఎముకలను వాళ్ళ సమాధుల్లోనుంచి వెలుపలికి తీసివేయడం జరుగుతుంది. 2 ✽వాళ్ళు ప్రేమిస్తూ, సేవిస్తూ, సంప్రదిస్తూ, అనుసరిస్తూ, పూజిస్తూ వచ్చిన సూర్యచంద్ర నక్షత్ర సమూహాల ఎదుట ఆ ఎముకలను పరవడం జరుగుతుంది. వాటిని సమకూర్చరు. పాతిపెట్టరు. అవి భూమిమీద పెంటలాగా పడి ఉంటాయి. 3 ✝ఈ చెడ్డ వంశంలో మిగిలినవాళ్ళను నేను చెదరగొట్టినతరువాత, వాళ్ళు ఉన్న ప్రతి స్థలంలో అందరూ బ్రతుకుకు బదులు చావును కోరుకొంటారు. ఇది సేనలప్రభువు యెహోవా వాక్కు.4 ✝“నీవు వాళ్ళతో ఇలా అను:
యెహోవా చెప్పేదేమిటంటే, మనుషులు పడిపోతే
మళ్ళీ లేవకుండా ఉంటారా?
త్రోవ తప్పినవాడు తిరిగి రాకుండా ఉంటాడా?
5 మరి ఈ జెరుసలం ప్రజలు త్రోవ తప్పి
తిరిగి రాకుండా ఉండడం ఎందుకని?
వాళ్ళు మోసాన్ని✽ అంటిపెట్టుకొని ఉంటారు, విడవరు.
తిరిగి రావడానికి ఒప్పుకోకుండా ఉంటారు.
6 ✝నేను వంగి చెవులారా ఆలకించాను –
వాళ్ళు సరిగా మాట్లాడలేదు. ‘నేనేం చేశాను?’
అని చెప్పి ఒక్కడు కూడా పశ్చాత్తాపపడడం లేదు.
గుర్రం యుద్ధానికి చొరబడినట్లు ప్రతివాడూ
తన సొంత త్రోవలోబడి పోతూ ఉన్నాడు.
7 ✽ గాలిలో ఎగిరే సంకుబుడి కొంగకు
దాని నియామక కాలాలు తెలుసు.
గువ్వకు, మంగలకత్తిపిట్టకు, ఓదెకొరుకుపిట్టకు
వాటి వాటి రాకపోకల సమయాలు తెలుసు.
అయితే నా ప్రజకు యెహోవా నియమాలు
తెలియకుండా పొయ్యాయి.
8 ✽‘మేము జ్ఞానులం, మాకు యెహోవా ఉపదేశం ఉంది’
అని మీరు ఎలా చెపుతారు?
నిజమే, గాని ధర్మశాస్త్రులు మోసం చేసి,
తమ వ్రాతల్లో దానిని అపార్థానికి గురి చేశారు.
9 ✽“జ్ఞానులు సిగ్గు పాలవుతారు,
భయంతో చిక్కు పడిపోతారు.
యెహోవా వాక్కును వాళ్ళు తిరస్కరించారు,
మరి వాళ్ళకు ఉన్న జ్ఞానం ఏపాటిది?
10 ✝అందుచేత నేను వాళ్ళ భార్యలను పరాధీనం చేస్తాను.
వాళ్ళ పొలాలను ఇతరులు ఆక్రమిస్తారు.
వాళ్ళంతా – అల్పులైనా గొప్పవాళ్ళైనా –
అన్యాయంగా సంపాదించుకోవాలని చూస్తారు.
ప్రవక్తలు, యాజులు అందరూ మోసంగా వ్యవహరిస్తారు.
11 శాంతి లేనప్పుడు ‘శాంతి, శాంతి’ అంటూ వాళ్ళు
నా ప్రజ గాయాన్ని పైపైనే నయం చేస్తున్నారు.
12 తమ అసహ్యమైన ప్రవర్తన కారణంగా
వాళ్ళు సిగ్గుపడ్డారా? సిగ్గుపడనే లేదు.
సిగ్గు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు.
కనుక వాళ్ళు కూలిపోయే వాళ్ళతోకూడా కూలుతారు.
నేను వాళ్ళను దండించేటప్పుడు వాళ్ళు పడిపోతారు.
ఇది యెహోవా వాక్కు.
13 ✽నేను వాళ్ళ పంటను తీసివేస్తాను.
ద్రాక్షచెట్లకు పండ్లు ఉండవు. అంజూరుచెట్లకూ ఉండవు.
వాటి ఆకులు వాడిపోతాయి. వాళ్ళను నాశనం చేసే
వాళ్ళను నేను పంపిస్తున్నాను. ఇది యెహోవా వాక్కు.”
14 ✽“మనమిక్కడ ఎందుకు కూర్చుని ఉన్నాం?
సమకూడుదాం రండి!
ప్రాకారాలున్న పట్టణాలకు వెళ్ళి అక్కడే చనిపోదాం.
మనం యెహోవాకు వ్యతిరేకంగా అపరాధం చేశాం
గనుక మన దేవుడు యెహోవా మనలను నాశనానికి
అప్పగించి విష జలం మనకు త్రాగించాడు.
15 శాంతికోసం ఎదురు చూశాం గాని,
మంచి ఏమీ జరగలేదు.
క్షేమంకోసం చూశాం గాని, భయమే ప్రాప్తించింది.
16 దాను ప్రాంతంమీదుగా వస్తూ ఉన్న వాళ్ళ గుర్రాల
బుసలు వినబడుతూ ఉన్నాయి.
వాళ్ళ యుద్ధాశ్వాల సకిలింపుకు దేశమంతా
వణకుతూ ఉంది.
వాళ్ళు వచ్చి దేశాన్ని, ఇందులో ఉన్న సమస్తాన్ని,
పట్టణాలను, వాటిలో కాపురస్థులను నాశనం చేస్తారు.”
17 ✽యెహోవా చెప్పేదేమిటంటే,
“నేను మీమధ్యకు విష సర్పాలను,
మిణ్ణాగులను పంపిస్తాను. అవి మిమ్మల్ని కరుస్తాయి.
వాటి కాటుకు నివారణ మంత్రమేమీ లేదు.”
18 ✽నాకు మనసులో క్రుంగిపోయినట్లు ఉంది.
నా దుఃఖం ఎలా మటుమాయమవుతుంది?
19 ✽దూర దేశంనుంచి నా ప్రజ చేసే ఆక్రందన
వినబడుతూ ఉంది:
“యెహోవా సీయోనులో లేడా? దాని రాజు అక్కడ లేడా?”
“వాళ్ళు ఎందుకు పోతపోసిన విగ్రహాలను,
ఇతర దేశాల వ్యర్థ దేవుళ్ళను పెట్టుకొని
నన్ను విసికించారు?”
20 ✽“కోతకాలం గడిచిపోయింది.
పంట కూర్చుకొనే కాలం దాటిపోయింది.
ఇంకా మనకు విముక్తి లేదు.”
21 ✽ నా ప్రజ నశించిన స్థితిలో ఉన్న కారణంగా
నేనూ నశించాను. నేను శోకిస్తూ ఉన్నాను.
నాకు చాలా భయం పట్టుకొంది.
22 గిలాదు ప్రదేశంలో మందు లేదా?
అక్కడ వైద్యుడెవ్వడూ లేడా?
నా ప్రజకు ఆరోగ్యం ఎందుకు కలగలేదు?